Tuesday, 27 August 2024

బంగ్లాదేశ్ చేతిలో ఓడిన పాక్‌కు మరో దెబ్బ.. షాకిచ్చిన ఐసీసీ.. WTC ఫైనల్‌ ఆశలు గల్లంతు!

బంగ్లాదేశ్ చేతిలో ఓడిన పాక్‌కు మరో దెబ్బ.. షాకిచ్చిన ఐసీసీ.. WTC ఫైనల్‌ ఆశలు గల్లంతు!


         : రావల్పిండి టెస్టులో స్లో ఓవర్ రేటు నమోదు చేశారని పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ (ఐసీసీ) చర్యలు తీసుకుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ పాయింట్లలో కోత విధించింది. ఆరు ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేసిన పాకిస్థాన్ ఖాతా నుంచి ఆరు, నాలుగు ఓవర్లు తక్కువగా బౌలింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ ఖాతా నుంచి నాలుగు పాయింట్లు కోత విధించింది. రిజ్వాన్‌ పట్ల దురుసుగా ప్రవర్తించిన షకిబ్‌ హసన్‌పై కూడా చర్యలు తీసుకుంది.

ప్రధానాంశాలు:

రావల్పిండి టెస్టులో స్లో ఓవర్ రేటు నమోదు

పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ జట్లపై ఐసీసీ చర్యలు

డబ్ల్యూటీసీ పాయింట్లలో కోత విధించిన ఐసీసీ

బంగ్లా చేతిలో ఓడిన పాక్ జట్టుకు మరో దెబ్బ

    అసలే సొంతగడ్డపై పసికూన బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్‌ ఓడిపోయి నిరాశలో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ గట్టి షాక్ ఇచ్చింది. రావల్పిండి టెస్టులో స్లో ఓవర్‌ రేటు నమోదు చేసిన కారణంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌లో పాయింట్ల కోత విధించింది. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో గెలిచిన బంగ్లాదేశ్‌పై కూడా ఇదే తరహా చర్యలు తీసుకుంది. ఆ జట్టు కూడా నిర్ణీత సమయంలోగా బౌలింగ్‌ కోటాను పూర్తి చేయలేకపోయింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) సోమవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది.

           ఈ మ్యాచ్‌లో మొత్తంగా ఆతిథ్య పాకిస్థాన్ జట్టు నిర్ణీత సమయంలోగా ఏకంగా ఆరు ఓవర్లు తక్కువగా వేసింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ (2023-2025)లో ఐసీసీ ఆరు పాయింట్లు కోత విధించింది. దీంతో ఇప్పటికే మ్యాచ్‌లో ఓడన పాకిస్థాన్‌కు బిగ్‌ షాక్‌ తగిలినట్లయింది. ఇదే సమయంలో బంగ్లాదేశ్‌పై కూడా ఐసీసీ చర్యలు తీసుకుంది. ఆ జట్టు కూడా నిర్ణీత సమయంలోగా బౌలింగ్ కోటా పూర్తి చేయలేకపోయింది. నాలుగు ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేసినందుకు గానూ.. నాలుగు పాయింట్లు కోత విధించింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌ ఫైనల్‌ చేరాలన్న పాకిస్థాన్ ఆశలు మరింత సంక్లిష్టంగా మారాయి.

షకిబ్‌ పైనా చర్యలు..

ఇక ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటింగ్ సందర్భంగా దురుసుగా ప్రవర్తించిన బంగ్లాదేశ్‌ స్టార్ ఆల్‌రౌండర్‌ షకిబ్ అల్ హసన్‌పై కూడా ఐసీసీ చర్యలు చేపట్టింది. ఈ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో మహమ్మద్‌ రిజ్వాన్‌ బ్యాటింగ్‌కు సిద్ధంగా లేకపోవడంతో ఆగ్రహానికి గురైన షకిబ్.. అతడివైపు బంతిని విసిరాడు. అది వెళ్లి కీపర్‌ చేతిలో పడింది. ఇది జరిగిన వెంటనే అంపైర్‌ కూడా మందలించాడు. ఈ నేపథ్యంలో షకిబ్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. అతడి మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోత విధించింది. అంతేకాకుండా ఐసీసీ కోడ్ ఆఫ్‌ కండక్ట్‌ లెవల్ 1ను ఉల్లంఘించినందుకు ఒక డిమెరిట్ పాయింట్‌ను కూడా అతడి ఖాతాలో జమచేసింది.

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్‌.. పాక్‌ గడ్డపై అడుగుపెట్టింది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్‌ను కుప్పకూల్చి అనూహ్య విజయాన్ని నమోదు చేసింది. దీంతో సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసి స్వయంగా ఓటమిని ఆహ్వానించిన పాక్‌ జట్టుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

No comments:

Post a Comment