న్యాయవాది నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్‌ఐ
ఓ కేసు విషయంలో ఓ ఎస్‌ఐ న్యాయవాది నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది.
భద్రాద్రి కొత్తగూడెం : ఓ కేసు విషయంలో ఓ ఎస్‌ఐ(SI) న్యాయవాది(Lawyer) నుంచి రూ.20 వేలు లంచం( Bribe) తీసుకుంటుండగా ఏసీబీ( ACB) అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. పాల్వంచకు చెందిన సీరపు శ్రావణి అనే మహిళ కొత్తగూడెంకు చెందిన బాలసాని గణేశ్ గౌడ్‌కు రూ.20 వేలు అప్పుగా ఇచ్చింది. ఈ క్రమంలో అతడు మరణించగా.. అప్పు డబ్బుల కోసం అతడి కుటుంబ సభ్యులపై కొత్తగూడెం కోర్టులో శ్రావణి కేసు వేసింది.అయితే గణేశ్ గౌడ్‌కు చెందిన ఆస్తిని పాల్వంచకు చెందిన చావా శ్రీనివాస్ అనే వ్యక్తి కోర్టులో కేసు ఉండగానే కొనుగోలు చేశాడు. దీనిపై బాధితురాలు శ్రావణి తరఫున హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్న పాల్వంచకు చెందిన లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో చావా శ్రీనివాస్‌తో సంప్రదింపులు జరపగా.. ఆ డబ్బులు తానే ఇస్తానని ఒప్పుకొని తర్వాత వేధింపులకు గురి చేశాడు. దీంతో ఆమె పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్‌లో 2024, మే 19న పట్టణ ఎస్‌ఐ బాణాల రాముకు ఫిర్యాదు చేసింది.కేసు విషయంలో చార్జిషీట్ దాఖలు చేయడానికి కోర్టుకు ఎఫ్‌ఐఆర్ కాపీ కావాలని సదరు న్యాయవాది ఎస్‌ఐని సంప్రదించగా.. తనకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముందుగా తనకు రూ.20 వేలు ఇవ్వాలని చెప్పడంతో న్యాయవాది లక్ష్మారెడ్డి హైదరాబాద్‌లో ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో వారు ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్‌కు సమాచారం అందించారు. గురువారం మధ్యాహ్నం సమయంలో పాల్వంచలోని తన ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వాలని ఎస్‌ఐ రాము న్యాయవాదిని కోరారు. దీంతో సదరు బాధిత మహిళ శ్రావణి తరఫు న్యాయవాది లక్ష్మారెడ్డి నుంచి ఎస్ఐ రాము రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా అప్పటికే మాటువేసిన ఏసీబీ అధికారులు డీఎస్పీ వై.రమేశ్ ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
No comments:
Post a Comment