బల్దియా ఫెయిల్.. కమిషనర్ పనితీరుపై సీఎం అసంతృప్తి?
గ్రేటర్‌లో పాలన పట్టుతప్పుతోందా? పారిశుధ్యం నిర్వహణ సరిగా లేక డెంగీ, మలేరియా కేసులు విజృంభిస్తున్నాయా? శాఖల మధ్య సమన్వయం లేక నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదా? గుంతల రోడ్లతో వాహనదారుల నడ్డి విరుగుతుందా?
- సమస్యలతో సతమతమవుతున్న ప్రజానీకం
- ఒకవైపు ట్రాఫిక్, మరోవైపు నగరం చెత్తమయం
- పెరుగుతున్న డెంగీ, మలేరియా వ్యాధులతో ప్రజల్లో ఆందోళన
- శాఖల మధ్య సమన్వయ లోపంపై సీఎం సీరియస్
- బాధ్యతలు చేపట్టి నెల రోజులు దాటినా పట్టు సాధించలేకపోతున్న ఆమ్రపాలి
GHMC | : గ్రేటర్‌లో పాలన పట్టుతప్పుతోందా? పారిశుధ్యం నిర్వహణ సరిగా లేక డెంగీ, మలేరియా కేసులు విజృంభిస్తున్నాయా? శాఖల మధ్య సమన్వయం లేక నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదా? గుంతల రోడ్లతో వాహనదారుల నడ్డి విరుగుతుందా? అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడటం లేదా? ఎన్నో ఆశలతో వచ్చిన అర్జీదారులకు ప్రజావాణిలో పరిష్కారం దొరకడం లేదా? కీలకమైన కమిషనర్ బాధ్యతలు తీసుకున్న ఆమ్రపాలి సమర్థవంతమైన పాలనను నడిపించడంలో ఫెయిల్ అవుతున్నారా? అంటే నగర పౌరుల నుంచి అవుననే సమాధానం వస్తోంది.
ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగిన కీలకమైన శాఖలో మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ ఆమ్రపాలి సమస్యలపై క్షేత్రస్థాయి తనిఖీలు చేయకపోవడం, గతంలో లేని విధంగా రహదారులపై గుంతలు, అన్ని శాఖలతో సమన్వయ సమావేశాలు, పారిశుధ్యం, ట్రాఫిక్, చివరకు ప్రజావాణి సమస్యలకు భరోసా కల్పించడంలో విఫలమయ్యారు. వాస్తవానికి గత కమిషనర్ రొనాల్డ్‌రాస్ విదేశీ పర్యటన సమయంలో 15 రోజుల పాటు ఇన్‌చార్జి కమిషనర్‌గా ఉన్న ఆమ్రపాలి, గత నెల 24న రొనాల్డ్‌రాస్ ఇంధనశాఖకు బదిలీ కావడంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
దాదాపు నెలన్నర రోజులు గడిచిన.. ఆమ్రపాలి పట్టు సాధించడంలో విఫలమయ్యారన్న విమర్శలు లేకపోలేదు. ప్రజావాణిలో కమిషనర్ సరిగా సమయం కేటాయించకపోవడం.. ఫిర్యాదు చేసిన అర్జీదారులకు పరిష్కారం దొరుకుతుందన్న భరోసా కల్పించడం లేదు. దాదాపు ప్రజావాణిలో 850కి పైగా ఫిర్యాదులు స్వీకరిస్తే అందులో సగానికి మాత్రమే పరిష్కారం చూపారు. పార్కుల్లో మౌలిక వసతులు లేవని వాకర్లు చెప్పిన వాటిని పరిష్కరించిన దాఖలాలు లేవు. కొత్త ప్రాజెక్టులు, సంస్కరణలపై దృష్టి సారించిన పరిస్థితులు లేవు.
ఉన్న వాటితోనే నెట్టుకొస్తున్నారే తప్ప కొత్త ఆలోచనలకు నాంది పడటం లేదు. క్షేత్రస్థాయి పర్యటనలు నామమాత్రంగానే ఉండటంతో ఫీల్డ్‌లో ఉండే అధికారులు, సిబ్బందిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. టెలికాన్ఫరెన్స్‌లకు కమిషనర్ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో ఆదేశాలు జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో సమస్యలు యథావిధిగానే ఉన్నాయి. వర్షాలకు ఏర్పడిన గుంతలను వెంటనే పూడ్చివేయాలని చెప్పినా, గుంతలమయంగా నగరం దర్శనమిస్తున్నది.
సీఆర్‌ఎంపీ రోడ్లలోనూ ఏజెన్సీలపై పర్యవేక్షణ, చర్యలు ఉండటం లేదు. నాలా పూడికతీత, మాన్‌సూన్ యాక్షన్ ప్లాన్ అమలుపై పర్యవేక్షణ లేదు. డెంగీ నివారణ విషయంలో విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. అభివృద్ధి పనులు పూర్తిగా కుంటుపడ్డాయి. చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని, బకాయిలు రూ. 1000కోట్లకు పైగా పేరుకుపోయాయని కాంట్రాక్టర్లు ఆందోళన చేస్తున్నా.. పరిష్కారానికి నోచుకోక వారి సమస్య రోజురోజుకు ముదురుతూనే ఉంది. అయితే అదనపు బాధ్యతలతో కమిషనర్ సతమతమవుతున్నారా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్న చర్చ కూడా జరుగుతున్నది.
సమన్వయ సమావేశాలు ఎక్కడ?
హైదరాబాద్ నగర సమగ్రాభివృద్ధికి, పౌరులకు సత్వర సేవలకు సంబంధించి కీలకమైన సమన్వయ సమావేశాలను జీహెచ్‌ఎంసీ పట్టించుకోవడం లేదు. అంతర్గతంగానూ, ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయ లేమితో జీహెచ్‌ఎంసీ వైఖరి నగర పౌరులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నది. ప్రధానంగా అభివృద్ధి పనులకు తీవ్ర ఆటంకాలు ఉత్పన్నమవుతూ సకాలంలో పనులు చేయలేకపోతుండటం, తద్వారా ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఫుట్‌పాత్, జంక్షన్ల అభివృద్ధి, ట్రాఫిక్ సమస్య మొదలు నాలా, రహదారుల వెడల్పు, భూసేకరణ, అనుమతుల్లో జాప్యం, విద్యుత్, జలమండలికి సంబంధించి ఏ పనులు చేయాలన్నా ఏదో ఒక సమస్య ఏర్పడుతుంది.
వాస్తవంగా గతంలో సిటీ సమన్వయ కమిటీ తరచూ సమావేశాలు నిర్వహిస్తూ, అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు చేపట్టేది. జలమండలి, పోలీస్, విద్యుత్, పీసీబీ, ఆర్టీసీ, వైద్యారోగ్యశాఖ, కలెక్టరేట్, అగ్నిమాపక శాఖ, హెచ్‌ఎండీఏ, తదితర శాఖల అధికారులు సభ్యులుగా ఉండగా, జీహెచ్‌ఎంసీ పెద్దన్న పాత్రను పోషించేది. ఈ సిటీ సమన్వయ కమిటీతో నగరంలో ప్రస్తుతం విస్తరించి కనిపిస్తున్న రహదారుల వెడల్పులో భాగంగా స్థల సేకరణకు సంబంధించి అనేక సమస్యలకు పరిష్కారం చూపేవారు.
దీర్ఘకాలిక ప్రజాసమస్యల పరిష్కారం, అభివృద్ధిలో ఇతర శాఖలను భాగస్వామ్యం చేస్తూ ప్రతి నెలలో రెండు సార్లు కన్వర్జెన్సీ సమావేశాలు నిర్వహించేవారు. ఒకానొక దశలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులతో కలిసి సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి తగు సూచనలతో హైదరాబాద్ సమగ్రాభివృద్ధికి చర్యలు చేపట్టేవారు. కానీ గడిచిన కొన్ని నెలలుగా ప్రభుత్వ శాఖలతో జీహెచ్‌ఎంసీ సమన్వయం కుదరడం లేదు.
జలమండలి వర్సెస్ జీహెచ్‌ఎంసీ
అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో వేరే పనుల కోసం రోడ్లను తవ్వి అలాగే వదిలి వెళ్తున్నారు. కొన్ని చోట్ల అసలు అనుమతి లేకుండానే పనులు చేస్తున్నారు. అదే సమన్వయ సమావేశాలు నిర్వహిస్తే అన్ని శాఖల అధికారులు ఉండటంతో అనుమతులు ఎవరిచ్చారో తెలుస్తుందని..దీని వల్ల పనులు పూర్తయ్యాక తిరిగి రోడ్లు వేసేలా చర్యలు తీసుకోవడానికి వీలుంటుందని అధికారులు చెబుతున్నారు.
వైట్‌టాపింగ్ రోడ్లు, ఎస్‌ఆర్‌డీపీ తదితర పనులు ప్రారంభించే ముందుగానే ఆయా మార్గాల సమాచారాన్ని ఎలక్ట్రిసిటీ, జలమండలి, పోలీస్ తదితర శాఖలకు అందిస్తే పైపులైన్లను మార్చడం, అండర్ కేబుల్ నెట్‌వర్క్స్, సీసీ టీవీల ఏర్పాటు తదితర పనులను ముందే పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అలా చేయకపోవడంతో రోడ్లు వేసిన కొద్ది రోజులకే ఏదో కారణంగా తవ్వేస్తున్నారు. దీని వల్ల ప్రజాధనం వృథా కావడంతో పాటు జనం ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి అపరిష్కృత సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
No comments:
Post a Comment