Friday, 22 March 2024

చెక్‌‘పోస్టులు’ ఉంచుతారా.. ఎత్తేస్తారా? ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ


  

చెక్‌‘పోస్టులు’ ఉంచుతారా.. ఎత్తేస్తారా? ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ

రాష్ట్రప్రభుత్వం చెక్‌పోస్టులు ఉంచుతుందా? ఎత్తేస్తుందా? అనేది ప్రస్తుతం స్టేట్ ట్రాన్స్‌పోర్టు అథారిటీలో హాట్ టాపిక్‌గా మారింది.

రాష్ట్రప్రభుత్వం చెక్‌పోస్టులు ఉంచుతుందా? ఎత్తేస్తుందా? అనేది ప్రస్తుతం స్టేట్ ట్రాన్స్‌పోర్టు అథారిటీలో హాట్ టాపిక్‌గా మారింది. కేంద్రం ఆదేశాలు ఇచ్చినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకా చెక్ పోస్టులపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది సంస్థ ఉద్యోగుల్లోనూ చర్చనీయాంశమైంది. ఒకవేళ ప్రభుత్వం చెక్ పోస్టులను రద్దు చేస్తే మాత్రం వారిని ఆర్టీఓ పరిధిలోకి తీసుకురానుంది. వారితో ఎన్‌ఫోర్స్‌మెంట్ మొబైల్ టీంలుగా చేసే అవకాశం ఉందని సమాచారం.

ఇతర రాష్ట్రాల నుంచి మద్యం, మాదక ద్రవ్యాలు రాకుండా, పీడీఎస్‌ బియ్యం తదితర సరఫరా కాకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. రాష్ట్ర సరిహద్దుల్లో 14 చెక్ పోస్టులున్నాయి. కామారెడ్డిలో ఒకటి ఇంట్రా స్టేట్ చెక్ పోస్టును ఏర్పాటు చేశారు. సాలూరా(నిజామాబాద్), ఆదిలాబాద్, జహీరాబాద్(సంగారెడ్డి), మద్నూరు(కామారెడ్డి), బైంసా(నిర్మల్),వాంకిడి(కొమ్రంభీం ఆసిపాబాద్), అలంపూర్(జోగులాంబ), కృష్ణుడు(నారాయణపేట), విష్ణుపురం, నాగార్జునసాగర్(నల్లగొండ), కోదాడ(సూర్యాపేట), కల్లూరు(ఖమ్మం), అశ్వరావుపేట, పాల్వంచ(భద్రాద్రికొత్తగూడెం)లో ఉన్నాయి.

వీటి ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి అనుమతి లేకుండా వచ్చేవాటికి చెక్ పెడుతున్నారు. చెక్‌పోస్టుల వద్ద నిరంతరం పర్యవేక్షణ చేయడంతో పాటు జాతీయ రహదారిపై నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి చెక్ పోస్టుల్లో మూడు షిప్టుల్లో ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం ఐదురోజుల క్రితం జీఓ ఎంఎస్ నెం.24ను జారీ చేసింది. ఈ జీవోతో ఏపీలో చెక్ పోస్టులను రద్దుచేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో తెలంగాణలో కూడా రద్దుచేస్తారా? అనేది చర్చనీయాంశమైంది. సంబంధిత ఉన్నతాధికారులు మాత్రం ప్రభుత్వం తీసుకునే పాలసీలు తమకు తెలియదంటున్నారు. ప్రభుత్వం నుంచి జీవో వచ్చినప్పుడే తాము చెప్పగలమంటూ అభిప్రాయపడుతున్నారు.

చెక్ పోస్టులు ఎత్తేస్తే పోస్టింగ్ ఎక్కడ?

రాష్ట్రప్రభుత్వం ఒకవేళ చెక్ పోస్టులు ఎత్తేస్తే అక్కడ పని చేసే ఉద్యోగులు, సిబ్బందిని ఎక్కడ పోస్టింగ్ ఇస్తారనే చర్చకూడా కొనసాగుతోంది. సిబ్బంది తక్కువ ఉన్న జిల్లాల్లో డిప్యూటేషన్ చేయనున్నట్లు సమాచారం. మిగతా సిబ్బందిని ఎన్‌ఫోర్స్‌మెంట్ మొబైల్ టీంలు చేసే ఆలోచన కూడా అధికారులు చేస్తున్నట్లు తెలిసింది. ఈ టీంలతో ఆయా జిల్లాల్లో వాహనాల తనిఖీ చేయించనున్నట్లు సమాచారం. అయితే ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే చెక్ పోస్టుల కొనసాగింపు ఆధారపడింది.

కేంద్ర ఆదేశాలు రాష్ట్ర సర్కార్ పాటించేనా?

కేంద్ర ప్రభుత్వం చెక్ పోస్టులు ఎత్తేయాలని గతంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అందులో భాగంగానే కొన్ని రాష్ట్రాలు నిర్ణయం తీసుకొని ఎత్తేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం అమలు చేయలేదు. ఇతర రాష్ట్రాల నుంచి అనుమతి లేకుండా వచ్చే ప్రతి వస్తువును అడ్డుకున్నారు. ధాన్యం, మద్యం ఇలా ఏదీ రాష్ట్రంలోకి రానివ్వకుండా అడ్డుకట్టవేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా చర్యలు తీసుకున్నారు. చెక్ పోస్టులతో ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది. తాజాగా ఐదురోజుల క్రితం ఏపీ ప్రభుత్వం సైతం తొలగించడంతో తెలంగాణలో మూడు నెలల క్రితమే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేంద్రం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తుందా? లేదా? అనేది ఉద్యోగుల్లో చర్చనీయాంశమైంది. అది ప్రభుత్వ పాలసీ కావడంతో ఏం నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.

No comments:

Post a Comment