నిజాంపై అలుపెరుగని పోరాటం, పటేల్ వల్లే సాధ్యమైంది: అమిత్ షా స్పీచ్‌లో అవేం లేవు!
జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ఆయన.. పారా మిలటరీ దళాల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. హైదరాబాద్ విముక్తి కోసం పోరాడిన అమరవీరులకు నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవం గురించి దేశ ప్రజలందరికీ తెలియాలన్నారు. సర్ధార్ వల్లభ్‌భాయ్ పటేల్ చొరవతో హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కలిగిందన్నారు.
ఆపరేషన్ పోలో పేరుతో పటేల్.. నిజాం మెడలు వంచారన్నారు. రక్తం చిందకుండా నిజాం రజాకారులు లొంగిపోయేలా చేశారన్నారు. పటేల్ లేకపోతే తెలంగాణకు అంత త్వరగా విముక్తి లభించేది కాదని అమిత్ షా వ్యాఖ్యానించారు.
నిజాం పాలనకు వ్యతిరేకంగా ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేశారన్నారు. రావి నారాయణ రెడ్డి, కాళోజీ నారాయణరావు, బద్దం ఎల్లారెడ్డి, బూర్గుల రామకృష్ణా రావు, నరసింహారావుకు తాను నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. అయితే, అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీలపై ఎలాంటి విమర్శలు చేయకుండానే అమిత్ షా తన ప్రసంగాన్ని ముగించడం గమనార్హం.
అంతకుముందు, 'నాటి హైదరాబాద్ సంస్థాన ప్రజలందరికీ హైదరాబాద్ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. నిజాం దుష్ట పాలన, అణచివేత నుంచి విముక్తి కోసం హైదరాబాద్ సంస్థాన ప్రజలు సాగించిన అలుపెరగని పోరాటానికి, ఇక్కడి ప్రజల అచంచల దేశభక్తికి ఈ రోజు నిదర్శనం. హైదరాబాద్ విముక్తి పోరాటంలో అమరులైన వీరులందరికీ నా హృదయపూర్వక నివాళులు' అని అమిత్ షా ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
ఈ వేడుకల్లో అమిత్ షాతోపాటు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు, తదితరులు పాల్గొన్నారు. మొదట అమరవీరుల స్తూపం వద్ద అమిత్ షా నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత భద్రతా బలగాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు.
హైదరాబాద్ సంస్థానం భారత సమాఖ్యలో విలీనమైన సెప్టెంబర్ 17ను.. తెలంగాణ విమోచనం (Telangana Liberation Day) పేరిట కేంద్ర ప్రభుత్వం వేడుకల్ని నిర్వహిస్తోంది. గత ఏడాది మాదిరిగానే సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్ వేదికగా ఉత్సవాలు జరగాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ విమోచన వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం రాత్రే ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర నేతలు శంషాబాద్ విమానాశ్రయంలో అమిత్ షాకు ఘన స్వాగతం పలికారు.
No comments:
Post a Comment