Saturday, 13 July 2024

రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్

  దసరా లోపు ఉమ్మడి నల్గొండ జిల్లాకు 30 డీలక్స్ 30 ఎక్స్ప్రెస్ బస్సులను మంజూరు 

– నార్కెట్ పల్లి డిపోకు పునర్ వైభవం
– అన్ని ప్రాంతాలకు బస్సులు నడుపుతాం
– నల్గొండ నుండి తిరుపతి, హైదరాబాద్ లకు ఏసీ బస్సులను మంజూరు చేస్తాం
– రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ  శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ 


-హైదరాబాద్ తర్వాత అతిపెద్ద జిల్లా నల్లగొండ 
– ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వంద బస్సులు మంజూరు చేయాలి 
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
 నల్గొండ కలక్టరేట్ : నూతన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నష్టాలలో నడుస్తున్న ఆర్టీసీ సంస్థను  బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. శనివారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని బస్సు డిపోలో నల్గొండ  హైదరాబాద్ కు ఒక ఏసీ బస్సును, 4 డీలక్స్ బస్సులను, అలాగే పల్లె వెలుగు బస్సును రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థను, కార్మికులను సంరక్షించేందుకు నూతన ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకున్నదని అన్నారు. రాష్ట్రప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల లోపే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, నూతనంగా 1000 బస్సులను కొనుగోలు చేశామని, మరో 1500 బస్సులను కొనుగోలు చేసేందుకు ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపారు. నల్గొండ జిల్లాకు వచ్చే దసరా నాటికి 30 డీలక్స్ బస్సులు, మరో 30 ఎక్స్ ప్రెస్ బస్సులను మంజూరు చేస్తామని, అలాగే హైదరాబాద్, తిరుపతి లకు ఏసి బస్సులను మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.  నల్గొండ జిల్లాలో 7 బస్సు డిపోలు ఉన్నాయని,  645 బస్సులు రెండు లక్షల 55000 కిలోమీటర్ల ప్రయాణించి, 3 లక్షల మంది ప్రయాణికులను గమ్య స్తానాలకు చేరుస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. జిల్లా పరిధిలోకి వచ్చే నార్కెట్ పల్లి బస్సు డిపోకు పునర్ వైభవాన్ని తీసుకువచ్చి అక్కడి నుండి అన్ని ప్రాంతాలకు బస్సులను నడిపే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఆర్టీసీ కార్మికుల సంక్షేమంలో భాగంగా 21 శాతం డిఎ ని ఇచ్చామని, 280 కోట్ల బకాయిలలో 80 కోట్లు ఇదివరకే ఇవ్వడం జరిగిందని, 200 కోట్ల రూపాయలను ఈ నెలాఖరునాటికి వారి వారి ఖాతాలలో జమ చేస్తామని మంత్రి వెల్లడించారు. ఆర్టీసీ బలోపేతంలో భాగంగా నూతనంగా 3035 ఉద్యోగాలను భర్తీచేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.  ఆర్టీసీ ని ఆపరేషన్ నష్టాల నుండి బయటకు తీసుకువచ్చే విధంగా ప్రభుత్వ సహకారంతో ముందుకు నడిపిస్తున్నామని చెప్పారు. అన్ని జిల్లాల నుండి హైదరాబాద్ కు ఏసీ బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నామని, అవసరమైతే అసెంబ్లీ నియోజకవర్గాల నుండి రాష్ట్ర రాజధానికి ఏసీ బస్సులను నడుపుతామని, ముందుగా జిల్లా కేంద్రాల నుండి ఏసి బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల నుండి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుండి హైదరాబాద్ కు  ఎలాంటి లోటుపాట్లు లేకుండా బస్సులు నడిపి ప్రయాణికులను సురక్షితంగా చేరవేస్తామని చెప్పారు.  రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండవ రోజే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించిందని, 60 నుండి 70 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. టీజీ ఆర్టీసీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. అప్పుల్లో ఉన్న ఆర్టీసీని పైకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని అన్నారు.  హైదరాబాద్ తర్వాత ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు, 35 లక్షల జనాభాను  కలిగి అతి పెద్ద జిల్లా గా నల్గొండ ఉందని, అందువల్ల నల్గొండ జిల్లాకు ప్రత్యేకంగా 25 బస్సుల తో పాటు, నార్కెట్ పల్లి ఆర్టీసీ డిపోకి పునర్ వైభవం తీసుకురావాలని, ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తానికి 100 బస్సులను మంజూరు చేయాలని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర ,మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, ఆర్టిసి ఆర్ఎం రాజశేఖర్, డిప్యూటీ ఆర్ఎం శివశంకర్, ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment