Monday, 2 September 2024

భారీ వర్షాలు, వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి తెలిపారు.

      భారీ వర్షాలు, వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇచ్చేందుకు ప్రభుత్వం  నిర్ణయించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి తెలిపారు.







          మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టం,అనంతర పరిస్థితులపై సోమవారం అయన సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గం పరిధిలోని  మోతె మండలం నామవరం వద్ద  మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగంతో సమీక్షించారు.


       గత నెల 30, 31 ,ఈ నెల 1న అకాల వర్షాల కారణంగా సూర్యాపేట జిల్లాలో 30 సెంటీమీటర్ల పైగా వర్షం కురిసి పెద్ద ఎత్తున పంట, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగాయని, ఇది బాధాకరమని అన్నారు. వర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్  గ్రేషియాను ఇచ్చేందుకు ప్రభుత్వం  నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే  పశువులు చనిపోతే యజమానికి 50 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించామని, మేకలు, గొర్రెలు చనిపోతే 5000 రూపాయలను ఆ యజమానులకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పంట నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు 10000 చొప్పున ఇవ్వాలని నిర్ణయించామని, ఇండ్లు కూలిన వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పూర్తి నష్ట పరిహారం ఇస్తామని, అలాగే అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు  సైతం నిర్మించి ఇస్తామని తెలిపారు. భారీ వర్షాలు, వరదల లో తక్షణ సహాయక చర్యలకు గాను  సూర్యపేట జిల్లా కలెక్టర్ కు 5 కోట్ల రూపాయలు ముందే మంజూరు చేసి సిద్ధంగా ఉంచడం జరిగిందని, జిల్లా కలెక్టర్ నిర్ణయం మేరకు ఆ నిధులను సహాయక చర్యలకు వినియోగించవచ్చని తెలిపారు. స్థానిక విపత్కర పరిస్థితులను బట్టి పాఠశాలలకు సెలవులు ప్రకటించే అధికారం జిల్లా కలెక్టర్లకే ఇచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. అధికారులు సమర్పించిన నివేదికల ఆధారంగా సూర్యాపేట జిల్లాలో 21 చెరువులు తెగిపోయాయని, 15 గ్రామాలనుండి 420 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, 20,000 ఎకరాలలో పంట నీట మునిగిందని, 7 పశువులు చనిపోగా, 7 పక్కా ఇండ్లు, 33 కచ్చా ఇండ్లు కూలిపోయాయని, హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి సైతం వర్షాలకు దెబ్బతినగా దానిని పునరుద్ధరించే చర్యలు చేపడతామని, తుంగతుర్తిలో సైతం పశువులు చనిపోయాయని ,చెక్ డ్యాములు తెగిపోయాయని తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు.


          భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రజలను సంపూర్ణంగా ఆదుకొని వారికి విశ్వాసం కల్పించాలన్న ఉద్దేశంతో జిల్లాలలో సమీక్షకు వచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అధికారులను  సన్నద్ధం చేయడమే కాకుండా, ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో ప్రజల కు సహాయ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని, రాష్ట్రస్థాయిలో చీఫ్ సెక్రటరీ, డిజి పి ,ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ ప్రజలకు ఏ విధంగా సహాయం చేయాలో నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ఎక్కడైనా విద్యుత్ అంతరాయం కలిగినట్లయితే తక్షణమే పునరుద్దిస్తున్నామని ,అలాగే వరదల వల్ల, వర్షాల వల్ల దెబ్బతిన్న జిల్లాలలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పునరావాస కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆదుకుంటున్నామని తెలిపారు. భారీ వర్షాలు ,వరదలలో ప్రజలకు అండగా ఉంటూ సహాయ సహకారాలు అందచేస్తున్న జిల్లా యంత్రంగాలు, మంత్రులు, ప్రజాప్రతినిధులను ఆయన అభినందించారు. 


          రాష్ట్రంలో భారీ వర్షాలు వరదల  దృష్ట్యా రాష్ట్రానికి ప్రత్యేకించి సూర్యాపేట హుజూర్నగర్ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని సహకారం అందించాలని ప్రధానమంత్రిని, హోంశాఖ మంత్రిని ,అలాగే రాహుల్ గాంధీని సైతం కోరామని, వారు సంపూర్ణ సహకారం అందించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు. విపత్కర పరిస్థితులలో రాజకీయాల కతీతంగా ప్రతి ఒక్కరు ప్రజలకు అండగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వరదల వల్ల నష్టపోయిన ప్రజల సహాయార్థం సీఎం సహాయ నిధికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు    ముందుకు రావడం పట్ల ఆయన అభినందించారు. స్వచ్ఛంద సంస్థలు, ఇతరులు ఎవరైనా సీఎం సహాయనిధికి విరాళాలు అందిస్తే ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతిపక్షాలు సైతం రాజకీయాలకతీతంగా ప్రస్తుత తరుణంలో ప్రజలకు అండగా నిలబడి ప్రభుత్వానికి సహకారం అందించాలని కోరారు  తాను గడచిన మూడు రోజులుగా కమాండ్ కంట్రోల్ రూమ్ లోనే ఉండి ప్రజలను ఆదుకునేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.


       వరదలు, విపత్తులు సంభవించిన సమయంలో ఎన్డీఆర్ఎఫ్ కోసం కేంద్రం వైపు చూడాల్సి వస్తుందని, దీనిని అధిగమించేందుకుగాను, రాష్ట్రంలోనే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సును (SDRF) ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ లో ఎనిమిది బృందాలు ఉంటాయని, ఒక్కో బృందంలో వందమంది చొప్పున స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి అలాంటి వ్యవస్థ ను ఏర్పాటు చేయనున్నామని,  ఈ బృందాలను స్పెషల్ బెటాలియన్లు ఉన్నచోట  ఉంచి ఎక్కడైనా  విపత్తులు సంభవిస్తే  అక్కడ ఆదుకునేందుకు వీటిని పంపించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో తలెత్తిన వరదలు, భారీ వర్షాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు రాష్ట్రానికి రావాలని ప్రధానమంత్రిని కోరినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. అలాగే  భారీ వర్షాలు వరదల వల్ల రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమికంగా 5000 కోట్ల  రూపాయల నష్టం జరిగినట్లు అంచనాకు రావడం జరిగిందని ,అందువల్ల వెంటనే 5000 కోట్ల రూపాయలు నష్టపరిహారం మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరడం జరిగిందని ,పూర్తిస్థాయి నివేదిక అందిన తర్వాత కేంద్ర ప్రభుత్వనికి నివేదిక  పంపిస్తామని  తెలిపారు.తక్షణమే కనీసం రెండువేల కోట్ల అయినా విడుదల చేయించే విధంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,  బండి సంజీయ్ లు కృషి చేయాలని కోరారు. ప్రజా ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని ,అంతేకాక అధికారులను సైతం పూర్తిస్థాయిలో అండగా ఉంటారని ముఖ్యమంత్రి తెలిపారు. భారీ వర్షాలు ,వరదల నుండి ప్రజలు కోలుకునేందుకు అధికారులు ఇంకా బాగా బాధ్యతగా పనిచేయాలని, ప్రజలలోనే ఉండాలని, ప్రజలను ఆదుకోవాలని ఆయన ఆదేశించారు.


         రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలలో తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని ప్రజాప్రతినిధులతో పాటు, యావత్తు యంత్రాంగం ప్రజలకు వరద సహాయక చర్యలను చేపట్టి రుజువు చేసిందని తెలిపారు. అధికారులు అద్భుతంగా పనిచేస్తూ ముందుకెళుతున్నారని చెప్పారు. సూర్యపేట జిల్లాలో వరదల వల్ల జరిగిన నష్టాన్ని ఆయన ముఖ్యమంత్రి కి వివరించారు. అంతేకాక చనిపోయిన వారికి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, నీట మునిగిన పొలాలకు నష్టపరిహారం చెల్లించాలని, గృహాలు కోల్పోయిన వారికి సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.


   రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ భారీ వర్షాలు ,వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతులతోపాటు, ఇండ్లు కోల్పోయిన వారు ,ఇతరులకు అండగా ఉంటామని, ప్రజలు ధైర్యంగా ఉండాలని  కోరారు.అధికారుల నివేదిక ప్రకారం సూర్యాపేట జిల్లాలో 11 రోడ్లు తేగిపోయాయని వాటన్నిటికి మరమ్మతులు చేపట్టేందుకు అంచనాలు రూపొందించాలని ఆదేశించడం జరిగిందని, ప్రాథమిక నివేదిక ప్రకారం ఆర్ అండ్ బి రహదారుల మరమ్మతుకు 23 కోట్ల రూపాయలు అవసరమవుతాయని, వర్షాలు తగ్గిన వెంటనే రహదారుల రిపేర్లను చేపడతామని చెప్పారు. తమ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు రెండు లక్షల  రూపాయల రుణమాఫీని చేయడం జరిగిందని,  వరదలు వలన పంటలు నష్టపోయిన రైతులకు పంట  నష్టపరిహారం ఇస్తామని తెలిపారు. ఆర్ అండ్ బి రహదారులతో పాటు ,పంచాయతీ రోడ్లను పునరుద్ధరిస్తామని ,అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పేదలకు, రైతులకు అండగా నిలబడాలని ,ఇందుకు ఎవరు సెలవు పై వెళ్లకుండా 24 గంటలు పని చేయాలని ఆయన కోరారు.


        జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మాట్లాడుతూ జిల్లాలోని పలు ప్రాంతాలలో గడచిన మూడు రోజుల కురిసిన భారీ వర్షాల వర్షపాతం వివరాలను, నష్టాన్ని తెలియజేశారు. ప్రాణ నష్టం తగ్గించేందుకుగాను, ప్రతి గ్రామంలో ముందే బృందాలను ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయడం జరిగిందని, అందువల్ల ఎక్కువగా ప్రాణ నష్టం జరగలేదని, ఇంకా 5 పునరావాస క్యాంపులను నిర్వహిస్తున్నామని, రహదారులు తెగిపోయి రవాణాకు ఇబ్బంది ఏర్పడిన చోట, విద్యుత్తు, తాగునీరు వంటి ఇబ్బందులు కలిగిన చోట పునరుద్ధరణ చర్యలను చేపట్టడం జరిగిందని ,ఆయా శాఖల వారిగా పూర్తి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిస్తామని వెల్లడించారు .


      కోదాడ శాసనసభ్యురాలు పద్మావతి మాట్లాడుతూ జిల్లాలో కురిసిన వర్షాల వల్ల కోదాడ, ఇతర ప్రాంతాలలో చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహిస్తున్న వారి దుకాణాలు, ఇండ్లు మునిగిపోయాయని, వర్షాల కారణంగా పడిపోయిన ఇండ్లు కోల్పోయిన వారికి సహకారం అందించాలని, అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారులకు వ్యాపారం చేసుకునేందుకు సహాయం అందించాలని, వారికి ప్రత్యేక రుణాలు మంజూరు చేయాలని, కోదాడ మున్సిపాలిటీలో ఎలాంటి నిధులు లేనందున దెబ్బతిన్న రోడ్లు ఇతర మరమ్మతులు చేపట్టేందుకు మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.


    తుంగతుర్తి శాసనసభ్యులు  మందుల సామెల్ మాట్లాడుతూ నియోజకవర్గంలో 670 చెరువులు తెగిపోయాయని, తెగిపోయిన చెరువులకు మరమ్మతులు చేపట్టాలని, అదేవిధంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు.


       ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ,నల్గొండ పార్లమెంట్ సభ్యులు రఘువీర్ తదితరులు ఉన్నార.

No comments:

Post a Comment