రెచ్చిపోయిన చైన్ స్నాచర్స్.. గాల్లో పోలీసులు కాల్పులు..
హైదరాబాద్ నగరంలో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. పట్టపగలే బరితెగించిన చైన్ స్నాచర్లు ఓ మహిళ మెడలో ఉన్న బంగారం చైన్ తెంపుకుని పరారయ్యారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివశక్తి నగర్ ఏరియాలో ఉదయం కొందరు చైన్ స్నాచర్స్ తెగబడ్డారు. రోడ్డుపై వెళ్తున్న మహిళ మెడలో బంగారు గొలుసుని తెంపుకొని పారిపోయారు. పోలీసులు ఈ విషయాన్ని పసిగట్టి.. చైన్ స్నాచర్స్ ను పట్టుకునేందుకు వెంట పడ్డారు.
చిక్కినట్లే చిక్కి పారిపోతున్న వారిని భయపెట్టేందుకు పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు. కాల్పుల కారణంగా భయపడిపోయిన చైన్ స్నాచర్స్ కంగారు పడ్డారు. ఆ సమయంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి దొంగలను పట్టుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఒకరి పేరు అమీర్ అని పోలీసులు వెల్లడించారు. మిగిలిన వారు పారిపోయారని.. వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని సైదాబాద్ పోలీసులు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ క్రైమ్ రేట్ గణనీయంగా పెరుగుతుంది. దొంగతనాలు, హత్యలు, యాక్సిడెంట్లు, అత్యాచారాల వంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన, పోలీసులు కఠిన శిక్షలు వేసిన నిందితుల్లో మార్పు రావడం లేదు. జైలుకు వెళ్లొచ్చినా కూడా వారి ప్రవర్తనలో కూసంత మార్పు కూడా కనిపించడం లేదు. అదే పనిని పరిపాటుగా చేస్తూ తమ వంకరబుద్ధిని చూపిస్తున్నారు. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలని మహిళలు కోరుతున్నారు. అంతే కాదు.. పట్టుబడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
No comments:
Post a Comment