సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కపిల్ సిబల్ ఎన్నిక.
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) కొత్త అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ (Kapil Sibal) ఎన్నికయ్యారు. గురువారం సాయంత్రం వరకు జరిగిన ఎన్నికల్లో సిబల్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 1066 ఓట్లు వచ్చాయి. సమీప అభ్యర్థి సీనియర్ న్యాయవాది ప్రదీప్ రాయ్‌కు 689 ఓట్లు రావడంతో సిబల్ విజయం సాధించారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి సిబల్ ఎన్నిక కావడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. చివరగా 2001-02లో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేవారు సిబల్. అంతకుముందు 1995-96, 1997-98లోనూ ఈ పదవికి ఆయన ఎన్నికయ్యారు. ఈ ఏడాది బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవి కోసం మొత్తం ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు.
కపిల్ సిబల్(1,066), ప్రదీప్ కుమార్ రాయ్(689) తోపాటు ఆదిష్ అగర్వాలా, ప్రియా హింగోరాణి, నీరజ్ శ్రీవాస్తవ, త్రిపురారి రే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్ష బరిలో పోటీ పడ్డారు. అత్యధికంగా ఓట్లు రావడంతో కపిల్ సిబల్ ఎస్‌సీబీఏ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం కపిల్ సిబల్ మాట్లాడుతూ.. లాయర్లు అంటే చట్టబద్ధమైన పాలనను నిలబెట్టడం. న్యాయవాది ఉద్దేశ్యం రాజ్యాంగాన్ని పరిరక్షించడం అని వ్యాఖ్యానించారు. అందుకే, మీరు రాజకీయాల ఆధారంగా బార్‌ను విభజించినట్లయితే, వాస్తవానికి మీరు న్యాయవాదిగా మీ కర్తవ్యాన్ని నెరవేర్చలేరన్నారు. ఒక వ్యక్తిగత రాజకీయ తత్వశాస్త్రం మీకు ఉండవచ్చు, కానీ న్యాయవాదిగా మీ విధికి ఒక రాజకీయ పార్టీతో సంబంధం ఉండదన్నారు. కానీ తాము ఎప్పుడూ కోర్టులో దాని కారణాన్ని సమర్థించలేదని వ్యాఖ్యానించారు.
No comments:
Post a Comment