తెలంగాణ సీఐడీ ఎస్పీపై కేసు నమోదు - లైంగికంగా వేధించారని మహిళా ఉద్యోగి ఫిర్యాదు!
Case on CID SP: మహిళను వేధిస్తున్న కేసులో తెలంగాణ సీఐడీ ఎస్పీపై చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.
: తెలంగాణలో ఓ ఐపీఎస్ అధికారిపై వేధింపుల కేసు నమోదైంది. టీఎస్ఎస్పీడీసీఎల్ లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ అయిన మహిళా అధికారిని సీఐడీ ఎస్పీ వేధింపులకు గురిచేశారని ఆమె ఫిర్యాదు చేశారు. తనకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపారని బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.
మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. రోజూ ఉదయం మార్నింగ్ వాక్ కు వెళ్తుండగా.. ఆ ఎస్పీ తనను వేధించడం మొదలు పెట్టినట్లు మహిళ ఆరోపించారు. పోలీసు అయి ఉండి తనను వేధింపులకు గురి చేస్తున్నాడని మహిళ చైతన్య పురి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
అసలేం జరిగిందంటే..?
మహిళ ఫిర్యాదు మేరకు.. ఎల్బీ నగర్ పరిధిలో ఉంటున్న సీఐడీ ఎస్పీకి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో మార్నింగ్ వాకింగ్ చేస్తున్న సమయంలో విద్యుత్ శాఖకు చెందిన మహిళా ఉద్యోగినితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న ఆయన లైంగికంగా వేధించడం మొదలు పెట్టారని మహిళ చెబుతోంది. తనతో చనువుగా ఉండాలని మెసేజ్ లు పెట్టేవారని.. మానసికంగా చాలా వేధింపులకు గురి చేశారని చెబుతోంది. ఇది పద్ధతి కాదని తాను ఎన్నిసార్లు చెప్పినా అతడు వినకపోవడంతో.. షీ టీమ్స్ ను ఆశ్రయించినట్లు తెలిపింది. వారి సూచన మేరకు చైతన్యపురి పీఎస్ లో శనివారం ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే సీఐడీ ఎస్పీపై కేసు ఫైల్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
No comments:
Post a Comment