Tuesday, 30 June 2026

మిర్యాలగూడ రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్* ..

మిర్యాలగూడ రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్* . నల్లగొండ జిల్లా పోలీసు శాఖలో పరిపాలనా సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడం, కేసుల దర్యాప్తును వేగవంతం చేయడం, రికార్డుల నిర్వహణను పటిష్టంగా ఉంచే లక్ష్యంతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ మంగళవారం మిర్యాలగూడ రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీ చేశారు.


ఈ సందర్భంగా కార్యాలయంలోని గ్రేవ్ కేసుల క్రైమ్ ఫైల్స్, పెండింగ్ కేసుల రికార్డులు, ఇతర కేసులకు సంబంధించిన దర్యాప్తు పత్రాలను సవివరంగా పరిశీలించారు. బాధితులకు సత్వర న్యాయం అందేలా కేసుల దర్యాప్తును నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


హత్యలు, దోపిడీలు, మహిళలు మరియు చిన్నారులపై జరిగే నేరాలు, సైబర్ నేరాలు వంటి గ్రేవ్ కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించిన ఎస్పీ, పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన ఛేదించాలని సూచించారు. ప్రతి కేసులో శాస్త్రీయ ఆధారాలు, సాంకేతిక సాక్ష్యాలను సమర్థంగా సేకరించి, నిందితులకు చట్టపరమైన శిక్షలు పడేలా నాణ్యమైన దర్యాప్తు నిర్వహించాలని స్పష్టం చేశారు.


అలాగే సీసీటీఎన్‌ఎస్ నమోదు విధానం, డిజిటల్ రికార్డుల నిర్వహణ, కోర్టు కేసుల డిస్పోజల్ ఫాలోఅప్, వారెంట్ల అమలు, పెండింగ్ ప్రక్రియలపై కూడా సమీక్ష నిర్వహించి, అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు.


ప్రజలకు పోలీస్ శాఖపై విశ్వాసం మరింత పెరిగేలా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా, పారదర్శకంగా పనిచేయాలని, ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా అందుబాటులో ఉండాలని ఎస్పీ ఆదేశించారు. 

శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి అలసత్వం సహించబోమని, ప్రజా భద్రతే పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు.


ఈ తనిఖీలో మిర్యాలగూడ రూరల్ సీఐ పి.ఎన్.డి. ప్రసాద్‌తో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Sunday, 28 June 2026

వైశ్య వ్యాపార శక్తికి ప్రతీకగా వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్

 వైశ్య వ్యాపార శక్తికి ప్రతీకగా వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్






విజయవంతంగా ముగించిన వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026


పాల్గొన్న వివిధ రాష్ట్రాల 250 మంది పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు


వ్యాపారాభివృద్ధి, నెట్‌వర్కింగ్‌, పరస్పర సహకారానికి కొత్త దిశ


హైదరాబాద్, జూన్ 28 (): దేశవ్యాప్తంగా ఉన్న వైశ్య వ్యాపారవేత్తలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, వ్యాపార సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు నూతన అవకాశాలకు మార్గం సుగమం చేయాలనే లక్ష్యంతో నిర్వహించిన వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించి విజయవంతంగా ముగించారు. మాదాపూర్‌లోని హోటల్ ఆవాసలో జరిగిన ఈ జాతీయ స్థాయి వ్యాపార సదస్సుకు వివిధ రాష్ట్రాలు, నగరాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, వ్యాపారవేత్తలు, యువ ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమానికి విశేష ఆదరణ కల్పించారు.గ్లోబల్ ప్రెసిడెంట్ మహేంద్ర చీమకుర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కాంక్లేవ్‌ను తెలంగాణ ఎక్స్‌పాన్షన్స్ లీడ్ డాక్టర్.నిషాంక్ కండె, హైదరాబాద్ వీ వైశ్య కౌండిన్య గ్రూప్ అధ్యక్షుడు శ్రీకాంత్ సమన్వయం చేశారు. వ్యాపార రంగంలో నెలకొన్న సవాళ్లు, అభివృద్ధి అవకాశాలు, పెట్టుబడుల విస్తరణ, భాగస్వామ్యాల పెంపు, మార్కెట్ ధోరణులు వంటి అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విజయవంతంగా రాణిస్తున్న వ్యాపారవేత్తలు తమ అనుభవాలను పంచుకుంటూ భవిష్యత్ వ్యాపార వ్యూహాలపై విలువైన సూచనలు అందించారు.


‘నేను’ నుంచి ‘మనం’ వైపు…


“Stop Thinking I… Start Thinking We” అనే నినాదంతో ముందుకు సాగుతున్న వీ వైశ్య గ్లోబల్ సంస్థ, సమిష్టి కృషి ద్వారానే స్థిరమైన విజయాలు సాధ్యమనే సందేశాన్ని కాంక్లేవ్ ద్వారా ప్రతిధ్వనింపజేసింది. పరస్పర సహకారం, విశ్వాసం, నెట్‌వర్కింగ్ ద్వారా వ్యాపారాలను మరింత విస్తరించుకోవచ్చని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి హాజరైన ప్రతినిధులు పరస్పర పరిచయాలు పెంపొందించుకొని భవిష్యత్ భాగస్వామ్యాలకు బాటలు వేశారు.


వ్యాపార భవిష్యత్తుపై ఏఐ మార్గనిర్దేశం


ప్రస్తుత డిజిటల్ యుగంలో కృత్రిమ మేధ (ఏఐ) వ్యాపార రంగాన్ని ఎలా ప్రభావితం చేస్తోందనే అంశంపై ప్రత్యేక సెషన్ నిర్వహించారు. ప్రముఖ ఏఐ ట్రైనర్ రఘువీర్ మాట్లాడుతూ, వ్యాపారాభివృద్ధిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం, డిజిటల్ మార్కెటింగ్, కస్టమర్ రిలేషన్ మేనేజ్‌మెంట్, ఆటోమేషన్, డేటా ఆధారిత నిర్ణయాల ప్రాముఖ్యతపై సమగ్రంగా వివరించారు. భవిష్యత్ వ్యాపార పోటీలో నిలదొక్కుకోవాలంటే ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకోవడం అనివార్యమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు ఏఐ సాధనాలను వినియోగించడం ద్వారా తమ ఉత్పాదకతను, లాభదాయకతను పెంచుకోవచ్చని సూచించారు. ఆయన ప్రదర్శన ప్రతినిధులను విశేషంగా ఆకట్టుకుంది.


ఆరోగ్యంపైనా ప్రత్యేక దృష్టి


వ్యాపారాభివృద్ధితో పాటు ఆరోగ్య పరిరక్షణ కూడా అంతే ముఖ్యమనే ఉద్దేశంతో నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సు ఆకట్టుకుంది. ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ సోమనాథ్ గుప్తా మాట్లాడుతూ, వ్యాపారవేత్తలు ఆర్థికాభివృద్ధితో పాటు శారీరక, మానసిక ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. క్రమబద్ధమైన జీవనశైలి, సమతుల్య ఆహారం, సమయపాలన విజయవంతమైన జీవితానికి పునాదులని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎక్స్‌పాన్షన్స్ లీడ్ సోలార్ వాలా రాజేష్, హైదరాబాద్ కౌండిన్య గ్రూప్ కార్యదర్శి ప్రశాంత్ కుమార్, గ్లోబల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ సంతోష్ శెట్టి, పాస్ట్ గ్లోబల్ ప్రెసిడెంట్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 250 మందికి పైగా ప్రతినిధులు, దుబాయ్ కి చెందిన ప్రవాస భారతీయులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వైశ్య వ్యాపారవేత్తల మధ్య బలమైన అనుసంధానం, కొత్త అవకాశాల సృష్టి, పరస్పర సహకారానికి ఈ కాంక్లేవ్ ఒక మైలురాయిగా నిలిచిందని నిర్వాహకులు పేర్కొన్నారు.భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలిచే సమగ్ర వ్యాపార నెట్‌వర్క్ నిర్మాణమే తమ లక్ష్యమని, దేశవ్యాప్తంగా మరింత మంది వ్యాపారవేత్తలను ఈ వేదిక ద్వారా అనుసంధానించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

రాష్ట్రంలో హైబ్రీడ్ యాన్యుటీ మోడల్ (HAM) రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతూ, ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు నల్గొండ జిల్లా కనగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు.




 రాష్ట్రంలో హైబ్రీడ్ యాన్యుటీ మోడల్ (HAM) రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతూ, ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు నల్గొండ జిల్లా కనగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు.

✅ ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారితో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
✅ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో 13.06 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 34 ప్యాకేజీలుగా 6,092 కిలోమీటర్ల పొడవు గల 441 రహదారులను విస్తరించే కార్యక్రమం పైలాన్ ఆవిష్కరణతో ప్రారంభమైంది. పైలాన్ ఆవిష్కరించిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్థానికులను పలకరిస్తూ వారితో కరచాలనం చేస్తూ ముందుకు కదిలారు.

మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొదటి దశ ప్రాజెక్టు పురోగతిపై:ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి సమీక్షించారు

 మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొదటి దశ ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రి



శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. మూసీ రివర్‌బెడ్‌లో ఉన్న వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కేటాయించాలని సమావేశంలో ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు.

✅ ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
✅ సమావేశంలో మూసీ మొదటి దశ ప్రాజెక్ట్ పైన అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టులో భాగంగా అవసరమైన చోట భూ సేకరణ కోసం ఆసక్తి ఉన్న వాళ్లకు టీడీఆర్ ఇవ్వాలి లేదా పరిహారం చెల్లించాలని చెప్పారు.
✅ గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం తీసుకుంటున్న రక్షణ శాఖ భూముల్లో ఉన్న నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వమే తరలించాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే నెక్లెస్ రోడ్డులో ప్రజల సందర్శనార్థం మూసీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు సూచించారు. మూసీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టబోయే పనులను ఆ ఎక్స్‌పీరిన్స్ సెంటర్‌లో ప్రతిబింబించాలని చెప్పారు. ప్రాజెక్టుపైన ఈ సందర్భంగా ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించాలని సూచించారు.

Thursday, 25 June 2026

కొలువుదారులకు కొండంత అండ..!

 కొలువుదారులకు కొండంత అండ..!

రూ.1 కోటి నుంచి రూ.3 కోట్ల వరకు ప్రమాద బీమా రక్షణ
ప్రజా ప్రభుత్వం అందిస్తున్న మరో చారిత్రాత్మక సంక్షేమ నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల సామాజిక, ఆర్థిక భద్రతకు మరింత భరోసా కల్పిస్తూ రూ.1 కోటి నుంచి రూ.3 కోట్ల వరకు ప్రమాద బీమా రక్షణ అందించే నిర్ణయాన్ని ప్రజా ప్రభుత్వం తీసుకుంది.
ఈ పథకం అమలు కోసం ఆర్థిక శాఖ భాగస్వామ్య బ్యాంకులతో అవగాహన ఒప్పందాలు (MoU) కుదుర్చుకోనుంది.
ముఖ్యాంశాలు
✅ రూ.1 కోటి నుంచి రూ.3 కోట్ల వరకు ప్రమాద బీమా రక్షణ
✅ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపు
✅ పెన్షనర్లకు బీమా రక్షణ
✅ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వర్తింపు
✅ కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా బీమా సదుపాయం
✅ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే మరో కీలక నిర్ణయం

బయట పచ్చళ్ళు కొని లొట్టలేసుకుని తింటున్నారా? ఈ వీడియో చూస్తే చచ్చినా తినరు


 బయట పచ్చళ్ళు కొని లొట్టలేసుకుని తింటున్నారా? ఈ వీడియో చూస్తే చచ్చినా తినరు

            బయట పచ్చళ్ళు కొనుగోలు చేసుకుని చాలామంది తింటూ ఉంటారు. అయితే బయట కొనుగోలు చేసే పచ్చళ్ళు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇక తాజాగా వరంగల్ లో బయటపడిన కల్తీ పచ్చళ్ళు, బూజు పట్టి, కుళ్ళిన పచ్చళ్ళు చూస్తే మీరు జన్మలో బయట పచ్చళ్ళు కొనుగోలు చేసి తినరు. పచ్చడి తయారీ చేస్తున్న కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక తనిఖీ తాజాగా వరంగల్ నగరంలోని కాశిబుగ్గ ప్రాంతంలో అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో అక్రమంగా పచ్చడి తయారీ చేస్తున్న కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ సంఘటన మనం బయట నుంచి కొనుగోలు చేసే ఆహార పదార్థాలపై అందరూ ఆలోచించేలా చేస్తోంది. ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాశీబుగ్గ సాయి వీధిలో ఉన్న ఒక ఇంటిలో ఈ అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందిన టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. మరిన్ని కనుగొనండి Sports కుళ్ళిన బూజు పట్టిన వందల కిలోల పచ్చళ్ళు తనిఖీలో పెద్ద ఎత్తున కుళ్లిపోయిన ముడి సరుకులు బయటపడ్డాయి. టమోటా పచ్చడి : 750 కేజీలు, మామిడికాయ పచ్చడి : 900 కి.జి, నిమ్మకాయల పచ్చడి : 200 కేజీలు, ఉసిరికాయలు : 100 కేజీల పచ్చడి, అల్లం-వెల్లుల్లి పేస్ట్ : 150 కేజీలు టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పాడైపోయిన పచ్చళ్ళ మొత్తం విలువ: సుమారు రూ.2,25,000. పాడైపోయిన పచ్చళ్ళ విక్రయాలు ఈ పాడైపోయిన పచ్చళ్ళను చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి స్థానిక కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపార సంస్థలకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో అరికెల శ్రీనివాస్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఏసీపీ టాస్క్ ఫోర్స్ ఎ. మధుసూదన్ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ బండారి రాజు, ఆర్‌ఎస్‌ఐ ఓ. భాను ప్రకాష్ మరియు టాస్క్ ఫోర్స్ బృందం ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. స్వాధీనం చేసుకున్న సరుకు మరియు నిందితుడిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. Also Read హైదరాబాద్ మెట్రోపై కేంద్రం సూచన.. త్వరలోనే ఆ పనులు షురూ! కల్తీ ఆహారం వల్ల ఫుడ్ పాయిజన్ బయట పచ్చళ్ళు కొనేటప్పుడు చాలా మంది ధర, రుచి మాత్రమే చూస్తారు. కానీ వాటి వెనుక ఉన్న అపరిశుభ్రత, కల్తీలు, కుళ్లిన సరుకులు ఎవరికీ తెలియవు. ఇలాంటి కల్తీ ఆహారం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యి ఒక్కోసారి ప్రాణాల మీదకే రావచ్చు. అందుకే బ్రాండ్ లేని లేదా అనుమానాస్పదమైన పచ్చళ్ళు, ఆహార పదార్థాలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి అక్రమ కార్యకలాపాలు గమనించిన వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి అంటున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.

ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ కానుక


 ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ కానుక 

                             తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్ల ప్రమాద బీమాపై బ్యాంకర్లతో ప్రభుత్వం ఎంఓయూలను కుదుర్చుకుంది. ఈ మేరకు సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో 16 బ్యాంకులతో ప్రమాద బీమా ఒప్పందాలు జరిగాయి. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగులకు ప్రమాద బీమాను మొదట సింగరేణిలో ప్రారంభించామనని.. ఇప్పుడు అదే తరహాలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ అమలు చేస్తున్నామని తెలిపారు. పోయిన ప్రాణాన్ని తెచ్చివ్వలేము కానీ.. ఆర్థికంగా ఆదుకుని బాసటగా నిలవాలన్నదే తమ ఉద్దేశం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే ఉద్యోగులందరికీ ఇన్సూరెన్స్ ఇవ్వడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. పదవీ విరమణ తర్వాత కూడా ఉద్యోగులు ఇన్సూరెన్స్ ప్రయోజనాలు పొందేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. సంస్థ లేదా ప్రభుత్వం కోసం కష్టపడేవారికి అండగా ఉండాల్సిన బాధ్యత యజమానిదేనని ఈ మేరకు సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఇక ఈ పథకం కింద ఉద్యోగులు, కార్మికులకు గరిష్టంగా రూ. కోటి వరకు ప్రమాద బీమా అందించనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని కనుగొనండి Sports ఇప్పటికే సింగరేణి సంస్థకు చెందిన దాదాపు 45 మంది కార్మికులకు ఈ ప్రమాద బీమా సదుపాయాన్ని వర్తింపజేశామని వెల్లడించారు. అలాగే ఇకపై ఉద్యోగులు రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు సమస్టిగా పనిచేయాలని.. రోజుకు ఒక గంట అదనంగా పనిచేయాలని కోరారు. అలాగే తనను గుంపుమేస్త్రీ అని చాలామంది అవహేళన చేశారని, అయినా తాను బాధపడనని అన్నారు. ఈ గుంపంతా తనదేనని స్పష్టం చేశారు. తాను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినవాడినేనని.. హోదా, పదవులు మారినా, ప్రజలతో తనకున్న అనుబంధం మాత్రం మారదని తెలిపారు. తనకు రేవంతన్న అని పిలిపించుకోవడమే అత్యంత ఆనందాన్ని ఇస్తుందని భావోద్వేగం అయ్యారు.

జూన్ 25 – భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజు.

 జూన్ 25 – భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజు.



1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంపై ఎమర్జెన్సీ విధించి,

ప్రజల ప్రాథమిక హక్కులు, పత్రికా స్వేచ్ఛను రద్దు చేశారు.

ఆర్టికల్ 352 ప్రయోగించి నియంతృత్వ పాలనకు శ్రీకారం చుట్టారు.

ఆ దమనకాండను ప్రతిఘటిస్తూ,

నేను నా సహచరులతో కలిసి నల్లగొండలో కరపత్రాలు పంచాం.

అదే రోజు అరెస్ట్, జైలు, ఆజ్ఞాతవాసం, సత్యాగ్రహాలు…

1976 జనవరి 26న మళ్లీ అరెస్ట్ అయి

5 నెలల జైలు శిక్ష అనుభవించాం.

దేశం కోసం, ప్రజాస్వామ్యం కోసం

అప్పట్లో మేము నిస్వార్థంగా నిలబడ్డాం.

ఈరోజు, ఆ పోరాటాన్ని గుర్తు చేస్తూ

బీజేపీ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో

మాకు సన్మానం జరగడం గర్వంగా ఉంది.

ప్రజాస్వామ్యం ఉచితంగా రాలేదు.

త్యాగాల ఫలితం అది.

చరిత్రను మరిచిపోకూడదు…

మళ్లీ ఎమర్జెన్సీ రోజులు రాకుండా కాపాడుకోవాలి.

సర్ ప్రక్రియను పారదర్శకంగా, తప్పులు లేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్



              సర్ ప్రక్రియను పారదర్శకంగా, తప్పులు లేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. 


     గురువారం ఆయన నార్కెట్‌పల్లి మండలం, ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో జరుగుతున్న సర్ ఓటరు నమోదు, మ్యాపింగ్ ప్రక్రియను పరిశీలించారు. 



          ఈ సందర్భంగా రేగటి సత్తయ్య కుటుంబాన్ని వారి నివాసంలో కలిసి, ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు? వారి వివరాలు సక్రమంగా నమోదు చేస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు.

 ప్రతి కుటుంబానికి రెండు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తారని, ఒక ఫారాన్ని పూర్తిగా నింపి బూత్ లెవల్ అధికారికి (బీఎల్‌ఓ) తప్పనిసరిగా అందజేయాలని . కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని తెలిపారు.

బీఎల్‌ఓలకు కలెక్టర్ సూచనలు చేస్తూ, ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి వివరాలను నమోదు చేయాలని, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వేర్వేరు పోలింగ్ స్టేషన్లలో నమోదు కాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.

అదేవిధంగా బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) కూడా సర్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు పూర్తి సహకారం అందించి, ఓటరు వివరాల నమోదును విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.


         రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి కలెక్టర్ వెంట ఉన్నారు.


Thursday, 18 June 2026

బాలికల ఆశ్రమ పాఠశాలకు ఘన విరాళం ‘ఆర్ ఎస్ బ్రదర్స్’ నుంచి రూ.4 కోట్ల డిపాజిట్

 బాలికల ఆశ్రమ పాఠశాలకు ఘన విరాళం

‘ఆర్ ఎస్ బ్రదర్స్’ నుంచి రూ.4 కోట్ల డిపాజిట్



శంఖారావం :

బాలికల విద్యాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తలకొండపల్లి ఆశ్రమ పాఠశాలకు భారీ ఆర్థిక చేయూత లభించింది. హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో చాపుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలికల ఆశ్రమ పాఠశాలకు ప్రముఖ వ్యాపార సంస్థ ఆర్ ఎస్ బ్రదర్స్, సాత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం రూ.4 కోట్ల డిపాజిట్‌ను ప్రకటించింది.

ఈ సందర్భంగా సంస్థ ఎండీ రాజమౌళి మాట్లాడుతూ, బాలికల విద్యకు సహకరించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ఆశ్రమ పాఠశాల అభివృద్ధికి తొలి విడతగా రూ.కోటి చెక్కును చాపుల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వెంకటేష్‌కు అందజేశారు.

ఈ విరాళంతో ఆశ్రమ పాఠశాల మరింత బలోపేతం కావడంతో పాటు, పేద బాలికలకు మెరుగైన విద్యా అవకాశాలు కలగనున్నాయని నిర్వాహకులు తెలిపారు. బాలికల భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ సేవా కార్యక్రమం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు.


Sunday, 14 June 2026

ట్రాన్స్‌ఫార్మర్లలో కాపర్ వైర్లు, ఆయిల్ దొంగతనాలకు పాల్పడిన రోహింగ్యా ముఠా అరెస్ట్....వివరాలు వెల్లడించిన డీఎస్పీ కె. శివరాం రెడ్డి.

           


 ట్రాన్స్‌ఫార్మర్లలో కాపర్ వైర్లు, ఆయిల్ దొంగతనాలకు పాల్పడిన రోహింగ్యా ముఠా అరెస్ట్....వివరాలు వెల్లడించిన డీఎస్పీ కె. శివరాం రెడ్డి.

గ్యాంగ్ లీడర్ హమీద్ హుస్సేన్‌తో పాటు మరో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న నల్లగొండ జిల్లా పోలీసులు..
జహంగీర్ ఆలం, నూర్ కాసిమ్, నూరుల్ అమీన్, నూరుల్ ఆలం @ మహబూబ్ ఆలం అరెస్ట్...
రాష్ట్ర వ్యాప్తంగా 12 దొంగతనాల కేసులు ఛేదించిన పోలీసులు..
నార్కట్‌పల్లి, మాడ్గులపల్లి, చిట్యాల, వేములపల్లి, వాడపల్లి, పోచంపల్లి, యాదగిరిగుట్ట, రామన్నపేట, భువనగిరి ప్రాంతాల్లో నేరాలు...నిందితుల వద్ద నుంచి రూ.7.71 లక్షల నగదు రికవరీ...
రూ.2 లక్షల విలువైన 3 బైకులు, కట్టర్లు, పానాలు, హ్యాండ్ గ్లౌజులు స్వాధీనం...
రైతులకు, విద్యుత్ వ్యవస్థకు భారీ నష్టం కలిగించిన ముఠాపై ఉక్కుపాదం మోపిన పోలీసులు.

'ఇగ్నైట్' లాంటి మోసపూరిత మనీ సర్క్యులేషన్ స్కీమ్‌లలో చేరితే.. చట్టవిరుద్ధమైన వ్యాపారంలో భాగస్వాములైనట్లే లెక్క

 


'ఇగ్నైట్' లాంటి మోసపూరిత మనీ సర్క్యులేషన్ స్కీమ్‌లలో చేరితే.. చట్టవిరుద్ధమైన వ్యాపారంలో భాగస్వాములైనట్లే లెక్క!

తెలిసి కూడా ఇతరులను ఇందులో చేర్పిస్తూ.. వారి నుంచి డబ్బులు వసూలు చేసి పైస్థాయి వారికి చేరవేస్తే, నిషేధిత స్కీమ్‌లో పాల్గొన్న నేరానికి మీరే బాధ్యులు కావాల్సి ఉంటుంది.
ఇలాంటి మోసాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు!
అమాయకులను బురిడీ కొట్టించే మోసగాళ్ల వలలో పడి నిలువునా మోసపోకండి. అప్రమత్తంగా ఉండండి!

టీఆర్ఎస్ సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా కాసిపేట మైన్ వద్ద కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నాం




 టీఆర్ఎస్ సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా కాసిపేట మైన్ వద్ద కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నాం

ఈ ప్రభుత్వంలో సర్వసామాన్యంగా జరగాల్సిన పనులకు కూడా పోరాటం చేయాల్సి వస్తోంది.
పాలసీలు చేయాల్సిన సీఎం, డిప్యూటీ సీఎంలే వినతి పత్రాలిస్తూ సింగరేణి కార్మికులను మభ్య పెడుతున్నారు. డిపెండెంట్ ఉద్యోగాలతో సహా అన్నింటిలో కార్మికులకు అన్యాయం చేస్తున్నారు
నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు పెట్టాల్సిన ప్రభుత్వం నిలిపివేసింది
ఓపెన్ కాస్ట్ మైనింగ్ పెంచే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం… సింగరేణి కార్మికుల భద్రతను మాత్రం పట్టించుకోవటం లేదు.
సింగరేణి కార్మికుల హక్కులు, భద్రత, సంక్షేమం కోసం హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుంది

Friday, 12 June 2026

 https://heyzine.com/flip-book/0ea9a5b100.html

Friday, 5 June 2026

జగిత్యాల జిల్లా కొడిమ్యాల అటవీశాఖ ఏవో 80 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.

 80 వేలు తీసుకుంటే ఏసీబీకి చిక్కిన కొడిమ్యాల అటవీశాఖ ఏవో గులాం మొయినుద్దీన్... అరెస్టు చేసి నగదు స్వాధీనం చేసుకున్న ఏసిబి అధికారులు....


జగిత్యాల జిల్లా కొడిమ్యాల అటవీశాఖ ఏవో 80 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.



కొడిమ్యాలలో 120 టేకు చెట్లను కొట్టి రవాణా చేసేందుకు అనుమతి ఇవ్వడానికి ఎఫ్ఆర్వో గులాం మొయినుద్దీన్ రెండు లక్షలు లంచం డిమాండ్ చేశారు. అందులో ఇదివరకు లక్షా తీసుకున్నారు. మరో 80 వేలు ఈరోజు కొడిమ్యాల రేంజ్ కార్యాలయంలో తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. AO కూర్చున్న టేబుల్ డ్రాయర్ నుండి రూ. 80 వేలు లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఈ విధంగా, AO తన అధికార హోదాను దుర్వినియోగం చేసి అక్రమ ప్రయోజనం పొందడం కోసం తన అధికార విధులను అనుచితంగా, నిజాయితీ లేకుండా నిర్వర్తించారని ఏఓను అదుపులోకి తీసుకుని, అరెస్టు చేసి, కరీంనగర్‌ కోర్టులో హాజరు పరుస్తామని ఏసిబి డిఎస్పీ తెలిపారు.

Thursday, 4 June 2026

విద్యార్థుల భద్రతకు పాఠశాల బస్సుల ఫిట్‌నెస్, డ్రైవర్ల శిక్షణ అత్యంత కీలకం – డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్




విద్యార్థుల భద్రతకు పాఠశాల బస్సుల ఫిట్‌నెస్, డ్రైవర్ల శిక్షణ అత్యంత కీలకం– డిప్యూటీ 

విద్యార్థుల భద్రతకు పాఠశాల బస్సుల ఫిట్‌నెస్, డ్రైవర్ల శిక్షణ అత్యంత కీలకం– డిప్యూటీ 

విద్యార్థుల సురక్షిత రవాణా ప్రతి పాఠశాల యాజమాన్యం, వాహన యజమాని మరియు డ్రైవర్ యొక్క సామాజిక బాధ్యత అని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ తెలిపారు. పాఠశాల బస్సుల ఫిట్‌నెస్, భద్రతా ప్రమాణాల అమలు మరియు డ్రైవర్లకు తగిన శిక్షణ కల్పించడం ద్వారా మాత్రమే విద్యార్థుల ప్రాణ భద్రతను సమర్థవంతంగా కాపాడగలమని పేర్కొన్నారు.


మోటారు వాహనాల చట్టం, 1988 లోని సెక్షన్ 56 ప్రకారం ప్రతి రవాణా వాహనం చెల్లుబాటు అయ్యే ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌ను కలిగి ఉండటం తప్పనిసరి. ఫిట్‌నెస్ లేని వాహనాలను రహదారులపై నడపడం చట్టవిరుద్ధం. అలాగే కేంద్ర మోటారు వాహనాల నియమాలు, 1989 మరియు పాఠశాల బస్సుల భద్రతకు సంబంధించిన నిబంధనలు ప్రకారం పాఠశాల బస్సులు నిర్దేశిత భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి.


పాఠశాల బస్సులలో అత్యవసర ద్వారం, అగ్నిమాపక పరికరం, ప్రథమ చికిత్స పెట్టె, స్పీడ్ గవర్నర్, జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ, సీసీ కెమెరాలు (ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు), తగిన సీటింగ్ సదుపాయం మరియు స్పష్టమైన గుర్తింపు బోర్డులు ఉండాలి. వాహనాల బ్రేకులు, టైర్లు, స్టీరింగ్ వ్యవస్థ మరియు ఇతర యాంత్రిక భాగాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి.


అదేవిధంగా, పాఠశాల బస్సులను నడిపే డ్రైవర్లు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు తగిన అనుభవం కలిగి ఉండాలి. రహదారి భద్రత, రక్షణాత్మక డ్రైవింగ్ (Defensive Driving), అత్యవసర పరిస్థితుల నిర్వహణ, విద్యార్థులతో సౌమ్యంగా వ్యవహరించడం, ట్రాఫిక్ నిబంధనల పాటింపు తదితర అంశాలపై వారికి నిరంతర శిక్షణ మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.


పాఠశాల యాజమాన్యాలు తమ వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు, బీమా పత్రాలు, డ్రైవర్ల లైసెన్సులు మరియు ఇతర చట్టబద్ధమైన పత్రాలను ఎప్పటికప్పుడు పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలి. విద్యార్థుల రవాణాలో భద్రత విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం సహించబడదని స్పష్టం చేశారు.


రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, నిబంధనలను ఉల్లంఘించే వాహన యజమానులు మరియు నిర్వాహకులపై మోటారు వాహనాల చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటుంది.


“పిల్లల భద్రతే ప్రథమ ప్రాధాన్యం – సురక్షిత పాఠశాల రవాణా అందరి బాధ్యత.”


జారీ చేసినవారు

డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్

రవాణా శాఖ

Tuesday, 2 June 2026

శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని మోడల్ గా తీర్చిదిద్దుతాం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

 శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని మోడల్ గా తీర్చిదిద్దుతాం 

 రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 


 దేవాలయం అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సిహెచ్ వెంకట్ రెడ్డి 

             నల్గొండ జిల్లా, కనగల్ మండలం, ధర్వేశిపురం లో వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని మోడల్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేవాలయ అభివృద్ధికి అన్ని రకాల సహాయ ,సహకారాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద కళ్యాణమండపము, వాటర్ ట్యాంకు కట్టించడం జరిగిందని, 50 కోట్ల రూపాయల కేంద్ర రహదారుల నిధులతో నల్గొండ నుండి ధర్వేశిపురం వరకు రహదారిని నిర్మించనున్నామని, టెండర్ పూర్తయిందని రేపటినుండి పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అలాగే ధర్వేశిపురం ప్రాంతంలో ఒక పెద్ద ఇండస్ట్రీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. 239 కోట్ల రూపాయలతో ధర్వేశిపురం మీదుగా గుర్రంపోడు- కొండమల్లేపల్లి- దేవరకొండ- డిండి వరకు హ్యాం రోడ్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

         మంగళవారం ఆయన ధర్వేశిపురం లోని శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

         ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం మంత్రి మాట్లాడుతూ ధర్వేశిపురం ను మోడల్ గా తీర్చిదిద్దడంలో భాగంగా త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిని ధర్వేశిపురానికి తీసుకురానట్లు తెలిపారు. ఎక్కడైనా రహదారులు బాగుంటేనే అన్ని సౌకర్యాలు ఉంటాయని చెప్పారు. రాష్ట్రంలో 1300 కోట్ల రూపాయలతో 480 రోడ్లను డబుల్ రోడ్లు చేసేందుకు టెండర్లు పూర్తి చేయడం జరిగిందని వెల్లడించారు. ధర్వేశిపురం, కనగల్ మండలం లో ఇండ్లులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. నల్గొండ జిల్లా అభివృద్ధిలో భాగంగా ఏఎమ్మార్పీ కాలువల లైనింగ్ చేపట్టడం జరిగిందని ,రానున్న 2 ఏళ్లలో ఎస్ఎల్ బిసీ సోరంగం పూర్తయితే రెండు పంటలు పండుతాయని చెప్పారు. నల్గొండ పట్టణ అభివృద్ధిలో భాగంగా 900 కోట్ల రూపాయలతో పట్టణం చుట్టూ రింగ్ రోడ్డును నిర్మిస్తున్నామని, నల్గొండ పట్టణంలో తాగునీటి ట్యాంకులతో పాటు, విద్యాభివృద్ధికి అనేక చర్యలు చేపట్టడం జరిగిందని, ఇందులో భాగంగానే బొట్టు గూడా ప్రభుత్వ పాఠశాలను అత్యంత అద్భుతంగా కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాలకు రోడ్లు, సిసి రోడ్లతో పాటు, డ్రైన్లు ఇవ్వనుందని ఇవన్నీ పూర్తయితే గ్రామాల రూపు రేఖలు మారుతాయని మంత్రి తెలిపారు.

            రేణుక ఎల్లమ్మ అమ్మవారి దేవాలయ నూతన ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన సిహెచ్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ధర్వేశిపురం ఎల్లమ్మ అమ్మవారి దేవాలయ అభివృద్ధికి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి ఆధ్వర్యంలో 10 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని, ఇదివరకే ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని, తక్కిన 5 కోట్లతో పనులు చేపడతామని ,రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారి దేవాలయాన్ని పూర్తిగా పునర్నిర్మించడం జరుగుతుందని, ధర్వేశిపురం లో అంగన్వాడీ కేంద్రాన్ని ,అలాగే పాఠశాలకు వెళ్లే రహదారిని మంజూరు చేయాలని మంత్రితో విజ్ఞప్తి చేశారు.

           ఈ సందర్భంగా రేణుక ఎల్లమ్మ అమ్మవారి కి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు, దేవాదాయశాఖ అధికారులు మంత్రికి పూర్ణకుంభం, మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు.

              నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి ,డిఎస్పి శివరాం రెడ్డి, ఎండోమెంట్ అధికారులు, కనగల్ తహసిల్దార్ పద్మ, రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఈవో తదితరులు మంత్రి వెంట ఉన్నారు.

       కాగా ధర్మకర్తల మండలి సభ్యులు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.