అస్థిపంజరాల నుంచి జాంబీ డ్రగ్ తయారీ, శ్మశానాల్లో ఎముకలు ఎత్తుకుపోతున్న ముఠాలు
Sierra Leone: సియెరా లియోన్ దేశంలో మనుషుల ఎముకల నుంచి డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాలు పెరుగుతున్నాయ
Sierra Leone Emergency: జంతువులు ఎముకల నుంచి నూనె తయారు చేస్తున్నారని తెలుసు. కానీ..మనుషుల ఎముకల నుంచి డ్రగ్స్ తయారు చేస్తున్న వాళ్లూ ఉన్నారు. పశ్చిమాఫ్రికాలోని సియెరా లియోన్ (Sierra Leone)దేశంలో ఇదే జరుగుతోంది. దేశమంతా ఇదో నెట్‌వర్క్‌లా పాకిపోయింది. ఇంకా గుబులు పుట్టించే విషయం ఏంటంటే...స్మశానాల్లో పాతిపెట్టిన శవాలను తవ్వి బయటకు తీసి ఆ మృతదేహాల నుంచి ఎముకల్ని సేకరిస్తున్నాయి ముఠాలు. ఆ ఎముకల నుంచి డ్రగ్స్ తయారు చేస్తున్నాయి. ఇలా చాలా చోట్ల స్మశానాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇది గమనించిన ప్రభుత్వం వెంటనే దేశమంతటా ఎమర్జెన్సీ ప్రకటించింది. Zombie Drug గా పిలుస్తున్న ఈ డ్రగ్‌ని అస్థి పంజరాల నుంచి తయారు చేస్తున్నారు. దీని Kush అనే మరో పేరు కూడా పెట్టారు. పాతిపెట్టిన ఎముకలే ఈ డ్రగ్ తయారీలో కీలకం. దీని నుంచి అత్యంత టాక్సిక్ అయిన డ్రగ్‌ని తయారు చేసేస్తున్నారు. ఆరేళ్ల క్రితమే ఈ దేశంలో మొదటి సారి ఈ డ్రగ్ వెలుగులోకి వచ్చింది. ఇది తీసుకున్న వెంటనే విపరీతమైన మత్తు వచ్చేస్తుంది. కొద్ది గంటల పాటు ఆ మత్తులో నుంచి బయటపడలేరు. మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండడం వల్ల ఆ మేరకు సప్లై పెంచుతూ పోతున్నాయి ముఠాలు. ఈ డిమాండ్‌కి తగ్గట్టుగా సరఫరా చేసేందుకు స్మశానాల్ని టార్గెట్‌గా పెట్టుకుని అస్థిపంజరాల్ని చోరీ చేస్తున్నారు. కొన్ని చోట్ల సమాధులు కట్టినా వాటిని పగలగొట్టి ఎముకల్ని ఎత్తుకుపోతున్నారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకున్న ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ఎమర్జెన్సీ ప్రకటించడంతో పాటు స్మశానాల వద్ద భద్రత ఏర్పాటు చేసింది.
సియెరా లియోన్ అధ్యక్షుడు జులియస్ మాదా బయో (Julius Maada Bio) ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డ్రగ్ తీసుకున్న వాళ్లలో చాలా మంది చనిపోతున్నారని వెల్లడించారు. ఈ డ్రగ్‌ని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు ప్రత్యేకంగా ఓ టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రతి జిల్లాలోనూ డ్రగ్‌కి బానిసైన వాళ్లను గుర్తించి వాళ్లకి కౌన్సిలింగ్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. అధికారులకూ ఆదేశాలిచ్చారు. వెంటనే ఈ డ్రగ్ సప్లయర్స్‌ని అరెస్ట్ చేయాలని తేల్చి చెప్పారు. ప్రస్తుతానికి దేశంలో Freetown లో మాత్రమే రీహాబిలిటేషన్ సెంటర్ ఉంది. అయితే...ప్రస్తుత సమస్యని ఎదుర్కోవాలంటే మరి కొన్ని చోట్ల ఈ సెంటర్స్‌ని ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎమర్జెన్సీ ప్రకటించడం సరైన నిర్ణయం అని చెబుతున్నారు. ఇప్పటి వరకూ ఈ డ్రగ్ తీసుకుని చనిపోయిన వాళ్లకు సంబంధించి అధికారిక లెక్కలు ఏమీ వెల్లడికాకపోయినా కచ్చితంగా ఇది ప్రాణాంతకం అని తేల్చిచెబుతున్నారు వైద్యులు. BBC చెప్పిన వివరాల ప్రకారం...వందలాది మంది యువకులు ఈ డ్రగ్ తీసుకుని ప్రాణాలు కోల్పోయారు. అవయవాలు పాడవడం వల్ల చనిపోయారు. 2020-23 వరకూ దేశవ్యాప్తంగా Kush Drug కారణంగా మానసిక వ్యాధులతో బాధ పడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగింది.
No comments:
Post a Comment