Tuesday, 29 August 2023

ధూప దీప వేతనం రూ.10,000

 

ధూప దీప వేతనం రూ.10,000

సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మరో హామీ కొద్దిరోజుల్లోనే అమలుకు నోచుకున్నది. మే 31న గోపన్‌పల్లిలో బ్రాహ్మణ సంక్షేమ భవన్‌ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ ధూప దీప నైవేద్యం పథకం అర్చకులకు ఇచ్చే గౌరవ భృతిని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచనున్నట్టు ప్రఎం ఆదేశాల ప్రకారం ప్రభుత్వానికి దేవాదాయ శాఖ కమిషనర్‌ ప్రతిపాదనలను పంపారు. ఆ ప్రతిపాదనలకు తాజాగా ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

6,541 మంది అర్చకులకు లబ్ధి

మూడు నెలల్లోనే అమలవుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో హామీ

అర్చక సమాఖ్య హర్షం.. క్షీరాభిషేకం

నేడు కేసీఆర్‌ పేరిట గుడుల్లో పూజలు

సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మరో హామీ కొద్దిరోజుల్లోనే అమలుకు నోచుకున్నది. మే 31న గోపన్‌పల్లిలో బ్రాహ్మణ సంక్షేమ భవన్‌ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ ధూప దీప నైవేద్యం పథకం అర్చకులకు ఇచ్చే గౌరవ భృతిని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచనున్నట్టు ప్రకటించారు. సీఎం ఆదేశాల ప్రకారం ప్రభుత్వానికి దేవాదాయ శాఖ కమిషనర్‌ ప్రతిపాదనలను పంపారు. ఆ ప్రతిపాదనలకు తాజాగా ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రూ.4,000 ధూప దీప నైవేద్యానికి, రూ.6,000 అర్చకుల వేతనాలు కలిపి రూ.10 వేలకు పెంచుతూ మంగళవారం ప్రభుత్వ కార్యదర్శి వీ అనిల్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా 6,541 మంది అర్చకులకు ప్రయోజనం చేకూరనున్నది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్నది. తమ మేలు కోసం నిర్ణయం తీసుకొన్న ముఖ్యమంత్రికి అర్చక సంఘాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.

ప్రభుత్వంపై ఏటా రూ.31.39 కోట్ల అదనపు భారం

ధూపదీప నైవేద్య పథకం కింద గతంలో 6,541 మంది అర్చకులకు నెలకు రూ.6,000 వేల చొప్పున ప్రభుత్వం ఏటా 47.09 కోట్లు చెల్లించేది. ఇక నుంచి రూ.78.49 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వంపై అదనంగా రూ.31.39 కోట్ల భారం పడనున్నది. అర్చకుల శ్రేయస్సు, ఆలయాల్లో ధూప దీప నైవేద్య కార్యక్రమాలు జరగాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ వేతనాలను పెంచాలని నిర్ణయించారు. ధూప దీప నైవేద్య (డీడీఎన్‌) పథకం గౌరవ భృతిని 10 వేలకు పెంచడాన్ని హర్షిస్తూ హైదరాబాద్‌లో అర్చక సమాఖ్య గౌరవ అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అన్ని కులమతాలను సమానంగా ఆదరిస్తున్న కేసీఆర్‌ పదికాలాలపాటు అధికారంలో కొనసాగాలని కాంక్షిస్తూ బుధవారం అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో ధూప దీప నైవేద్య అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్‌శర్మ, నారాయణస్వామి, ఆంజనేయాచారి, మహేంద్రాచారి, మోహన్‌ శర్మ, నవీన్‌ ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్‌ గొప్ప మనసుకు నిదర్శనం: ఇంద్రకరణ్‌రెడ్డి

ఇచ్చిన మాట ప్రకారం ధూప దీప నైవేద్య పథకం వేతనాలను రూ.10 వేలకు పెంచడం సీఎం కేసీఆర్‌ గొప్ప మనసుకు నిదర్శనమని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కొనియాడారు. ఉమ్మడి పాలనలో అర్చకులకు డీడీఎన్‌ కింద నెలకు కేవలం రూ.2,500 మాత్రమే ఇచ్చేవారని, సీఎం కేసీఆర్‌ ఈ మొత్తాన్ని మొదట రూ.6000కు పెంచారని, తాజాగా రూ. 10,000కు పెంచారని గుర్తుచేశారు. గతంలో 1,805 ఆలయాలకు మాత్రమే డీడీఎన్‌ పథకం అమలుచేసే వారని, ప్రస్తుతం 6,541 ఆలయాలకు అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఆలయాలకు విస్తరించాలనే ప్రతిపాదన ఉందని తెలిపారు. రూ.10 వేల పెంపుతో డీడీఎన్‌ పథకానికి ఏటా రూ.78.49 కోట్లు ఖర్చవుతుందని మంత్రి తెలిపారు.

No comments:

Post a Comment