Tuesday, 5 November 2024

నేటి నుండి నిర్వహించనున్న సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధం- జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

 నేటి నుండి నిర్వహించనున్న సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధం- జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి 



            రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు.


       జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల కుటుంబాల వివరాల సేకరణకు గాను ఎన్యుమరేటర్లను, సూపర్వైజర్లను నియమించడమే కాకుండా ,వారికి శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేశామని ఆమె వెల్లడించారు.

     జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే కు  3964 ఎన్యుమరేషన్ బ్లాకులు ఏర్పాటు చేయడం జరిగిందని, 3483 మంది ఎన్యుమరేటర్లను నియమించామని, అంతేకాక 349 మందిని రిజర్వులో ఉంచామని, మొత్తం 3832 మంది ఎన్యుమరేటర్లు ఈ సర్వేలో పాల్గొననున్నారని ఆమె తెలిపారు. కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు 349 మంది సూపర్వైజర్ లను, రిజర్వులో మరో 37 మందిని మొత్తం 386 మంది సూపర్వైజర్లను  నియమించామని, గడిచిన రెండు రోజుల్లో అన్ని  మున్సిపాలిటీలు, మండల కేంద్రాలలో సూపర్వైజర్లకు, ఎన్యుమరేటర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆమె వెల్లడించారు.


      సమగ్ర కుటుంబ సర్వే కు ఎన్యుమరేటర్లు ఇండ్లకు వచ్చినప్పుడు జిల్లాలోని ప్రజలందరూ

పూర్తి సహకారం అందించాలని, ఇందుకు ప్రజలు ఇంటి వద్ద అందుబాటులో ఉండి ఎన్యుమరేటర్లకు వివరాలను తెలియజేయాలని కోరారు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను మేరకు ప్రశ్నావళిని రూపొందించడం జరిగిందని, వారు అడిగే సమాచారాన్ని ఎలాంటి తప్పులు లేకుండా సరైన సమాచారం ఇచ్చి సహకరించాల్సిందిగా ఆమె కోరారు. ఎన్యుమరేటర్లు ఇండ్లకు వచ్చినప్పుడు ఇల్లు తాళం ఉన్నట్లయితే మరోసారి ఎన్యుమరేటర్లు  తిరిగి ఆ ఇంటిని సందర్శించడం జరుగుతుందని, అందువల్ల  ప్రజలు ఎలాంటి అపోహ చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న సామాజిక ,ఆర్థిక, రాజకీయ, విద్య ,ఉపాధి మరియు కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కేవలం సమాచార సేకరణకు సంబంధించింది మాత్రమేనని, ఎలాంటి జనగణన, కుల గణన కాదని ఆమె స్పష్టం చేశారు.

_____________________________

 జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

No comments:

Post a Comment