హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలతో పాటు ప్రభుత్వ భూములను కాపాడటమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను ఆక్రమించుకుని చాలా మంది లేఅవుట్లుగా చేసి ప్లాట్లను అమ్ముకుంటూ సొమ్ము చేసుకున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలోనే.. హైదరాబాద్ శివార్లలోని చాలా గ్రామపంచాయతీల్లో అలాంటి ప్లాట్లు కొనుక్కుని సామాన్య జనం ఇందులో ఇండ్లు కట్టుకోగా.. వాటిని హైడ్రా బుల్డోజర్లు కూల్చేశాయి కూడా. ఈ క్రమంలోనే.. హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామపంచాయతీల్లో అనధికార లేఅవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం నిషేధం విధించిందంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై హెచ్ఎండీఏ అధికారులు కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ ఎవరూ స్పందించకపోవటంతో.. నిషేధం నిజమేనని భావించి మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఆ వార్తలను ప్రచురితం చేసింది.
అయితే.. ఆ వార్తలు ప్రచురితమై.. సోషల్ మీడియా గ్రూపుల్లో చక్కర్లు కొట్టిన చాలా రోజుల తర్వాత.. ఎట్టకేలకు హెచ్ఎండీఏ అధికారులు స్పందించారు. హెచ్ఎండీఎ పరిధిలోని గ్రామ పంచాయతీల్లో అనధికార లేఅవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై నిషేధం వార్తలపై క్లారిటీ ఇస్తూ.. అధికారిక ప్రకటన విడుదల చేసింది.
"హెచ్‌ఎండీఏ పరిధిలోని గ్రామపంచాయతీల్లో అనధికార లేఅవుట్లలో ప్లాట్‌ల రిజిస్ట్రేషన్‌ను నిషేధించినట్లు కొన్ని మీడియా ఛానెళ్లలో వార్తలు రావటం గమనించాం. ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం. దీనికి సంబంధించి గత సంవత్సరకాలంగా, హెచ్‌ఎండీఏ నుంటి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖకు ఎలాంటి అభ్యర్థనను పంపలేదు. గ్రామ పంచాయతీల్లో అనధికారిక లేఅవుట్‌ల ప్లాట్‌ల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని స్పష్టంగా తెలియపరుస్తున్నాం. ఈ వార్తలు పూర్తిగా నిరాధారమైనవే కాదు అవాస్తవాలు కూడా. ఇలాంటి నిరాధారమైన, సత్యదూరమైన పుకార్లను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మీడియా సంస్థలు దీనిని గమనించాల్సిందిగా కోరుతున్నాం." అంటూ హెచ్ఎండీఏ అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న గ్రామ పంచాయతీల్లో ఆక్రమిత లేఅవుట్ల రిజిస్ట్రేషన్లపై నిషేధం విధిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిందని.. అన్ని ఆక్రమిత గ్రామ పంచాయతీ లేఅవుట్‌లను నిషేధిత జాబితాలోకి చేర్చిందని.. ఆయా ప్రాంతాల్లోని రిజిస్ట్రేషన్లను నిలిపివేసిందని. ఈమేరకు సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు కూడా జారీ చేసిందంటూ సోషల్ మీడియాలో అక్టోబర్‌లో జోరుగా ప్రచారం జరిగింది. ప్రణాళిక లేని వృద్ధిని నిరోధించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్టు ప్రభుత్వం చెప్తోందని.. చాలా గ్రామ పంచాయతీ లేఅవుట్లలో రోడ్లు ఇరుకుంగా ఉండటంతో పాటు.. సెట్ బ్యాక్‌లు లేకుండా, డ్రైనేజీలు లేకుండా ఉన్నందున.. ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే.. ఇదంతా అవాస్తమని హెచ్ఎండీఏ స్పష్టం చేసింది.
No comments:
Post a Comment