కోల్‌కతాలో దారుణం.. వైద్యురాలిపై లైంగిక దాడి, హత్య
కోల్‌కతాలో దారుణం.. వైద్యురాలిపై లైంగిక దాడి, హత్య కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ శవ పరీక్ష నివేదిక వెలువడింది. ఆమెపై లైంగిక దాడి చేసిన అనంతరం హత్య చేసినట్టు అది నిర్ధారించింది.
కోల్‌కతా, ఆగస్టు 10: కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ శవ పరీక్ష నివేదిక వెలువడింది. ఆమెపై లైంగిక దాడి చేసిన అనంతరం హత్య చేసినట్టు అది నిర్ధారించింది. ఈ కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు హాస్పిటల్‌తో ఎలాంటి సంబంధం లేని బయటి వ్యక్తి అని, ఘటన జరిగిన రోజు అతను దవాఖానలోని అన్ని విభాగాలలో స్వేచ్ఛగా తిరిగాడని పోలీసులు శనివారం తెలిపారు. అతని కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని, ఈ నేరంతో అతడికి ప్రత్యక్ష సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్నట్టు వారు చెప్పారు.
అతడిని సెల్దా కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం 14 రోజుల పోలీస్ రిమాండ్‌కు ఆదేశించింది. ఛాతీ వైద్య విభాగంలో పీజీ రెండో సంవత్సరం విద్యార్థిని అయిన బాధితురాలు గురువారం రాత్రి డ్యూటీలో ఉండగా ఆమెను హత్య చేశారు. సెమినార్ హాల్‌లో అర్ధనగ్నంగా పడిఉన్న ఆమె దేహంపై గాయాల గుర్తులున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు డాక్టర్లను కూడా పోలీసులు విచారిస్తున్నారు. తన కుమార్తెపై అత్యాచారం చేసి హత్య చేశారని బాధితురాలి తండ్రి ఆరోపించారు. అయితే వాస్తవాలు కప్పిపుచ్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇది ఒక దురదృష్టకర ఘటన అని, హంతకుడికి ఉరి శిక్ష వేయించడానికి తమ ప్రభుత్వం వెనుకాడదని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.
No comments:
Post a Comment