Sunday, 4 August 2024

ఈ రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలోనూ వర్షాలు

  ఈ రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్.. ఏపీ, తెలంగాణలోనూ వర్షాలు


 : ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటుగా వివిధ రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

వాతావరణ శాఖ హెచ్చరిక

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురవనున్నాయి. ఆదివారం సైతం పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. అయితే మరికొన్ని రోజులు కూడా వానలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.

భారత వాతావరణ శాఖ తూర్పు రాజస్థాన్, తూర్పు మధ్యప్రదేశ్, పశ్చిమ మధ్యప్రదేశ్, గుజరాత్, కొంకణ్, గోవా, సెంట్రల్ మహారాష్ట్ర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

'రుతుపవనాలు చురుకైన దశలో ఉన్నాయి. ఈశాన్య మధ్యప్రదేశ్‌లో లోతైన అల్పపీడనం ఉంది. నైరుతి రాజస్థాన్‌లో అల్పపీడనం ఉంది. పశ్చిమ మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, గుజరాత్, కొంకణ్ ప్రాంతం, గోవా, మధ్య మహారాష్ట్రలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశాం. రెడ్ అలర్ట్‌ని కూడా జారీ చేశాం.'అని IMD శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ కుమార్ తెలిపారు.

IMD తన తాజా ప్రెస్ బులెటిన్‌లో రాబోయే ఏడు రోజుల్లో జమ్మూ-కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లలో ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. వారంలో పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో చెదురుమదురు వర్షాలు వానలు పడనున్నాయి.ఈ వారంలో తూర్పు, ఈశాన్య భారతదేశంలో ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది.

ఈ వారంలో కొంకణ్, గోవా, గుజరాత్ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షపాతం ఉంటుంది. మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడా, సౌరాష్ట్ర, కచ్‌లలో అక్కడక్కడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

కేరళ , పుదుచ్చేరిలోని మహే, లక్షద్వీప్, కోస్టల్ కర్నాటకలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. అదే సమయంలో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

No comments:

Post a Comment