ఈ నెల 23 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు - చర్చకు రానున్న కీలక అంశాలు..!
Telangana Assembly Budget Sessions 2024 : ఈ నెల 23వ తేదీ నుంచి తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి పద్దును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
Telangana Assembly Budget Sessions 2024 : ఈ నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ అయింది.
ఇప్పటికే అన్ని శాఖల నుంచి నివేదికలు తీసుకున్నట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల వేళ నాలుగు నెలల కాలానికి ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జరగబోయే సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
వారం రోజులు…?
ఈ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు వారం రోజుల పాటు సాగనున్నాయి. ఈ నెల 23న కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రానికి కేటాయింపులు బట్టి పూర్తిస్థాయి బడ్జెట్ ను సిద్ధం చేయనున్నారు. ఈనెల 25 లేదా 26 న పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.
ఈ బడ్దెట్ సమావేశాల్లో రైతు భరోసా,రైతు రుణమాఫీ వంటి కీలక అంశాలపై వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది. రుణమాఫీ నిధులను కూడా విడుదల చేయనున్న నేపథ్యంలో దీనిపై కూడా సభలో చర్చ జరగనుంది. ఇక రైతుభరోసా స్కీమ్ పై సభ్యుల నుంచి పలు సూచనలను స్వీకరించనుంది. అయితే వానాకాలం సాగు ప్రారంభమైనప్పటికీ… పంట పెట్టుబడి సాయం అందించకపోవటంపై ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రైతులకు పంట పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ పై చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే గ్రూప్ 1తో పాటు 2, 3 అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సభలో నిరుద్యోగుల అంశంపై హాట్ హాట్ గా చర్చ జరిగే అవకాశం ఉంది,
గత అసెంబ్లీ సమావేశాలే హాట్ హాట్ గా సాగిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి మరింత చర్చ జరిగే అవకాశం ఉంది. గత సమావేశాల్లో ప్రభుత్వం… పలు రంగాలకు సంబంధించి శ్వేతపత్రాలను సభ ముందు ఉంచుంది. దీనిపై వాడీవేడీగా చర్చ సాగింది.
మరోవైపు బీఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. దీంతో సభలో బీఆర్ఎస్ సభ్యుల సంఖ్య కూడా తగ్గింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే లోపు గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో పాటు మరికొంత మంది హస్తం కండువా కప్పుకునే అవకాశం ఉందని వార్తలు
జోరుగా వినిపిస్తున్నాయి. అదే జరిగితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య మరింతగా పడిపోనుంది. ఈ నేపథ్యంలో సభలో…. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.
No comments:
Post a Comment