Wednesday, 16 October 2024

తెలంగాణ కేబినెట్ విస్తరణ.. కౌన్ బనేగా మినిస్టర్.. రేసులో ఉన్నది వీరేనా..?

తెలంగాణ కేబినెట్ విస్తరణ.. కౌన్ బనేగా మినిస్టర్.. రేసులో ఉన్నది వీరేనా..?

తెలంగాణ కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెట్టింది. నెలాఖరులోపే ఈ ప్రక్రియ పూర్తి కానున్న నేపథ్యంలో ఆశావహులు లాబీయింగ్ మొదలు పెట్టారు. తమ సీనియారిటీ, సిన్సియారిటీ పరిగణించాలంటూ హైకమాండ్‌కి సంకేతాలు పంపుతున్నారు.

గత డిసెంబరులో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ త్వరాత మంత్రి వర్గ విస్తరణ త్వరలో జరుగుతుందని గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ జమ్మ కశ్మీర్, హర్యానా ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలు ఎన్నికల బిజీలో ఉండిపోయారు. దాంతో వారు రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణను పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆ రాష్ట్రాల ఎన్నికలు పూర్తవడంతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌, శ్రీధర్ బాబు టీపీసీసీ చీఫ్‌ మహేష్ గౌడ్ సహా ముఖ్య నేతలు కూడా ఢిల్లీ వెళుతుండటంతో కేబినెట్ విస్తరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. CWC సమావేశంలో పాల్గొననున్న రేవంత్‌రెడ్డి.. కేబినెట్ విస్తరణపై హైకమాండ్‌తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరో నలుగురికి కేబినెట్‌లో అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోందని ఈసారి విస్తరణలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం ఊపందుకుంది. దీంతో కేబినెట్ విస్తరణపై ఆశావహుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. తాజాగా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలతో కేబినెట్ విస్తరణ ఇక ఎంతో దూరంలో లేదన్నది స్పష్టమైంది.



కేబినెట్ విస్తరణపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలతో ఆశావహులు అలర్టయ్యారు. మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు ప్రచారం జరుగుతుండడంతో వారి ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి సీనియర్ నాయకుడు ప్రేమ్‌ సాగర్ రావుతో పాటు, వివేక్‌, వినోద్‌ సోదరులు రేసులో ఉన్నారు. దీంతో ముందే వారికి చెక్‌ పెట్టేందుకు సీనియర్‌ కాంగ్రెస్ నేతగా మంత్రి పదవి ఆశిస్తున్నానని మీడియా ముందు కుండబద్దలు కొట్టారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌ రావు. అయితే మంత్రి పదవి ఎవరికివ్వాలనేది అధిష్ఠానం చూసుకుంటుందని హైకమాండ్‌పై తన విధేయతను కూడా తెలియజేశారు.


ఇటు ప్రేమ్‌ సాగర్ రావుకి కౌంటర్‌గా వివేక్‌, వినోద్ సోదరులు ఢిల్లీ స్థాయిలో మంత్రి పదవి కోసం ఎవరికి వారు లాబీయింగ్ చేస్తున్నారు. ఇప్పటికే వివేక్‌ తనయుడికి పెద్దపల్లి ఎంపీగా అవకాశం రావడంతో కాకా ఫ్యామిలీ కోటాలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని వినోద్ నేరుగా సోనియాగాంధీ స్థాయిలోనే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తనని కాకా ఫ్యామిలీ కోటాలో పరిగణించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల కాకా వెంకటస్వామి జయంతి వేడుకలో చెప్పటం.. అయితే మంత్రి వర్గ విస్తరణలో కాకా ఫ్యామిలీ కోటా అయిపోయిందని సీఎం రేవంత్‌ చమత్కరించడం జరిగింది.



ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుంచి గెలిచిన సీనియర్‌ నాయకుల్లో మాజీ మంత్రి ప్రస్తుత బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మంత్రి వర్గవిస్తరణలో ముందు వరుసలో ఉన్నారు. ఈ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలలో సుదర్శన్ రెడ్డి సీనియర్ కావడంతో పాటు వై.యస్‌ హయాంలోనే మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటంతో ఆయనకు పోటీ పెద్దగా లేకపోవడం కలిసి వస్తోంది. మొత్తానికి ఈ సారి కేబినెట్ విస్తరణ జరుగుతుందని బలమైన సంకేతాలు వస్తున్న నేపథ్యంలో అమాత్య యోగం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.

No comments:

Post a Comment