వెంకట్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లోకి జిట్టా ,భువనగిరి కాంగ్రెస్ లో కొత్త జోష్
విధాత : బీజేపీకి రాజీనామా చేసిన భువనగిరి అసెంబ్లీ నియోజవర్గం నేత జిట్టా బాలకృష్ణారెడ్డి శనివారం మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం జిట్టా అనుచరులు, మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీగా హైద్రాబాద్‌లోని వెంకట్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు. జిట్టాకు కాంగ్రెస్ కండువా కప్పిన వెంకట్‌రెడ్డి సాధరంగా కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుడైన జిట్టా తనకు సోదరుడి వంటివారని, ఆయన చేసిన ఉద్యమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు జనంలో ఎంతో ఆదరణ పొందాయన్నారు. జిట్టా చేరికతో భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమైందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలువబోతుందన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఈ దఫా అధికారంలోకి రాబోతుందన్నారు.
పార్టీలో చేరిన జిట్టా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ లో తన చేరికకు సహకరించిన వెంకట్‌రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టేలా పార్టీ గెలుపుకు కృషి చేస్తానన్నారు. పార్టీలో ఏళ్ల తరబడిగా పనిచేస్తున్న నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తనను ఆదరించి పార్టీలోకి ఆహ్వానించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో, జిల్లాలో పార్టీ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తానన్నారు. భువనగిరి నియోజకవర్గంలో పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం పనిచేస్తానన్నారు.
No comments:
Post a Comment