నకిలీ పత్రాలతో స్థలం కబ్జా కేసులో సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ అరెస్ట్
: కుత్బుల్లాపూర్ పరిధిలో ఓ స్థలం కబ్జా కేసులో సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని పోలీసులు అరెస్టు చేశారు. స్థల యజమాని మృతి చెందినట్లు నకిలీ పత్రాలు సృష్టించి 200 గజాల స్థలాన్ని కొట్టేశారు.
నకిలీ పత్రాలతో స్థలం కబ్జా కేసులో సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ అరెస్ట్
నకిలీ డాక్యుమెంట్స్ తో రిజిస్ట్రేషన్ కేసులో సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది. కుత్బుల్లాపూర్ పరిధిలోని సుభాష్‌నగర్‌లో 200 గజాల స్థలాన్ని ఫేక్ డాక్యుమెంట్స్ లో పద్మజారెడ్డి అనే మహిళ కబ్జా చేసింది. గతంలో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్‌గా పని చేసిన జ్యోతి... ఈ ఫేక్ డాక్యుమెంట్స్ తో స్థలాన్ని పద్మజారెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ జ్యోతి సహకరించారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పద్మజారెడ్డితో పాటు సబ్ రిజిస్ట్రార్ జ్యోతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భూకబ్జా కేసులో ఇటీవల పద్మజారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆమెకు రిమాండ్‌కు విధించారు. తాజాగా ఈ కేసులో...ప్రస్తుతం సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న జ్యోతిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బీఆర్ఎస్ మహిళా నేత కీలక సూత్రధారి
కుత్బుల్లాపూర్ పరిధిలోని సుభాష్ నగర్ లోని ఓ ఖాళీ స్థలాన్ని కొట్టేయాలని ప్లాన్ వేసిన కొందరు, ఆ స్థలం యజమాని మరణించినట్లు ఫేక్ సర్టిఫికెట్ సృష్టించారు. అప్పుడు కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ పనిచేస్తు్న్న జ్యోతి సాయంతో రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. ఉప్పుగూడ హనుమాన్‌నగర్‌కు చెందిన లెండ్యాల సురేష్ కు సుభాష్‌నగర్ ప్రాంతంలో 200 గజాల ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలంపై సుభాష్‌నగర్‌కు చెందిన బీఆర్ఎస్ మహిళా నేత పద్మజారెడ్డి కన్నుపడింది. ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు హయత్‌నగర్‌కు చెందిన కరుణాకర్ ను సంప్రదించి, అతడికి రూ.3.50 లక్షలు చెల్లించి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారు. ఈ స్థలం యజమాని 1992లోనే మృతి చెందినట్లు డెత్ సర్టిఫికెట్ సృష్టించారు.
రవిశంకర్ అనే వ్యక్తిని లెండ్యాల సురేష్ కు కుమారుడిగా సృష్టించారు. ఆధార్ కేంద్రం ఆపరేటర్‌గా నరేంద్ర సాయంతో హరీశ్ అనే వ్యక్తిని రవిశంకర్‌గా చూపించి ఫేక్ పాన్‌కార్డు తయారు చేశారు. ఈ పాన్ కార్డు సాయంతో ఆధార్‌లో మార్పులు చేశారు. 2023 ఫిబ్రవరిలో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతి సాయంతో...బీఆర్ఎస్ నేత పద్మజారెడ్డి సోదరికి ఈ స్థలాన్ని రవిశంకర్ అమ్మినట్లు రిజిస్ట్రేషన్ చేయించారు. తన స్థలం కబ్జా చేశారని యజమాని లెండ్యాల సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తులో అసలు విషయం వెలుగుచూసింది. నకిలీపత్రాలు, ల్యాప్‌టాప్‌లు, స్కానర్ ఇతర పరికరాలను సీజ్ చేశారు.
సబ్ రిజిస్ట్రార్ అరెస్టు
ఈ వ్యవహారంలో కీలక సూత్రధారి అయిన బీఆర్ఎస్ మహిళా నేత పద్మజారెడ్డి సహా మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తులో సబ్ రిజిస్ట్రార్ జ్యోతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు మంగళవారం సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని అరెస్టు చేసి మేడ్చల్ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది.
No comments:
Post a Comment