సూర్యాపేట డీఆర్డీఏ కార్యాలయంలో బయటపడ్డ నకిలీ ఉద్యోగిని వ్యవహారం!
సూర్యాపేట కలెక్టరేట్‌లో నకిలీ సర్టిఫికెట్‌తో ఉద్యోగం చేస్తున్న మహిళా ఉదంతం బయటపడింది. కలెక్టరేట్: సూర్యాపేట కలెక్టరేట్‌లో నకిలీ సర్టిఫికెట్‌తో ఉద్యోగం చేస్తున్న మహిళా ఉదంతం బయటపడింది. పేరు మార్చుకోని, ఫేక్ డాక్యుమెంట్లతో రెండేళ్లుగా కలెక్టర్ కార్యాలయంలోనే ఉద్యోగం చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు ఉద్యోగం వచ్చిన మహిళ శనివారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ నకిలీ బాగోతం బట్టబయలైంది. ఇందుకు సంబంధించిన వివరాలను బాధితురాలు నవ్య మీడియాకు వెల్లడించింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం..
ఒకరి ప్లేస్‌లో మరొకరు ఉద్యోగం
చివ్వెంల మండల కేంద్రానికి చెందిన ఆదిమల్ల నవ్య సూర్యాపేట డీఆర్డీఏ కార్యాలయంలో 2016 అక్టోబర్ నుంచి 2019 అక్టోబర్ వరకు మాలి స్వీపర్‌గా పని చేసింది. ఆ సమయంలో నవ్యకు రూ.2 వేల వేతనం ఇచ్చారు. అది కూడా 2018 జూన్ వరకు మాత్రమే చెల్లించారు. ఆ తర్వాత ఏడాది పాటు శాలరీ ఇవ్వకపోవడంతో ఆమె పలుమార్లు డీఆర్డీఏ అధికారులకు మొరపెట్టుకుంది. అయినా అధికారులు అప్పుడు ఇప్పుడు అంటూ కాలం వెల్లదీశారు. ఇదే సమయంలో ప్రభుత్వం కాంట్రాక్ట్ బేసిక్ మీద నవ్యకు స్వీపర్‌గా ఉద్యోగం కల్పిస్తూ సెర్ఫు ఆఫీస్ నుంచి 2019 అక్టోబర్ 30న ఆదిమల్ల నవ్య పేరుతో ఫైల్ నెంబర్ 810/SERP/HR/CMS-CO/20160 ఉద్యోగం ఆర్డర్ కాపీ వచ్చింది. దీంతో అప్పటి డీఆర్డీఏ పీడీ సీసీ భూక్యా శంకర్, హెచ్ఆర్ ప్రవీణ్ కలిసి నీకు ఉద్యోగం వచ్చిందని.. లక్ష రూపాయలు ఇచ్చి ఆర్డర్ కాపీ తీసుకోవాలని చెప్పారు. అయితే అంత డబ్బులు ఇచ్చుకునే స్థోమత తనకు లేదని నవ్య వేడుకుంది. అయినా ఆ ఇద్దరు అధికారులు ఆమె ఉద్యోగ ఆర్డర్ కాపీ ఇవ్వలేదు. దీంతో నవ్య హైదరాబాద్ సెర్ప్ కార్యాలయానికి వెళ్లి ఆర్డర్ కాపీ తెచ్చుకుంది. అయినా అధికారులు ఆమెను ఉద్యోగంలో జాయిన్ చేసుకోకుండా అడ్డుకున్నారు. అప్పటి నుంచి నవ్య నాటి పీడీ కిరణ్ కుమార్, ప్రస్తుత పీడీ మధుసూదన్ రాజును కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. అయినా ఇప్పటి వరకు నవ్యకు న్యాయం జరగలేదు.
నవ్య స్థానంలో పీడీ గ్రామానికి చెందిన మహిళకు ఉద్యోగం
ఇదిలా ఉండగా ఆదిమల్ల నవ్య ఉద్యోగాన్ని గతంలో ఇక్కడ పని చేసిన పీడీ కిరణ్ కుమార్ తన సొంత ఊరుకు చెందిన గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన నందిపాటి మౌనిక పేరును నందిపాటి నవ్యగా మార్చి ఉద్యోగం కల్పించారు. 2022 డిసెంబర్ 31న ఆర్డర్ కాపీ Proc. No A1/DMF (T)/ADMN/5220/2020తో నందిపాటి మౌనికను N నవ్యగా మార్చడంతో ఆదిమల్ల నవ్య స్థానంలో నకిలీ మహిళ విధులు నిర్వహిస్తోంది. దీంతో నందిపాటి నవ్య నకిలీ ఉద్యోగం చేస్తుందని ఆదిమల్ల నవ్య ఆరోపిస్తూ ఆమెకు సంబంధించిన వివరాలను అధికారులకు అందించింది. నవ్య అసలు పేరు నందిపాటి మౌనిక అని మౌనికకు సంబంధించిన రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఆసరా పెన్షన్ వివరాలను పీడీకి, కలెక్టర్‌కు అందజేసింది. 2024 జనవరిలో IKP ఉద్యోగుల పే స్కేల్ చెల్లింపుల్లో, E కుబేర్‌లో ఎన్.నవ్యగా ఎంటర్ చేసి జీతాలు చెల్లింపులు కూడా చేస్తున్నారని ఆదిమల్ల నవ్య ఫిర్యాదులో జరిగింది. కాగా ఈ వివాదంపై డీఆర్డీఏ పీడీ మధుసూధనరాజును ఫోన్‌లో సంప్రదించగా ఆదిమల్ల నవ్య నుంచి ఫిర్యాదు వచ్చిందని, దానిపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని వివరించారు.
No comments:
Post a Comment