సామాజిక సేవకురాలు, పరోపకారి - ఓ అవినీతి అధికారిణి కథ ఇదే!
Mahabubabad News: సామాజిక సేవకురాలిగా పేరొందిన ఆ ప్రభుత్వాధికారిణి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడడం అందరినీ షాక్ కు గురి చేసింది. ప్రస్తుతం ఆ జిల్లాలో సంచలనంగా మారింది.
అనతి కాలంలోనే..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ తస్లీమా అంటే తెలియని వారుండరు. తన వృత్తి ధర్మాన్ని బాధ్యతగా నిర్వహిస్తూనే.. సాధారణ జీవితం గడుపుతూ.. అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరికీ తనకు తోచిన సాయం చేసేవారు. సెలవు రోజుల్లో పొలం పనుల్లో నిమగ్నమవుతూనే ఇటు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ములుగు జిల్లా రామచంద్రపురంలో జన్మించిన తస్లీమా మహమ్మద్ కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తి చేశారు. గ్రూప్ - 2 పరీక్షలు రాసి సబ్ రిజిస్ట్రార్ గా ఎంపికయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగులో ఎక్కువ కాలం పని చేసి సామాజిక కార్యక్రమాల ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. తండ్రి పేరుతో ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకునేవారు. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో నిరుపేదలకు నిత్యం అందుబాటులో ఉండేవారు. కరోనా సమయంలో ప్రస్తుత మంత్రి సీతక్కతో కలిసి ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలకు నిత్యావసర వస్తువులు అందజేశారు. మనుషులే కాదు మూగజీవాల పట్ల కూడా తన ప్రేమను చాటుకునేవారు.
కొద్ది రోజుల క్రితమే బదిలీ
ములుగు సబ్ రిజిస్ట్రార్ గా సేవలందించిన తస్లీమా మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ గా కొద్దిరోజుల క్రితం బదిలీ అయ్యారు. ఇక్కడ కూడా తనదైన రీతిలో సమాజ సేవ చేస్తూ ప్రత్యేకతను చాటుకున్నారు. అనేక మందికి తానున్నానంటూ అండగా నిలిచారు. అయితే, ఇదంతా నాణేనికి ఓ కోణం మాత్రమే. మరో కోణంలో ఆమె అవినీతి అపప్రదను మూటకట్టుకున్నారు. ఇంతటి పేరున్న ఆమెకు ముడుపులు ముట్టచెప్పనిదే ఫైల్ కదిలేది కాదనే ఆరోపణలు సైతం లేకపోలేదు. తాజాగా, స్థలం రిజిస్ట్రేషన్ కోసం ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేయగా.. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు శుక్రవారం నగదు ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఇదీ జరిగింది
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన హరీశ్ ఇటీవల 128 గజాల స్థలం కొనుగోలు చేశారు. అయితే, రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ తస్లీమాను సంప్రదించగా.. ఆమె గజానికి రూ.200 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని గజానికి రూ.150 చొప్పున ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. అనంతరం బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో పక్కా ప్లాన్ తో.. బాధితుడు తస్లీమాకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మొత్తం రూ.19,200 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అలాగే, ఎలాంటి ఆధారాలు లేకుండా ఔట్ సోర్సింగ్ సిబ్బంది వద్ద ఉన్న రూ.1.78 లక్షలను సైతం ఏసీబీ అధికారులు సీజ్ చేసి సదరు డాక్యుమెంట్ రైటర్ ను అరెస్ట్ చేశారు. దీంతో సామాజిక సేవకురాలిగా పేరొందిన ఓ అధికారిణి.. ఇలా అవినీతి కేసులో పట్టుబడడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది.
No comments:
Post a Comment