పేదోళ్ల ఇండ్లపైకి బుల్డోజర్.. మరి మంత్రి సౌధం మీదికి సాగలేదేమి?
రాష్ట్రంలో బుల్డోజర్ పాలన కొనసాగుతున్నది. ఎన్నో ఏండ్లుగా నివాసముంటున్న పేదల ఇండ్లను సైతం బుల్డోజర్లతో కూలగొట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
.సామాన్యుడి బతుకును కూల్చిన బుల్డోజర్
- పోలీసు నీడలో కూల్చివేతలు
- తెల్లారేసరికే వచ్చిన అధికారులు
- నోటీసులు ఇవ్వకుండానే నేలమట్టం!
- రాయదుర్గంలో రోడ్డునపడ్డ బాధిత కుటుంబాలు
- మమ్మల్ని నిర్బంధించి ఇండ్లు కూల్చిండ్రు
- అనుమతులు, స్టే ఉన్నా కూలగొట్టిండ్రు : బాధితుల ఆవేదన
- యూనిటీ మాల్ కోసమే కూలదోశారని ఆరోపణ
హైదరాబాద్‌లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. శేరిలింగంపల్లి మండల పరిధిలోని రాయదుర్గంలో సోమవారం జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, లిడ్‌క్యాప్, టీఎస్‌ఐఐసీ అధికారులు భారీ పోలీసు బందోబస్తు నడుమ మూడు నివాసాలు, ఐదు నిర్మాణాలు కూల్చివేశారు. తాత ముత్తాతల నుంచి నివాసముంటున్న పేదల ఇండ్లను సైతం బుల్డోజర్లతో కూల్చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉదయం ఏడుగంటలకే పోలీసు బలగాలతో వచ్చిన అధికారులు ఇండ్లను కూలగొట్టడంతో ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇవి హైడ్రా కూల్చివేతలు కానప్పటికీ ఇలా అకస్మాత్తుగా వచ్చి ఇండ్లను కూల్చేయడంతో రోడ్డున పడ్డ కుటుంబాల వేదన చెప్పనలవి కాకుండా ఉన్నది. అధికారులు కూల్చివేతలు చేపట్టిన స్థలంపై కోర్టు స్టే ఉన్నది. అయినా అదేమీ పట్టని అధికారులు బాధితుల ఆక్రందనల మధ్యే ఇండ్లను కూల్చేశారు.
గంట వ్యవధిలోనే నేలమట్టం
రాయదుర్గం 1 నుంచి 41 వరకు ఉన్న సర్వే నంబర్లలో 37.08 ఎకరాల భూమి ఉన్నది. ఇది హైదరాబాద్ టెన్నరీస్‌కు చెందినదని, దాని పూర్తి హక్కులు తమకు వంశపారపర్యంగా వస్తున్నాయని కొన్ని కుటుంబాలు ఇక్కడ ఇండ్లు కట్టుకొని ఉంటున్నాయి. కాగా ఇవి లిడ్‌క్యాప్ (లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట కార్పొరేషన్)కు చెందిన భూములుగా అధికారులు వాదిస్తున్నారు. ఈ క్రమంలో భూములపై హైకోర్టులో కేసు కొనసాగుతున్నది. ఈ క్రమంలో సోమవారం తెల్లారుజామున ఐదు గంటలకు జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, లిడ్‌క్యాప్, టీఎస్‌ఐఐసీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఇండ్లు కూల్చివేస్తామని సమాచారం ఇచ్చి ఉదయం ఏడు గంటల్లోపు వంద మంది పోలీసు బలగాలు, బుల్డోజర్లు అక్కడికి చేరుకున్నాయి. ఈలోగా కొంతమేర సామగ్రిని వారంతా తీసుకొని బయటికి వచ్చారు. ఏడు గంటల ప్రాంతంలో కూల్చివేతలు మొదలు కావడంతో బాధితులు లబోదిబోమని అడ్డుకు నే ప్రయత్నంచేశారు. పోలీసులు తమను పక్కకు తీసుకెళ్లి, కదలకుండా చుట్టూ మోహరించినట్టు బాధితులు తెలిపారు. గంట వ్యవధిలోనే మూడు ఇండ్లతోపాటు సమీపంలోని ఐదు నిర్మాణాలను నేలమట్టం చేశారు.
యూనిటీ మాల్ కోసమే?
1942లో తమ పూర్వీకులు హైదరాబాద్ టెన్నరీస్ సంస్థను ఏర్పాటు చేసి అక్కడే నివా సం ఉన్నారని, ప్రస్తుతం అధికారులు కూల్చివేసిన ఇండ్లకు సైతం ఇంటి నంబర్లతోపాటు కరెంటు బిల్లులు, పన్నులను రెగ్యులర్‌గా జీహెచ్‌ఎంసీకి చెల్లిస్తున్నామని బాధితులు తెలిపా రు. హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌కోను పరిగణనలోకి తీసుకోకుండా కూల్చివేయడం రాక్షస పాలన కు నిదర్శనమంటూ ఆవేదన వ్యక్తంచేశారు. లిడ్‌క్యాప్ ఆధ్వర్యంలో యూనిటీ మాల్ నిర్మాణం కోసం కేంద్రం నుంచి రూ.500 కోట్లు వచ్చాయని, తమకు భూములు అప్పగించాలంటూ బసిరత్ అలీఖాన్ కుటుంబంపై లిడ్‌క్యాప్ ఎండీ శ్రీనివాస్ నాయక్, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌రంజన్ ఒత్తిడి చేసినట్టు, లిడ్‌క్యాప్ జీఎం వేణుమాధవ్ ద్వారా చర్చలకు పిలిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సదరు స్థలం తమ కుటుంబానికి చెందినదని, ఏవైనా సమస్యలుంటే కోర్టు ద్వారా తేల్చుకోవాలని లిడ్‌క్యాప్ యాజమాన్యానికి తెలిపామని చెప్పారు. ‘మీ కుటుంబాన్ని రోడ్డుపైకి లాగి ఆ భూమిని మా ఆధీనంలోకి తీసుకుంటం’ అంటూ లిడ్‌క్యాప్ యాజమాన్యం బెదిరించినట్టు బాధితులు వాపోతున్నారు.
అధికారులు రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నరు
మా ముత్తాతలు హైదరాబాద్ టెన్నరీస్ సంస్థను స్థాపించినప్పటికే 37.08 ఎకరాల భూమి ఉన్నది. కానీ అధికారులు స్థలమంతా లిడ్‌క్యాప్‌దంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నరు. లిడ్‌క్యాప్ సంస్థకు కేవలం 5 ఎకరాల స్థలం మాత్రమే ఉన్నది. మా భూములను అన్యాయంగా, దౌర్జన్యంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంట్లో పిల్లలు, పెద్ద వయస్సు వారున్నారన్న కనీస జ్ఞానం లేకుండా ఉదయం 7 గంటలకే వచ్చి ఇండ్లు కూల్చివేశారు. ఇప్పుడు మా కుటుంబాలు ఎక్కడికి పోవాలి? ఉదయం నుంచి రోడ్డుపై పడిగాపులు కాస్తున్నం. ప్రజాపాలనలో అధికారులు రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నరు.
-నసిర్ అలీఖాన్, బాధితుడు
ప్రజా పాలనంటే ఇదేనా?
ఈ భూములపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి. కూల్చివేతలు చేపట్టవద్దని స్టేటస్ కోలు ఉన్నయి. అయి నా అధికారులు ఎలాంటి ముంద స్తు నోటీసులు ఇవ్వకుండా, ఇంట్లో చిన్న పిల్లలు, పెద్దలు ఉన్నారన్న కనీస సోయి లేకుండా కూల్చివేశారు. హృద్రోగ సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మా కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్లాలో అర్థంకాని పరిస్థితి తెచ్చారు. రేవంత్‌రెడ్డి చెబుతున్న ప్రజాపాలన అంటే ఇదేనా?
-ముఖ్తర్ అలీఖాన్, బాధితుడు
మరి మంత్రి సౌధం మీదికి సాగలేదేమి?
‘ప్రభుత్వ భాగస్వాములకూ ఫాంహౌస్‌లు ఉన్నాయి. నాపై ఎన్నో ఒత్తిళ్లు ఉన్నా ఎవర్నీ వదలను. మిత్రుల ఫాంహౌస్‌లు ఉన్నా తొలగించేందుకే హైడ్రాను ఏర్పాటు చేశా’.. ఈ నెల 25న సీఎం రేవంత్ రెడ్డి మాట ఇది.
‘కొత్త టేపులు తెచ్చి కొలుచుకోండి. నా ఫాంహౌస్ ఎఫ్‌టీఎల్‌లోనో, బఫర్ జోన్‌లోనో ఉంటే కూల్చుకోండి. ఒక్క ఇటుక పెళ్ల ఉన్నా వెంటనే పడగొట్టండి. దిస్ ఈజ్ మై చాలెంజ్. ఈ వేదికపై నుంచి హైడ్రా అధికారి రంగనాథ్‌ను కూడా ఆదేశిస్తున్నా’.. ఈ నెల 24న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చాలెంజ్ ఇది.
ఎవర్నీ వదిలేదని రేవంత్‌రెడ్డి అన్నా.. తన ఇల్లు బఫర్ జోన్లో ఉంటే కూల్చేయండి అంటూ ఆయన మంత్రివర్గ సహచరుడు పొంగులేటి ఆదేశించినా.. హైడ్రా అటువైపే పోలె. కానీ, ఏ నోటీసు ఇవ్వకుండానే సామాన్యుడి ఇంటి మీదికి మాత్రం బుల్డోజర్ వచ్చింది. 40 ఏండ్లుగా ఉంటున్న పెంకుటిల్లును మాత్రం కూలగొట్టింది.
ఏది ఎఫ్‌టీఎల్, ఏదీ బఫర్? ఏది ప్రొహిబిటెడ్ జోన్, ఏది రిస్ట్రిక్టెడ్ జోన్? కొలతలు వేసింది ఎవరు? హద్దురాళ్లు ఎక్కడున్నాయి? ఇవేవీ తెలియకున్నా కొందరి ఇండ్లు కూలుతున్నాయి. కొందరి ఇండ్లు నిలుస్తున్నాయి. నా ఇల్లు ఎఫ్‌టీఎల్‌లోనో, బఫర్‌లోనో ఉంటే కూల్చుకోండి అంటూ సవాల్ విసిరిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. ఎఫ్‌టీఎల్‌కు అర కిలోమీటర్ దాకా నిర్మాణాలకు నిషిద్ధ ప్రాంతమే! అంటూ నమస్తే తెలంగాణ బయటపెట్టిన మెమోపై మాత్రం నోరువిప్పలేదు. నదిపై నిర్మించిన జలాశయాల వద్ద నిర్మాణ అనుమతులకు సంబంధించి 2012లో ప్రభుత్వం తెచ్చిన168 జీవోనూ ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చింది. దీనిపైనా సీఎం సహా మంత్రులెవరూ కిమ్మనలేదు. మరి 500 మీటర్లలోపు నిర్మాణాలు సక్రమమా? అక్రమమా? ఆ ఇండ్లు బఫర్ జోన్‌లో ఉన్నట్టా? లేనట్టా? ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్టా? లేనట్టా? నిర్మాణాలు సక్రమమైతే సర్వే చేసి నిర్ధారించి, బహిరంగ ప్రకటన చేయొచ్చుగా? అక్రమమైతే హైడ్రా రంగంలోకి దిగదెందుకు? హైడ్రా తన పరిధి దాటి కూడా గండిపేట జలాశయం ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలు అక్రమమంటూ కొన్నింటిని కూల్చివేసింది. మరి మిగతా వాటిని ఎందుకు వదిలిపెట్టినట్టు? ముఖ్యంగా నిబంధనల ప్రకారం తన నిర్మాణాలు లేనట్టయితే కూల్చుకోండి అని మంత్రి పొంగులేటి ఆఫర్ ఇచ్చినా హైడ్రా రంగంలోకి దిగేందుకు ఏ శక్తి అడ్డుకుంటున్నది?
No comments:
Post a Comment