Telangana Police | ఖాకీల కక్కుర్తి.. వ్యభిచార గృహాలనూ వదలట్లే!
నగరంలో కీలకమైన జోన్‌లో కొందరు పోలీసులు సెటిల్‌మెంట్లు, వ్యభిచార గృహాల
నుంచి నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నారు. కొన్నిసార్లు చట్టం నేరస్తులకు చుట్టమవుతోంది. క్రిమినల్స్‌కు అండగా ఖాకీలు నిలుస్తున్నారు.
ఖాకీల కక్కుర్తి.. వ్యభిచార గృహాలనూ వదలట్లే!
పైసలిస్తే చాలు.. ‘నో’ అరెస్ట్
లైంగికదాడి కేసుల్లో లక్షలతో రాజీ
నెల వారీగా రూ.4 లక్షల మామూళ్లే టార్గెట్
సెటిల్‌మెంట్ల కింగ్‌గా ఆ ఠాణా ఇన్‌స్పెక్టర్
కీలక జోన్‌లో ఆ పీఎస్ పేరు చెబితే హడల్
Telangana Police | వెంగళరావునగర్, ఆగస్టు 25: నగరంలో కీలకమైన జోన్‌లో కొందరు పోలీసులు సెటిల్‌మెంట్లు, వ్యభిచార గృహాల నుంచి నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నారు. కొన్నిసార్లు చట్టం నేరస్తులకు చుట్టమవుతోంది. క్రిమినల్స్‌కు అండగా ఖాకీలు నిలుస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడుతూ.. నేరస్తులు చట్టం నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలో సూచిస్తూ.. తాము అడిగినంత ఇస్తే.. అటు మేం బాగుంటాం.. ఇటు మీరూ బాగుంటరంటూ సెటిల్‌మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
కీలక జోన్‌లోని ఓ కీలక పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న అధికారి నేరుగా సెటిల్‌మెంట్లకు అలవాటుపడ్డాడు. స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం చేయకపోగా.. ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదుదారులపైనే తప్పుడు సమాచారమిస్తూ నిందితులకు తన వంతు సహకారం అందిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సెటిల్‌మెంట్ల వ్యవహారంలో అక్కడ పనిచేసే ఇన్‌స్పెక్టర్, డీఐ, ఎస్సైల మధ్య అంతర్గత యుద్ధం జరుగుతున్నదని సిబ్బంది చర్చించుకుంటున్నారు. ఈ ఠాణాలో సెటిల్‌మెంట్ కింగ్‌గా మారిన ఆ ఇన్‌స్పెక్టర్ పేరు చెబితే.. ఆ పీఎస్‌లో హడెలిత్తిపోతున్నారు.
రూ.6 లక్షలు..
అనంతపురానికి చెందిన వివాహిత (29) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసింది. ఆమె చేస్తున్న ఆ ప్రాజెక్ట్ పూర్తవ్వడంతో ఉద్యోగం పోయింది. ఆమె మళ్లీ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న సమయంలో ఫేస్‌బుక్‌లో హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు పరిచయమయ్యాడు. తాను జాబ్ కన్సల్టెంట్‌నని, హైదరాబాద్‌కు వస్తే ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించాడు. దీంతో ఆమె తన భర్త, నాలుగేండ్ల కుమారుడితో కలిసి నగరానికి వచ్చింది. తన కార్యాలయానికి రెజ్యుమ్‌తో రావాలని అతడు సూచించాడు. దీంతో ఆమె అక్కడికి వెళ్లడంతో లైంగికదాడికి పాల్పడ్డాడు.
బయటకు వచ్చి ఏడుస్తుండటంతో మరో యువతి అక్కడికి వచ్చి.. తనకు కూడా అన్యాయం చేశాడని, వీడిని ఎలా నమ్మి ఇంతదూరం వచ్చావంటూ చెప్పింది. దీంతో బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. లైంగికదాడికి పాల్పడ్డ నిందితుడు అతడి స్నేహితుడికి బాధితురాలి నంబర్ ఇచ్చాడు. అతడు కూడా తాను ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఫోన్ చేసి.. వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. దీనిపై కూడా బాధితురాలు ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదైంది.
ఈ కేసులో ఇన్‌స్పెక్టర్ మొదట బాధితురాలిపైనే ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారమిచ్చాడు. ఆమె డబ్బులు ఆశిస్తుందంటూ అధికారులకు చెప్పి.. ఆ కేసు తీవ్రతను తగ్గించాడు. ఆ తరువాత రెండు కేసుల్లో నిందితులను పిలిపించాడు. ‘కేసు పెద్దదవుతోంది.. నేను ఆ అమ్మాయితో మాట్లాడుతాను.. మీరు రూ. 6 లక్షలు ఇవ్వండి’ అంటూ సెటిల్‌మెంట్ చేశాడు. నిందితుల నుంచి రూ. 6 లక్షలు వసూలు చేసి.. అందులో సగం బాధితురాలికి ఇచ్చి.. మిగతా సగం రూ. 3 లక్షలు ఇన్‌స్పెక్టర్ కొట్టేశాడనే ఆరోపణలు ఉన్నాయి.
‘పెండ్లయ్యింది. పిల్లలున్నారు. కేసులు పెట్టుకొని ఎన్నాళ్లు కొట్లాడుతావు. డబ్బులు వచ్చాయి. ఈ కేసు మర్చిపో’.. అంటూ బాధితురాలికి ఉచిత సలహా ఇచ్చాడు. ‘నీవు కేసు విత్‌డ్రా చేసుకుంటున్నట్లు కోర్టులో ఒక పిటిషన్ వేస్తే. అటు నిందితులు సేఫ్ అవుతారు.. మేం కూడా.. నీవు కోర్టులో పిటిషన్ వేశావని కేసు క్లోజ్ చేస్తాం.. ఎవరి చేతికి మట్టి అంటకుండా అన్ని సర్దుకుంటాయి’.. అంటూ ఆ ఇన్‌స్పెక్టర్ బాధితురాలు, నిందితుల మధ్య రాజీ కుదిర్చి సెటిల్‌మెంట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
లక్ష ఇవ్వకుంటే అరెస్ట్ చేస్తా..
తనతో సహజీవనం చేసి పిల్లలు పుట్టిన తరువాత ఒక వ్యాపారి మోసం చేశాడని, అతడిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ ఓ మహిళ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అయితే, ఈ కేసులో ఒక బస్తీ లీడర్ ఇన్‌స్పెక్టర్‌తో మాట్లాడి.. సెటిల్‌మెంట్ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ‘నీవేమి చేసుకుంటావో నీ ఇష్టం. నాకు లక్ష రూపాయలు ఇప్పించు. లేదంటే వ్యాపారిని అరెస్ట్ చేస్తా’.. అంటూ మధ్యవర్తితో భేరం కుదుర్చుకున్నాడు. చివరకు లక్ష రూపాయలు ఇవ్వడంతో ఆ కేసును ఇన్‌స్పెక్టర్ పక్కన పెట్టాడు. బాధితురాలు స్టేషన్ చుట్టూ తిరుగుతోంది.
వ్యాపారి నుంచి రూ. 50వేలు..
అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఓ వ్యాపారిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకొని ఠాణాలో అప్పగిస్తే, ఆ వ్యాపారి వద్ద నుంచి రూ. 50 వేలు వసూలు చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. మరో ఘటనలో ఇదే ఠాణాలో పనిచేసే ఇద్దరు క్రైమ్ కానిస్టేబుళ్లు పక్కనే ఉన్న మరో కమిషనరేట్‌లోని స్క్రాప్ వ్యాపారిని బెదిరించి.. లక్ష రూపాయలు వసూలు చేశారనే విమర్శలు ఉన్నాయి. ఈ స్టేషన్‌కు నెలకు రూ. 4 లక్షల వరకు మామూళ్లు వస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గస్తీ, పెట్రోలింగ్ చేసే సిబ్బందికి టార్గెట్లు ఇస్తూ.. వసూళ్లు చేయిస్తున్నారనే విమర్శలున్నాయి.
వ్యభిచార గృహాలనూ వదలట్లే!
అక్కడి నుంచి కూడా ఖాకీలకు మామూళ్లు
కొందరు కామవాంఛ సైతం తీర్చుకుంటున్న వైనం
మధురానగర్ ఠాణా పరిధిలో వెలుగులోకొచ్చిన వ్యవహారం
వాంగ్మూలంలో వెల్లడించిన నిందితులు
విచారణ చేస్తున్నాం: మధురానగర్ ఇన్‌స్పెక్టర్
సిటీబ్యూరో/వెంగళరావునగర్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): అవినీతి, అక్రమాలకు పాల్పడొద్దంటూ ఎన్ని హెచ్చరికలు చేసినా కిందిస్థాయి సిబ్బంది మైండ్ సెట్ మారడం లేదు. వెస్ట్‌జోన్ పరిధిలోని మధురానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహించే ముగ్గురు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు అవినీతి అక్రమాలు వెలుగులోకొచ్చాయి. వారు చేసిన చేష్టలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. వ్యభిచార గృహ నిర్వాహకులను అరెస్ట్ చేసిన సమయంలో నిందితులు ఈ విషయాన్ని వెల్లడించడంతో దర్యాప్తు అధికారులు సైతం విస్తుపోయారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.. మధురానగర్ ఠాణా పరిధిలోని ఇంజినీర్స్ కాలనీలో రెయిన్ ఫ్యామిలీ సెలూన్ స్పా పేరుతో వ్యభిచార గృహం నడుస్తుందనే సమాచారం రావడంతో ఈ నెల 23న టాస్క్‌ఫోర్స్ పోలీసులు, మధురానగర్ పోలీసులు కలిసి దాడి చేశారు. వ్యభిచార గృహం నిర్వహిస్తున్న బాలరాజ్, రజితను అరెస్ట్ చేశారు. నిందితులను విచారణ చేసే సందర్భంగా.. పెట్రోలింగ్ నిర్వహించే కానిస్టేబుళ్లకు నెలవారీగా మామూళ్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. దామోదర్, సతీశ్, నాగరాజు అనే కానిస్టేబుల్, రాజు అనే హోంగార్డుకు నెలవారీగా మామూళ్లు ఇస్తున్నామనే విషయాన్ని వెల్లడించారు. వ్యభిచార గృహానికి వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చే యువతులతో కొందరు కామవాంఛను కూడా తీర్చుకుంటున్నారని, ఎవరికీ చెప్పొద్దంటూ బెదిరింపులకు కూడా దిగుతున్నారంటూ తమ వాంగ్మూలంలో వెల్లడించినట్లు తెలిసింది. నిందితులిచ్చిన వాంగ్మూలంలో దర్యాప్తు అధికారుల ముందు ఈ కానిస్టేబుళ్ల విషయాన్ని కూడా ప్రాస్తావించారు. దీనిపై మధురానగర్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌తో ‘నమస్తే తెలంగాణ’ మాట్లాడగా.. నిందితులు ఈ విషయాన్ని వెల్లడించిన మాట వాస్తవమేనన్నారు. అయితే, నిజా నిజాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామన్నారు. దర్యాప్తులో నిజమని తేలితేనే నిందితులు చెప్పింది నిజమని తెలుస్తుందన్నారు.
తప్పించే యత్నం జరుగుతుందా..?
స్పా సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముందుగా దాడి చేసి నిందితులను మధురానగర్ పోలీసులకు అప్పగించిన తరువాత మధురానగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే స్పా సెంటర్ వద్ద సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న సమయంలో స్పా సెంటర్‌పై పోలీసులు దాడి చేయడానికి 20 నిమిషాల ముందు పెట్రోలింగ్ వాహనం అక్కడికి వచ్చిపోయినట్లు దృశ్యాలు కనిపించాయి. ఆ వాహనం ఎందుకు వచ్చిందనే విషయాన్ని స్పా నిర్వాహకుల వద్ద ఆరా తీస్తున్న క్రమంలో కానిస్టేబుళ్ల వ్యవహారం బయటకు వచ్చినట్లు సమాచారం. అయితే, సీసీ కెమెరాల విషయాన్ని పోలీసులు బయటపెట్టకుండా.. అక్కడ సీసీ కెమెరాలు పనిచేయడం లేదని చెప్పే ప్రయత్నం చేస్తుండటంతో కానిస్టేబుళ్లను రక్షించే ప్రయత్నం జరుగుతుందనే అనుమానాలు కలుగుతున్నాయి.
No comments:
Post a Comment