Wednesday, 13 March 2024

ఏసీబీకి పట్టుబడ్డ కలెక్టరేట్ సూపరింటెండెంట్

 కడప:చుక్కల భూమిని పట్టా భూమి గా మార్చేందుకు ఓ రైతు నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటున్న కలెక్టరేట్ లోని డి సెక్షన్ సూపరింటెండెంట్ శెట్టిపల్లి ప్రమీలను ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నారు. కలెక్టరేట్ లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడం తో కలెక్టరేట్ లో చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనకు సంబంధించి డీఎస్పీ కథనం మేరకు వివరాలు ఇలా వున్నాయి. వీరపునాయునిపల్లె మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన వీరప్ప శేఖర్ అనే రైతుకు సర్వే నెంబర్ 461 లో 6.4 ఎకరాల చుక్కల భూమి వుంది. ఈ భూమిని జిరాయితీ భూమిగా (పట్టా భూమి గా) మార్చేందుకు కలెక్టరేట్ లోని డి సెక్షన్ సూపరింటెండెంట్ శెట్టిపల్లి ప్రమీలకు దరఖాస్తు చేసుకున్నారు.

గత కొన్ని రోజులుగా సూపరింటెండెంట్ ఆ రైతుకు సంబంధించిన దరఖాస్తును పరిష్కరించలేదు. దీంతో రైతు వీరప్ప శేఖర్ సూపరింటెండెంట్ ను కలిసి తన సమస్యను పరిష్కరించాలని కోరారు. సమస్యను పరిష్కరించాలంటే రూ.1.50 లక్ష ఇస్తే పరిష్కరిస్తానని సూపరింటెండెంట్ డిమాండ్ చేసింది. దీంతో అంగీకరించి విడతల వారీగా డబ్బులు చెల్లిస్తానని, ప్రస్తుతం రూ.50 వేలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సూపరింటెండెంట్ ప్రమీల తన ఛాంబర్ లోనే రైతు నుంచి అడ్వాన్సుగా రూ.50వేలను తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో దాడులు చేసి పట్టుకున్నారు. కేసు నమోదు చేసి, కర్నూలు ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ గిరిధర్ తెలిపారు.



No comments:

Post a Comment