అల్పపీడనంతో రాష్ట్రానికి పొంచివున్న ముప్పు!
: తెలంగాణ వ్యాప్తంగా కొద్దిరోజుల నుంచి విభిన్నమైన వాతావరణం నెలకొంది. ఓ వైపు ఎండలు మండిస్తుండగా మరోవైపు వర్షాలు దంచికొడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు రాకముందే తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. రెండువారాలుగా రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో జల్లులు పడుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెడ్ అలర్ట్ జారీచేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. భానుడి భగభగలు ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లోని పలుచోట్ల వర్షాలు కురుస్తాయి. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో మోస్తరు వానలు కురవనున్నాయి. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్డ్ జారీ చేశారు. ఓవైపు ఇలా వర్షానికి సంబంధించి హెచ్చరికలు జారీ అవుతుంటే మరోవైపు కొన్ని ప్రాంతాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉత్తర తెలంగాణలో ఎండల తీవ్రత అధికంగా ఉంది.
నేరెళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత శుక్రవారం రోజు రాష్ట్రం మొత్తంమీద అత్యధికంగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కామారెడ్డి, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. నేడు, రేపు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఎండల తీవ్రతకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వైద్యులు చెబుతున్న సలహాలు, సూచనలు పాటించాలంటున్నారు. అత్యవసరమైన పనివుంటేనే బయటకు వెళ్లాలని, ఉదయం 11.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల్లోపు బయటకు రావొద్దని, అత్యవసరమైతే గొడుగు వాడాలని, దాహం వేయకపోయినా తరుచుగా మంచినీరు తాగుతుండాలని సూచిస్తున్నారు.
No comments:
Post a Comment