వైశ్య వ్యాపార శక్తికి ప్రతీకగా వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్
వైశ్య వ్యాపార శక్తికి ప్రతీకగా వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్
విజయవంతంగా ముగించిన వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026
పాల్గొన్న వివిధ రాష్ట్రాల 250 మంది పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు
వ్యాపారాభివృద్ధి, నెట్‌వర్కింగ్, పరస్పర సహకారానికి కొత్త దిశ
హైదరాబాద్, జూన్ 28 (): దేశవ్యాప్తంగా ఉన్న వైశ్య వ్యాపారవేత్తలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, వ్యాపార సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు నూతన అవకాశాలకు మార్గం సుగమం చేయాలనే లక్ష్యంతో నిర్వహించిన వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించి విజయవంతంగా ముగించారు. మాదాపూర్‌లోని హోటల్ ఆవాసలో జరిగిన ఈ జాతీయ స్థాయి వ్యాపార సదస్సుకు వివిధ రాష్ట్రాలు, నగరాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, వ్యాపారవేత్తలు, యువ ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమానికి విశేష ఆదరణ కల్పించారు.గ్లోబల్ ప్రెసిడెంట్ మహేంద్ర చీమకుర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కాంక్లేవ్‌ను తెలంగాణ ఎక్స్‌పాన్షన్స్ లీడ్ డాక్టర్.నిషాంక్ కండె, హైదరాబాద్ వీ వైశ్య కౌండిన్య గ్రూప్ అధ్యక్షుడు శ్రీకాంత్ సమన్వయం చేశారు. వ్యాపార రంగంలో నెలకొన్న సవాళ్లు, అభివృద్ధి అవకాశాలు, పెట్టుబడుల విస్తరణ, భాగస్వామ్యాల పెంపు, మార్కెట్ ధోరణులు వంటి అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విజయవంతంగా రాణిస్తున్న వ్యాపారవేత్తలు తమ అనుభవాలను పంచుకుంటూ భవిష్యత్ వ్యాపార వ్యూహాలపై విలువైన సూచనలు అందించారు.
‘నేను’ నుంచి ‘మనం’ వైపు…
“Stop Thinking I… Start Thinking We” అనే నినాదంతో ముందుకు సాగుతున్న వీ వైశ్య గ్లోబల్ సంస్థ, సమిష్టి కృషి ద్వారానే స్థిరమైన విజయాలు సాధ్యమనే సందేశాన్ని కాంక్లేవ్ ద్వారా ప్రతిధ్వనింపజేసింది. పరస్పర సహకారం, విశ్వాసం, నెట్‌వర్కింగ్ ద్వారా వ్యాపారాలను మరింత విస్తరించుకోవచ్చని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి హాజరైన ప్రతినిధులు పరస్పర పరిచయాలు పెంపొందించుకొని భవిష్యత్ భాగస్వామ్యాలకు బాటలు వేశారు.
వ్యాపార భవిష్యత్తుపై ఏఐ మార్గనిర్దేశం
ప్రస్తుత డిజిటల్ యుగంలో కృత్రిమ మేధ (ఏఐ) వ్యాపార రంగాన్ని ఎలా ప్రభావితం చేస్తోందనే అంశంపై ప్రత్యేక సెషన్ నిర్వహించారు. ప్రముఖ ఏఐ ట్రైనర్ రఘువీర్ మాట్లాడుతూ, వ్యాపారాభివృద్ధిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం, డిజిటల్ మార్కెటింగ్, కస్టమర్ రిలేషన్ మేనేజ్‌మెంట్, ఆటోమేషన్, డేటా ఆధారిత నిర్ణయాల ప్రాముఖ్యతపై సమగ్రంగా వివరించారు. భవిష్యత్ వ్యాపార పోటీలో నిలదొక్కుకోవాలంటే ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకోవడం అనివార్యమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు ఏఐ సాధనాలను వినియోగించడం ద్వారా తమ ఉత్పాదకతను, లాభదాయకతను పెంచుకోవచ్చని సూచించారు. ఆయన ప్రదర్శన ప్రతినిధులను విశేషంగా ఆకట్టుకుంది.
ఆరోగ్యంపైనా ప్రత్యేక దృష్టి
వ్యాపారాభివృద్ధితో పాటు ఆరోగ్య పరిరక్షణ కూడా అంతే ముఖ్యమనే ఉద్దేశంతో నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సు ఆకట్టుకుంది. ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ సోమనాథ్ గుప్తా మాట్లాడుతూ, వ్యాపారవేత్తలు ఆర్థికాభివృద్ధితో పాటు శారీరక, మానసిక ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. క్రమబద్ధమైన జీవనశైలి, సమతుల్య ఆహారం, సమయపాలన విజయవంతమైన జీవితానికి పునాదులని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎక్స్‌పాన్షన్స్ లీడ్ సోలార్ వాలా రాజేష్, హైదరాబాద్ కౌండిన్య గ్రూప్ కార్యదర్శి ప్రశాంత్ కుమార్, గ్లోబల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ సంతోష్ శెట్టి, పాస్ట్ గ్లోబల్ ప్రెసిడెంట్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 250 మందికి పైగా ప్రతినిధులు, దుబాయ్ కి చెందిన ప్రవాస భారతీయులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వైశ్య వ్యాపారవేత్తల మధ్య బలమైన అనుసంధానం, కొత్త అవకాశాల సృష్టి, పరస్పర సహకారానికి ఈ కాంక్లేవ్ ఒక మైలురాయిగా నిలిచిందని నిర్వాహకులు పేర్కొన్నారు.భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలిచే సమగ్ర వ్యాపార నెట్‌వర్క్ నిర్మాణమే తమ లక్ష్యమని, దేశవ్యాప్తంగా మరింత మంది వ్యాపారవేత్తలను ఈ వేదిక ద్వారా అనుసంధానించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.





0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home