Sunday, 25 August 2024

బ్లాక్ డీల్స్‌తో వేల కోట్లు వెనకేస్తున్న అదానీ.. కంపెనీలో వాటాల విక్రయం.. చేతులు మారిన 7 కోట్ల షేర్లు!


 బ్లాక్ డీల్స్‌తో వేల కోట్లు వెనకేస్తున్న అదానీ.. కంపెనీలో వాటాల విక్రయం.. చేతులు మారిన 7 కోట్ల షేర్లు!

Adani Block Deals: స్టాక్ మార్కెట్లలో కొంత కాలంగా బ్లాక్ డీల్స్ పెరిగిపోయాయి. మార్కెట్ ట్రేడింగ్ ఆరంభంలో స్పెషల్ ట్రేడింగ్ విండో ద్వారా ఈ ట్రాన్సాక్షన్ జరుగుతుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా దిగ్గజ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ సంస్థ అంబుజా సిమెంట్స్‌లో 2.8 శాతం వాటా విక్రయించారు. కోట్లాది షేర్లు చేతులు మారగా.. ఏకంగా రూ. 4200 కోట్లకు పైగా వెనకేసుకున్నారు అదానీ. ఈ క్రమంలోనే షేరు ధర పెరిగింది.

అదానీ బ్లాక్ డీల్స్

                 Ambuja Cements Adani Deal: గతంలో దేశంలోనే దిగ్గజ పారిశ్రామిక వేత్త, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ విస్తృతంగా పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. వేల కోట్లతో పెద్ద పెద్ద సంస్థల్లో తొలుత పెట్టుబడులు పెట్టి తర్వాత వాటిల్లో మెజార్టీ వాటా దక్కించుకున్నారు. అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ తర్వాత మళ్లీ దూకుడు తగ్గించారు. అయితే ఇటీవల మళ్లీ అదానీ పుంజుకుంటున్నారని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి బ్లాక్ డీల్స్‌తో ఆయన వేల కోట్లు సంపాదించారు. తన కంపెనీలో మైనార్టీ వాటా విక్రయించి వేల కోట్లు వెనకేసుకున్నారని చెప్పొచ్చు. అదానీ గ్రూప్ సబ్సిడరీ అయిన అంబుజా సిమెంట్స్‌లో ప్రీ మార్కెట్ బ్లాక్ డీల్ ద్వారా రూ. 4200 కోట్ల విలువైన షేర్లను ఆయన విక్రయించారు.

                 కంపెనీ ప్రమోటర్ సంస్థ అయిన హోల్డర్‌ఇండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ సిమెంట్ కంపెనీ అయిన అంబుజా సిమెంట్స్‌లో 2.8 శాతం మేర వాటా విక్రయించింది. NSE దగ్గర ఉన్న సమాచారం ప్రకారం చూస్తే.. ఈ 2.8 శాతం వాటా అంటే ఏకంగా 6.79 కోట్ల షేర్లుగా తెలుస్తోంది. ఒక్కో షేరుకు సగటున రూ. 625.50 కి బ్లాక్ డీల్ ద్వారా విక్రయించింది. ఈ క్రమంలోనే స్టాక్ ఇంట్రాడేలో ఒక దశలో 4 శాతానికిపైగా పెరిగింది.

              ఇక ఈ విక్రయ ట్రాన్సాక్షన్ తర్వాత.. ఇప్పుడు అంబుజా సిమెంట్స్‌లో హోల్డర్‌ఇండ్ వాటా 50.90 శాతం నుంచి 48.1 శాతానికి దిగొచ్చింది. ఇంకా అంబుజా సిమెంట్స్‌లోనే 1.78 శాతం వాటాకు సమానమైన 4.39 కోట్ల షేర్లను ప్రముఖ ఇన్వెస్టర్ రాజీవ్ జైన్‌కు చెందిన జీక్యూజీ పార్ట్‌నర్స్ సొంతం చేసుకుంది. ఇక్కడ కూడా ఒక్కో షేరుకు సగటున రూ. 625.50 చెల్లించగా.. దీని విలువ మొత్తం రూ. 2746.79 కోట్లు.

              అంబుజా సిమెంట్స్‌లో ప్రస్తుతం అదానీ గ్రూప్ మొత్తం వాటా 70.33 శాతంగా ఉంది. ఇందులో హోల్డర్‌ఇండ్ పేరిట అంతకుముందు 50.90 శాతం.. ఇప్పుడు 48.1 శాతం మేర వాటా ఉంది. అదానీ గ్రూప్ కంపెనీల్లో ప్రమోటర్స్ వాటాల్ని తగిన విధంగా ఉండేలా చూసుకునేందుకే ప్రమోటర్ ఈ వాటా విక్రయించినట్లు తెలుస్తుంది. గ్రూప్‌లోని మొత్తం 10 లిస్టెడ్ కంపెనీల్లో గౌతమ్ అదానీ నేతృత్వంలోని ప్రమోటర్లకు 125 బి.డాలర్లకుపైగా (సుమారు రూ. 10 లక్షల కోట్లు) విలువైన షేర్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే దీనిని తగ్గించుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం దాదాపు రూ. 7 వేల కోట్ల విలువైన షేర్లు విక్రయించగా రానున్న రోజుల్లో దీనిని దాదాపు రూ. 30 వేల కోట్లకు పెంచుకోవాలని చూస్తుందంట.

No comments:

Post a Comment