వైరాలో రిజిస్ట్రేషన్లపై వరంగల్ డీఐజీ సీరియస్
వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అడ్డగోలుగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే ఆరోపణలపై స్టాంపు రిజిస్ట్రేషన్ల శాఖ వరంగల్ డీఐజీ సుభాషిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైరా : వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అడ్డగోలుగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే ఆరోపణలపై స్టాంపు రిజిస్ట్రేషన్ల శాఖ వరంగల్ డీఐజీ సుభాషిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరాలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న రిజిస్ట్రేషన్లపై విచారణ జరిపి నిజాలను నిగ్గు తేల్చాలని ఖమ్మం జిల్లా రిజిస్ట్రార్ అశోక్ కుమార్ ను సుభాషిని ఆదేశించారు. జిల్లా రిజిస్ట్రార్ అశోక్ కుమార్ బుధవారం వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకొని గత నాలుగు నెలల నుంచి నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఆక్రమ రిజిస్ట్రేషన్లపై విచారణ నిర్వహించారు. ముఖ్యంగా వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతమైన ఏన్కూరు మండలంలో 1/70 అమలులో ఉన్న నేపథ్యంలో
ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయకూడదనే ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా కుటుంబసభ్యుల పేర్లతో పార్టేషన్ పేరిట రిజిస్టేషన్లు చేస్తున్న బాగోతంపై అధికారులు ఆగ్రహంగా ఉన్నారు. ప్రైవేట్ బ్యాంకులకు చెందిన పలువురు ఏజెంట్లు దళారుల అవతారమెత్తి ఇక్కడ కొంతమంది డాక్యుమెంట్ రైటర్ల సహకారంతో భారీగా ముడుపులు దండుకుంటూ పార్టేషన్ పేరిట 200కుగాపై అక్రమ రిజిస్ట్రేషన్లు చేయటాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అలాగే వైరా, కొణిజర్ల మండలాల్లో లేఅవుట్ లేని స్థలాలకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే గిఫ్ట్ రిజిస్ట్రేషన్ల పేరిట కూడా నిబంధనలకు తూట్లు పొడిచారనే విమర్శలున్నాయి. అలాగే ప్రభుత్వ ఆదాయానికి కూడా భారీగా గండి కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటిపై ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ కరుణను జిల్లా రిజిస్ట్రార్ ప్రశ్నించి రికార్డులను పరిశీలించారు. ఇక్కడ జరిగిన రిజిస్ట్రేషన్లు అన్నిటిపై జిల్లా రిజిస్ట్రార్ సమగ్రమైన విచారణ నిర్వహించనున్నారు.
No comments:
Post a Comment