Saturday, 9 September 2023

తెలంగాణ భాషా దినోత్సవం: అక్షరాలతో రజాకార్ల గుండెల్లో దడ పుట్టించిన కాళోజీ

 



మన దేశ అధికారిక భాష ఏంటని అడిగితే టక్కున వచ్చే సమాధానం హిందీ. అయితే అన్ని రాష్ట్రాల వారు మాట్లాడగలిగే భాష కాబట్టి హిందీని జాతీయ భాష అని పేర్కొన్నాం. కానీ రాష్ట్రాల్లో జాతీయ భాష కన్నా ప్రాంతీయ భాషపైనే అభిమానం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష గురించి గొప్పగా చెప్పుకుంటాం. అయితే తెలుగు భాషలోనూ  తెలంగాణ, ఆంధ్ర మాండలికాలు ఉంటాయి.


తెలుగు భాష ఒక్కటైనా మాండలికాలెన్నో. ఆంధ్రులు మాట్లాడే విధానానికి , తెలంగాణ ప్రజలు మాట్లాడే భాషకు మధ్య బోలెడు వ్యత్యాసం ఉంటుంది. తెలంగాణ యాస వినసొంపుగా ఉంటుంది. నిజాం పాలనలో ఉర్దూ ప్రాబల్యాన్ని తట్టుకొని మరీ తెలంగాణ ప్రాంతంలో తెలుగు నిలబడింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయ్యాక ఉర్దూ కలగలిసిన తెంగాణ ప్రజల యాసను కొందరు గేలి చేశారు. దీన్ని తెలంగాణ కవులు తీవ్రంగా విమర్శించారు. అలాంటి వారిలో కాళోజీ నారాయణరావు ఒకరు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన.. తెలుగు భాషపై, తెలంగాణ యాసపై ఎనలేని ప్రేమ కనబరిచారు.


తెలంగాణ భాష, యాస,సంస్కృతి, సాహిత్యాలకు తన ధిక్కార స్వరాన్ని జోడించి అందరికి దగ్గరయ్యారు. తన అక్షరాలతో  ఆనాటి రజాకార్ల గుండెళ్లో రైళ్లు పరిగెత్తించారు. స్వాతంత్య్రానంతరం ఎప్పటికప్పుడు తన అక్షరాలు, మాటల తూటాలతో ఖండిస్తూ ముందుకు సాగిన మహోన్నతుడు. బూటకపు ఎన్ కౌంటర్లకు వ్యతిరేకంగా తెలంగాణ సైరన్ మోగిస్తూ ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయమంటూ నిరంతరం పరితపించిన వ్యక్తి. తాను చేసే పనిని గొడవగానే భావించి.. అదే నా గొడవ.. ఇదే కాళోజీ గొడవ అంటూ నినదించారు. సెప్టెంబర్ 9న(శనివారం) కాళోజీ నారాయణరావు జయంతి. భాషా సాహిత్యానికి ఆయన చేసిన సేవకు గానూ సెప్టెంబరు 9న తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తూ వస్తోంది.


కర్నాటకలోని బీజాపూర్ జిల్లా రట్టిహళ్లి గ్రామానికి చెందిన రంగారావు, రమాబాయి దంపతులకు 1914 సెప్టెంబర్‌ 9న కాళోజీ జన్మించారు. హన్మకొండ జిల్లా మణికొండలో ప్రాథమిక విద్య, హైదరాబాద్‌లో ఉన్నతవిద్యను అభ్యసించారు. 15ఏండ్ల వయస్సు నుంచే రాజకీయ ఉత్సవాలు, కవితా రచన, వ్యాసాంగాల్లో మునిగిపోయారు. ఆర్యసమాజం, ఆంధ్రమహాసభ, నిజాంస్టేట్‌ కాంగ్రెస్‌లో ఉంటూ.. నైజాం వ్యతిరేక పోరాటంలో పనిచేశారు. కాళోజీ సోదరుడు రామేశ్వరరావు ఉర్దూ సాహిత్యంలో గొప్పదిట్ట. ఆయన షాద్‌ కలం పేరుతో రచనలు చేసేవాడు. రామేశ్వరరావును పెద్ద కాళోజీగా పిలిస్తే… నారాయణరావును చిన్న కాళోజీగా పిలిచేవారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1958 నుంచి 1960 వరకు ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి సభ్యుడిగా, ఆంధ్రసారస్వత పరిషత్‌, ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీలో సభ్యుడిగా తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. సుదీర్ఘకాలంపాటు పలు పోరాటాల్లో పాల్గొంటూ…. ఎప్పటికప్పుడు ఆయా పరిస్థితుల్లోని దౌర్జన్యాలను, వ్యక్తుల ప్రవర్తన, నడవడికను ఎండగడుతూ కవిత్వాలు రాశారు. అనేక రచనలు చేశారు. 1992లో పద్మవిభూషణ్‌ పురస్కారం అందుకున్న కాళోజీ మరెన్నో అవార్డులు సొంతం చేనుకున్నారు.


ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నది. 2014 సెప్టెంబర్‌ 9న కాళోజీ 100వ జయంతి సభలో సీఎం కేసీఆర్‌ ప్రతి ఏడాది సెప్టెంబర్‌ 9న తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించాలని జీవో జారీ చేసింది. తెలంగాణలో భాష, సాహిత్యంలో విశేష కృషి చేసిన వారికి కాళోజీ పేరిట స్మారక పురస్కారాలను 2015 నుంచి ప్రధానం చేస్తున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో భాషా చైతన్య కార్యక్రమాలతోపాటు విద్యార్థులకు తెలంగాణ భాషపై చర్చాగోష్ఠులు, వ్యాసరచన, ఉపన్యాస , కవితా పోటీలు నిర్వహిస్తూ స్మరించుకోవడం విశేషం.

No comments:

Post a Comment