శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని మోడల్ గా తీర్చిదిద్దుతాం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని మోడల్ గా తీర్చిదిద్దుతాం
రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
దేవాలయం అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సిహెచ్ వెంకట్ రెడ్డి
నల్గొండ జిల్లా, కనగల్ మండలం, ధర్వేశిపురం లో వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని మోడల్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేవాలయ అభివృద్ధికి అన్ని రకాల సహాయ ,సహకారాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద కళ్యాణమండపము, వాటర్ ట్యాంకు కట్టించడం జరిగిందని, 50 కోట్ల రూపాయల కేంద్ర రహదారుల నిధులతో నల్గొండ నుండి ధర్వేశిపురం వరకు రహదారిని నిర్మించనున్నామని, టెండర్ పూర్తయిందని రేపటినుండి పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అలాగే ధర్వేశిపురం ప్రాంతంలో ఒక పెద్ద ఇండస్ట్రీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. 239 కోట్ల రూపాయలతో ధర్వేశిపురం మీదుగా గుర్రంపోడు- కొండమల్లేపల్లి- దేవరకొండ- డిండి వరకు హ్యాం రోడ్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
మంగళవారం ఆయన ధర్వేశిపురం లోని శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం మంత్రి మాట్లాడుతూ ధర్వేశిపురం ను మోడల్ గా తీర్చిదిద్దడంలో భాగంగా త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిని ధర్వేశిపురానికి తీసుకురానట్లు తెలిపారు. ఎక్కడైనా రహదారులు బాగుంటేనే అన్ని సౌకర్యాలు ఉంటాయని చెప్పారు. రాష్ట్రంలో 1300 కోట్ల రూపాయలతో 480 రోడ్లను డబుల్ రోడ్లు చేసేందుకు టెండర్లు పూర్తి చేయడం జరిగిందని వెల్లడించారు. ధర్వేశిపురం, కనగల్ మండలం లో ఇండ్లులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. నల్గొండ జిల్లా అభివృద్ధిలో భాగంగా ఏఎమ్మార్పీ కాలువల లైనింగ్ చేపట్టడం జరిగిందని ,రానున్న 2 ఏళ్లలో ఎస్ఎల్ బిసీ సోరంగం పూర్తయితే రెండు పంటలు పండుతాయని చెప్పారు. నల్గొండ పట్టణ అభివృద్ధిలో భాగంగా 900 కోట్ల రూపాయలతో పట్టణం చుట్టూ రింగ్ రోడ్డును నిర్మిస్తున్నామని, నల్గొండ పట్టణంలో తాగునీటి ట్యాంకులతో పాటు, విద్యాభివృద్ధికి అనేక చర్యలు చేపట్టడం జరిగిందని, ఇందులో భాగంగానే బొట్టు గూడా ప్రభుత్వ పాఠశాలను అత్యంత అద్భుతంగా కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాలకు రోడ్లు, సిసి రోడ్లతో పాటు, డ్రైన్లు ఇవ్వనుందని ఇవన్నీ పూర్తయితే గ్రామాల రూపు రేఖలు మారుతాయని మంత్రి తెలిపారు.
రేణుక ఎల్లమ్మ అమ్మవారి దేవాలయ నూతన ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన సిహెచ్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ధర్వేశిపురం ఎల్లమ్మ అమ్మవారి దేవాలయ అభివృద్ధికి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి ఆధ్వర్యంలో 10 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని, ఇదివరకే ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని, తక్కిన 5 కోట్లతో పనులు చేపడతామని ,రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారి దేవాలయాన్ని పూర్తిగా పునర్నిర్మించడం జరుగుతుందని, ధర్వేశిపురం లో అంగన్వాడీ కేంద్రాన్ని ,అలాగే పాఠశాలకు వెళ్లే రహదారిని మంజూరు చేయాలని మంత్రితో విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా రేణుక ఎల్లమ్మ అమ్మవారి కి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు, దేవాదాయశాఖ అధికారులు మంత్రికి పూర్ణకుంభం, మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు.
నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి ,డిఎస్పి శివరాం రెడ్డి, ఎండోమెంట్ అధికారులు, కనగల్ తహసిల్దార్ పద్మ, రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఈవో తదితరులు మంత్రి వెంట ఉన్నారు.
కాగా ధర్మకర్తల మండలి సభ్యులు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home