వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ఎక్కువగా చెట్లు పెంచాల్సిన అవసరం ఉందని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన "స్వచదనం-పచ్చదనం" కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో నిర్వహించిన "స్వచ్ఛదనం -పచ్చదనం" కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెట్లను పెంచకపోవడం, ఉన్న చెట్లను నరికి వేయడం వంటి కారణాలవల్ల వాతావరణ సమతుల్యాన్ని కాపాడడంలో విఫలమవుతున్నామని, అందువల్ల పచ్చదనాన్ని కాపాడాల్సిన అవసరం అందరిపై ఉందని ,ఇందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమంలో విద్యార్థులు ,యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని, మొక్కల పెంపకంలో భాగంగా పండ్ల మొక్కలతో పాటు, పూల మొక్కలను పెంచాలని సూచించారు. మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమాన్ని 5 రోజులు మాత్రమే కాకుండా సంవత్సరం పొడుగునా నిర్వహించాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ "స్వచదనం-పచ్చదనం" కార్యక్రమంలో పరిశుభ్రతతో పాటు, మొక్కలు నాటడం, నీటి సంరక్షణ కట్టడాల నిర్మాణం తదితర అంశాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం నిర్వహించే డ్రైడే ఫ్రైడే కార్యక్రమంపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన తీసుకురావాలని అన్నారు. ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, రోడ్లపై నీరు నిల్వ లేకుండా మొరం ,మట్టితో పూడ్చివేయాలన్నారు. "స్వచ్ఛదనం-పచ్చదనం" కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ఆశా, అంగన్వాడితోపాటు, అన్ని వర్గాల వారు పాల్గొనాలని, అప్పుడే కార్యక్రమం విజయవంతం అవుతుందని తెలిపారు. మున్సిపాలిటీలలో ప్రజల భాగస్వామ్యం ఎక్కువగా ఉండాలని అన్నారు.వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు,పరిసరాలను సైతం శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రజలకు అవగాహన కల్పించి ఇంకుడు గుంతలను నిర్మించాలని, మున్సిపాలిటీలలో ఈ జి ఎస్ కింద ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని సూచించారు.
స్థానిక శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ "స్వచదనం- పచ్చదనం" ప్రాముఖ్యతను వివరిస్తూ విరివిగా మొక్కలు నాటినప్పుడే వాతావరణ సమతుల్యంతో పాటు, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని అన్నారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.పూర్ణచంద్ర, మున్సిపల్ చైర్మన్ వెంకట్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ పి. వీరేందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .
అనంతరం విద్యార్థులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు
____________________________________
జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*
No comments:
Post a Comment