శ్రీ కన్యకా పరమేశ్వరి దేవికి వివాహం అయినదా,,? కాలేదు కదా!
అయితే మనం తమిళనాడులో కానీ.. కర్ణాటకలో కానీ..
ఆంధ్రదేశంలో
కానీ... అనేక వాసవి దేవాలయాలు చూస్తే
కొన్ని కొన్ని చోట్ల
వాసవీమాత మెడలో మంగళ సూత్రాలు కనిపించటం చూస్తుంటాం...!
వీరముష్టులు,మైలార్లు , గంగకావిళ్ళ వారూ... అక్కడక్కడా
పీఠాలను తీసుకు వచ్చే పీఠాలవారూ..
వాసవి దేవికి ఒడిబాలు బియ్యం
పోయిస్తూ వుండటాన్ని మనం చిన్న తనం నుంచి చూస్తున్నాం కదా..!
అంతే కాకుండా అనేక కన్యకా పరమేశ్వరి దేవాలయాలలో
వాసవికి ప్రక్కనే నగరేశ్వర స్వామిని వుంచి పూజించడం కూడామనకు కనిపిస్తూనే వున్నది....
యధార్ధాన్ని తెలుసుకునే ముందుగా ఇదంతా పూర్తి వరకు చదవాలని ఆర్యవైశ్య సోదర సోదరీమణులను కోరుకుంటున్నాం.....
ప్రస్తుతం కన్యకాపరమేశ్వరి అమ్మవారి గురించి 350కి .పైగా
అనేక మంది కవులద్వారా తెలుగులో గ్రంథాలు రచించబడి వున్నాయి. వాటిలో కొన్ని
గ్రంథాలలో వాసవికి వివాహం అయినట్లుగానే మనకు తెలుస్తుంది....
పిఠాపురం శ్రీపాద వల్లభ చరితామృతం లో వ్రాసిన
శ్రీ గురు చరిత్ర పారాయణ గ్రంథంలో కూడా వాసవిదేవిని నగరేశ్వర స్వామికిచ్చి వివాహం చేసినట్లుగా వున్నది కదా..!
1978 కన్నడంలో తీసిన
శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి మహత్యం
బ్లాక్ అండ్ వైట్
సినిమాలో కూడా వాసవి దేవిఅగ్నిగుండ ప్రవేశ సమయంలో
నగరేశ్వరునకిచ్చి వాసవికి వివాహం చేసినట్లుగానే చూపించారు...
మొన్న ఈ మధ్య కాలంలో
ఆర్యవైశ్య కులగురువునని చెప్పుకునే ముక్కామల స్వామిజీ కూడా,
వాసవీ నగరేశ్వరుల కళ్యాణం చేస్తున్నానని చెప్పి అనేక విమర్శలకు
లోనయిన విషయం మనందరికీ తెలిసిందే కదా..!
ఈనాటికీ పెనుగొండలోని
7 అంతస్థుల గాలి గోపురంలో
కనిపించే వాసవి చరిత్ర చిత్రాలలో కూడా...
వాసవి దేవిని నగరేశ్వరస్వామి తన వామాంకముపైన కూర్చుండ బెట్టుకొని కైలాసానికి తీసుకుని వెళ్తునట్లుగా చిత్రీకరించివున్నది...
1958 లో శ్రీనగశ్వర
కన్యకాపరమేశ్వరి దేవస్థానం పెనుగొండక్షేత్రం వారు రచించిన
వాసవీ చరిత్ర బృహత్ గ్రంధంలో వాసవి దేవికి వివాహం అయినట్లుగానే రచించారు..
వీటన్నిటి ఆధారాలను గమనిస్తే వాసవి దేవికి వివాహం
అయినదా! కాలేదా?
అనే సంశయాలతో వున్న ఆర్యవైశ్య ప్రస్తుత
కాలానికి ఒక యదార్థమైన సందేశాన్ని ఆర్యవైశ్య సంస్థల వారు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా వుందని భావిస్తున్నాం...
పూర్వం రచించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ జీవిత చరిత్ర గ్రంధంలో వున్న
శ్రీ వాసవి నగరేశ్వర కళ్యాణం కథను మీకిప్పుడు యథాతధంగా వివరిస్తున్నాము,
ఆ రోజు మాఘ శుద్ధ విదియ 103 గుండములలో
అగ్నిజ్వాలలు జాజ్వల్యమానంగా ఆకాశమునకు జ్వలించుచున్నవి.
మరి కొన్ని నిమిషాలలో ..
102 గోత్ర వైశ్యులు అగ్ని ప్రవేశము చేయుటకు సిద్ధంగా
వున్నారు .
ఆ సమయములో 102 గోత్ర ఆర్యవైశ్యులందరూ వాసవితో..
"అమ్మా వాసవి ఇక్కడ
అగ్నిగుండ ప్రవేశం చేసే మేమంతా దంపతీసమేతంగా సిద్ధమైనాము, నీవు మాత్రమే ఒంటరిగా ఎలాదూకుతావు?"
అని ప్రశ్నించారు.
అప్పుడు వాసవి దేవీ
"ఓ బంధువులారా!
నేను పార్వతీ స్వరూపిణిని
నా అగ్ని ప్రవేశ నిర్ణయము
నా నాధుడైన
ఈశ్వరుని సంకల్పంతో
ఏనాడో జరిగిపోయింది...
వాసవినైన నన్ను
ఆ పరమేశ్వరుడే
వివాహం చేసుకోగలడు,
నేను కూడా మీతో పాటే
పతీపత్ని సమేతముగా అగ్నిప్రవేశం చేయగలము" అన్నది.
అదే సమయంలో భాస్కరాచార్యులవారు అక్కడికి వచ్చి,
"అమ్మా వాసవి అగ్నిగుండ ప్రవేశానికి సమయం సిద్ధమయింది.
రామ్మా వాసవీ .!" అన్నారు,
అప్పుడు వాసవీదేవి
"గురువర్యా! ముందుగా అగ్నిలో ఎవరు ప్రవేశించాలి?" అని ప్రశ్నించింది...అప్పుడు భాస్కరాచార్యుల వారు
"ఓవాసవి! ముందుగా నీవు అగ్ని ప్రవేశం చేస్తే,
ఆ తరువాతనే ఇక్కడ వున్న 102 గోత్ర వైశ్యులందరూ
అగ్నిప్రవేశం చేయాలిగదమ్మా..!" అన్నారు.
అప్పుడు వాసవి దేవి
"ఓ గురువర్యా!
ముందుగా నేను అగ్నిప్రవేశం
చేయాలంటే 'కన్య'నైన నాకు
అగ్ని ప్రవేశ అర్హత లేదు కదా ?" అన్నది ..!
అప్పుడు భాస్కరాచార్యులవారు
"అదేమిటమ్మా వాసవి!,
ఇన్ని రోజుల నుండి నీవు,
'నేను అగ్ని ప్రవేశం చేస్తాను',
'నేను అగ్ని ప్రవేశం చేస్తాను'.
అని నీవంటేనే గదా!
ఈ 103 అగ్ని గుండాలను నిర్మించాము.
తీరా అగ్ని ప్రవేశానికిరమ్మంటే, అర్హత లేదంటావేమిటి.?
నీ మనసులోని ఆంతర్యం వివరించు వాసవి" అన్నారు!.
అప్పుడు వాసవి దేవి
"గురువర్యా!
మన హిందూ ధర్మంప్రకారం
వివాహమైన స్త్రీ మరణిస్తే
ఆ కళేబరాన్ని
దహనసంస్కారం చేస్తారు.
అదే వివాహం కాని కన్య విధివశాత్తు గా మరణిస్తే..
ఆ కన్య కళేబరాన్ని 'భూస్థాపన' చేస్తారు కదా!
కనుక
'వాసవీ కన్య' అనబడే నాకు
అగ్నిప్రవేశం అర్హత లేదు కదా!
వివాహం కాని నేను అగ్నిలో ఎలా ప్రవేశించగలను?"
అన్నది.
అప్పుడు భాస్కరాచార్యులవారు
"అలా అయితే వాసవి,
నీవు అగ్నిప్రవేశం చేయాలంటే.. నీకు వివాహమేకావాలంటావా?
వివాహమే కావాలంటే
నీ మేనత్త కుమారులైనబావగార్లు
అనేక మంది ఉన్నారు కదా!
వారిలో యోగ్యుడైన వారిని నీవు వివాహం చేసుకుంటావా?
చెప్పమ్మా వాసవి" అన్నారు.
అప్పుడు వాసవి దేవి
"ఓ గురువర్యా నేను ఆదిశక్తి స్వరూపంతో పార్వతి అంశతో వాసవి రూపంగాఅవతరించాను.
నన్ను వివాహమాడే అర్హత
ఆ దేవదేవుడైన
ఈశ్వరునికే ఉన్నది" అన్నది.
అప్పుడు భాస్కరాచార్యుల వారు
"ఓ వాసవీ ఆ శివుడు లింగరూపంలో ఉన్నాడు కదా!
ఆయన రావటం ఎట్లా ?
నీ మెడలో మాంగల్యధారణ చేయడం ఎట్లా ?
నీవు అగ్నిప్రవేశం చేయడం ఎట్లా?" అన్నారు.
"ఓ గురువర్యా
ఈ సుముహూర్తంలో వాసవినైన నేను
నాశక్తి స్వరూపంతో
ఈశ్వరుని పిలిచిన వెంటనే
స్వామి ప్రత్యక్షమై రాగలడు.
నా మెడలో మంగళ సూత్ర ధారణ చేయగలడు.
మీరంతా చూడగలరు ,
నేను అగ్నిప్రవేశం చేయగలను." అని
వాసవిదేవి ఈశ్వరుని లింగం వద్దకు వెళ్లి
గంభీరమైన స్వరంతో బిగ్గరగా...
'ఓ పార్వతీ వల్లభ!
'ఓ జగన్నాయకా !
'ఓ దీన బంధూ!
'హృదయ నివాసా!" అని
ప్రార్థించగానే
"తళుక్.. తళుక్" మనే
మెరుపులతో .
'త్రినేత్రుడు , త్రిశూలధారుడు' అయిన ఆ పరమేశ్వరుడు
ఆ గర్భాలయంలోని
లింగం నుండి ప్రత్యక్షమై వాసవి పక్కకు వచ్చి నిలుచున్నాడు.
అప్పుడు భక్తులందరూ జయజయ ధ్వనాలతో
శివుని కీర్తించారు.
అప్పుడు కొంతమంది ఆర్యవైశ్య బంధువులు భాస్కరాచార్యులవారితో
"ఓ గురువర్యా! పెళ్లి అంటేనే బంధువులతో ఆనందంగా
హడావిడిగా సంతోషంగా
జరుగుతుందికదా!.
ఇక్కడ నిలిచి ఉన్న
102 గోత్రాల జంటలుఅందరూ పెళ్లికూతురు తరుపు వారేఉన్నారు.
మరి పెళ్లి కొడుకు తరపు బంధువులు ఎవరు?
ఇప్పుడు ఈశ్వరుడు ఒక్కరే ప్రత్యక్షమైనారు కదా!
మనము ఇచ్చే కన్యాదానము స్వీకరించాలి అంటే?
పెళ్ళికొడుకు తరపువారి బంధువులు కానీ,
తల్లిదండ్రులు కానీ,
కులము గోత్రము, వివరాలుగాని
సంకల్పంలో చెప్పాలికదా!."
"శ్రీసీతారాములకళ్యాణం లో కూడా..
వధూవరుల వంశం, సంకల్పం చెప్పి వివాహం జరిపిస్తారు కదా!" అన్నారు.. అప్పుడు
భాస్కరాచార్యులవారు
"ఆది విష్ణువుకూ,
ఆది శివునకూ,
కులగోత్రాలు కానీ,
తల్లిదండ్రులు కానీ,
ఉండరు!" అన్నారు.
అప్పుడు ఈ 102 గోత్ర బంధువులలో చివరి గోత్రం వారైనా 'లాభాల' గోత్రీకులైన 'ధనలక్ష్మి ధనదగుప్త' దంపతులు ముందుకు వచ్చి.. "మా దంపతులకు సంతానం లేదు, మేము ఆ పరమేశ్వరుణ్ణి మా కుమారునిగా 'దత్తు' తీసుకుంటున్నాము...
మేము వాసవికి మేనత్త గోత్రం వారము కనుక,
వాసవి పరమేశ్వరుని పెళ్లి చేసుకుంటే మేనరిక వివాహం చేసుకున్నట్లు అవుతుంది"
అని అనగానే అక్కడున్న ఆర్యవైశ్యకుల బంధువులందరూ
సంతోషంతో అంగీకరించారు.
అప్పుడు భాస్కరాచార్యులవారు ఆవుపాలతో శివుని చేతులను తడిపి లాభాలగోత్ర దంపతుల చేతులలో శివుని చేతులు ఉంచి,
'దత్తత స్వీకరణ' మంత్రాన్ని చదివారు.
ఈ క్షణం నుంచి మీకు శివుడే పుత్రుడు అయినాడు
నీ వంశం వారందరూ
సద్గతినిపొంది తరించారు"అని
భాస్కరాచార్యులవారన్నారు.
అలా వారికి
సాక్షాత్తు పరమేశ్వరుడే కుమారుడుకాగా..
అక్కడ ఉన్న పెనుగొండ నగర ప్రజలు అందరూ సంతోషించి
పరమేశ్వరుని
స్తోత్రాలతో స్తుతించారు.
అప్పుడు శివుడు
"ఓ మహా భక్తులారా!
ఈ క్షణం నుంచినాకు 'లాభ' దంపతులు తల్లిదండ్రులు అయినారు కనుక..
నేను కూడా మీకు ఒక వరం ఇస్తున్నాను..
“ ఐశ్వర్యం ఈశ్వరాధిచ్చేత్ ” అన్నట్లుగా
ఈరోజు నుంచి ఎవరైతే వ్యాపార ప్రారంభంలో ప్రప్రథమంగా
ఈశ్వరుడినైన నా 'లాభాల' గోత్రాన్ని
“ లాభం” అని
వ్యాపారంలో స్మరిస్తారో
వారికి నేను అనంతానంత ఐశ్వర్యం అనుగ్రహిస్తాను!"
అని వరం ఇచ్చారు.
అప్పుడు నగర ప్రజలందరూ "ఓ పరమేశ్వరా!
ఇంతటి మహత్తర వరమును మాకు అందించి,
మా నగరవాసులను ఆనందింప చేశారు,
కనుక ఈరోజు నుంచి మిమ్మల్ని
మా 'నగర- ఈశ్వరుడి' గా
శ్రీ నగరేశ్వర స్వామి అనే పేరుతో పూజలు అందుకుంటారు" అని
నమస్కరించారు.
ఆ విధంగా
ఈ ధనలక్ష్మి ,దనదగుప్తా దంపతుల వివాహసమయంలో
'కన్య' ను కోడలిగా .. స్వీకరణనుచేసుకున్నారు .
అలా వాసవి కూడా
తన అగ్నిగుండ ప్రవేశం సమయంలో
తన నాధుడైన నగరేశ్వర చిహ్నంగా..
లింగమును చేతధరించి అగ్నిప్రవేశం చేయడానికి కారణమైనది....
అప్పుడు కుసుమశ్రేష్టి కుసుమాంబ దంపతులూ.. విరూపాక్షుడూ...
శివునకు అనేక నమస్కారాలు ఆచరించి,
గంగాజలకలశం తెచ్చి పరమేశ్వరుని పాదాలు కడిగి ఆ జలాన్ని వారి శిరస్సులపై చల్లుకొని పునీతులయ్యారు.
అప్పుడు భాస్కరాచార్యులవారు
మంగళసూత్రం సిద్ధం చేసి పరమేశ్వరుని చేతికి అందించారు...
ఈశ్వరుడు మంగళసూత్రాన్ని వాసవి మెడలో
ధారణ చేస్తూ ఉండగా..
అప్పుడు భాస్కరాచార్యులవారు
" ఓం మాంగల్యం తంతునానేనా లోక రక్షణ హేతునా కంఠే భధ్నామి సుభగే సంజీవ శరణాంశతం"
అనే పెళ్లి మంత్రం చదువుతుండగా..
ఆ సమయంలో
బాజా భజంత్రీలు, మంగళవాయిద్యాలు
మారుమ్రోగుతుండ గా..
ఆకాశం నుంచి దేవతలు దేవదుందుభులు మోగిస్తుండగా,
కిన్నెర కింపురుషులు ఆనందభైరవి ఆలపిస్తుండగా..
నారదాది మహామునులు దివ్య మంత్రాలతో ఆశీర్వదిస్తూ ఉండగా..,
ముప్పది మూడు కోట్ల దేవతలు ఆకాశం నుంచి పుష్పవర్షం కురిపిస్తుండగా..
102 గోత్రాలవైశ్యులు
నూతన దంపతులపై ఆశీర్వాదాక్షతలు సమర్పిస్తుండగా....
వాసవి మెడలో మంగళసూత్ర ధారణ గావించాడు పరమేశ్వరుడు...
తదుపరి వాసవీ ఈశ్వరులు
ఆ అగ్నిగుండానికి మూడుసార్లు ప్రదక్షిణచేసి ఏడడుగులు నడిచారు,
అలా వాసవి వివాహానంతరం
ఆర్యవైశ్య బంధువులందరూ వచ్చి
"అమ్మ వాసవి ఇప్పుడు మీకు వివాహం అయ్యింది కదా!
మరి నిన్ను వాసవి 'కన్యక' అని
పిలవాలా! ఎలా పిలవాలి?"
అని ప్రశ్నించారు.
అప్పుడు వాసవి దేవి
"ఓ బంధువులారా!
నేను అగ్ని ప్రవేశార్హత కోసం నా నాధుడైన నగరేశ్వరునితో నేను మంగళసూత్రధారణ జరిపించుకున్నానేగానీ ,
నాకు భర్తతో సంగమం జరుగలేదు.
నేను ఆజన్మ బ్రహ్మచారిని, కనుక
నేను 'కన్య' ను కాను 'కన్యక'ను అన్నది వాసవి దేవి.
అనగా ఏ స్త్రీ అయినా పుష్పవతి అయి
వివాహం కాక పూర్వము 'కన్య' అనీ..
మంగళ సూత్రధారణ జరిగినా.. భర్తతో సంగమం జరగని మధ్య కాలంలో 'కన్యక' అనీ..,
తదుపరి భర్తతో కాపురానికి వెళ్లిన తరువాత 'శ్రీమతి' అనీ.. అంటారు.
కనుక నేను అగ్ని ప్రవేశ అర్హత కోసం, నేను నా నాధుడైన నగరేశ్వరునితో మంగళసూత్రధారణ జరిపించుకున్ననే కానీ,
నాకు భర్తతో సంగమం జరగలేదు,
నేను 'ఆజన్మ బ్రహ్మచారిణి' ని నేను 'కన్య' ను కాదు
'కన్యక' ను , అని అన్నది వాసవిదేవి .
ఉదాహరణకు:- తమిళనాడులో 'కన్యాకుమారి' అని ఒక అమ్మవారు ఉన్నది, ఆమెకు మంగళ సూత్రధారణే జరుగలేదు కనుక ఆమెను మనం 'కన్యాకుమారి' అని పిలుస్తాం కానీ
కన్య 'కా' కుమారి అని పిలవరు కదా!
అలాగునే మన కన్యకాపరమేశ్వరికి
మంగళసూత్రధారణ జరిగినా..,
భర్త తో సంగమం లేని
ఆజన్మ బ్రహ్మచారిణి , కనుక
ఆమెను మనం 'కన్యకా' పరమేశ్వరి అని పిలుస్తాం కానీ,
'కన్యా' పరమేశ్వరి అని పిలువముకదా!
మరో ఉదాహరణ:-
ఒక 20 సంవత్సరాల కన్య వివాహం జరిగి ఆమె వెంటనే భర్తతో కాపురానికి వెళ్ళిపోతే ఆమె 'శ్రీమతి' అని పిలువబడుతుంది.
అలా కాక ఆ కన్యకు మంగళసూత్రధారణ జరిగిన తర్వాత కొన్ని కారణాల వలన
ఆమె కాపురానికి వెళ్లకుండా.. పుట్టింటిలోనే కొంత కాలం ఉండిపోతే,
అప్పుడు ఆమె మంగళసూత్రధారణ
జరగక ముందు 'కన్య'..
మంగళసూత్రధారణ జరిగినా, పుట్టింట్లోనే ఉన్నంతకాలం 'కన్యక'
ఎప్పుడు భర్తతో కాపురానికి వెళ్ళితే అప్పుడు 'శ్రీమతి' అని పిలుస్తారు.
అందుకే అమ్మవారు అంటున్నది..
"నేను అగ్ని ప్రవేశార్హత కోసమే, నా నాధుడైన నగరేశ్వరునితో మంగళసూత్రధారణ జరిపించుకున్ననే కానీ,
నాకు భర్తతో సంగమం జరగలేదు.
నేను ఆజన్మ 'బ్రహ్మచారిణి' ని నేను 'కన్య' ను కాను 'కన్యక'ను,
ఈ రోజు నుంచి మీరు నన్ను 'కన్యకా పరమేశ్వరి' అని పిలవాలి అన్నది.
అందుకే ఈ క్షణం నుంచే ఈమెకు కన్యకా పరమేశ్వరి అనే పేరు వచ్చిందని విజ్ఞులంతా గమనించాలి.
నిజానికి ఈ క్షణం నుంచే.. అనగా!
అమ్మవారి అగ్నిప్రవేశం సమయము నుండే,
'కన్యకా పరమేశ్వరి' అనే పేరు వచ్చిందని విజ్ఞులంతా గమనించాలి,
'పరమేశ్వరుడు' అనగా శివుడు..!
'పరమేశ్వరి'అనగా..
పార్వతి అని అర్థం..!
ఇంతకుముందు వరకు అమ్మవారికి,
వాసవీ..
వాసవికన్య..
వాసవాంబ..,
వాసవిబాల..
కన్యకాంబ..
అనే పేర్లుమాత్రమే ఉండేవి.
కానీ ఇప్పుటి నుంచే
కన్యకాపరమేశ్వరి అనే పేరు వచ్చిందని విజ్ఞులంతా గమనించాలి.
అందుకే వాసవికి వివాహం అయినది కనుక ఈనాటికీ ప్రపంచంలోని అనేక వాసవి దేవాలయాలలో ఆమెకు మెడలో మంగళ సూత్రాలు కనిపించడానికి కారణం.
వాసవిదేవికి మనం 'ఒడిబాలు'
పోయడానికి కారణం .
వాసవిదేవికి మెడలో నల్లపూసలు కనిపించడానికి కారణం.
దంపతులకు మాత్రమే చేసే 'వసంతోత్సవం' సేవలు
శ్రీవాసవినగరేశ్వరలకు చేయటానికి కారణం.
వాసవి ప్రక్కనే నగరేశ్వర స్వామి ఉండడానికి కారణం.
ఇవన్నీచేస్తూనే
మనం 'వాసవి' ని
'కన్యకాపరమేశ్వరి' అని, పిలవడానికి గల కారణం.
వాసవిని నగరేశ్వరుడు వివాహం చేసుకున్నాడు కనుకనే, పెనుగొండలోని నగరేశ్వర ఆలయంలో నగరేశ్వర స్వామికి ఎదురుగా రెండు పెద్ద పెద్ద నందులు ఉంటాయి.
అందులో ఒకటి ద్వాపరయుగం పురాతన నంది రెండవది కలియుగ నూతన నంది.
ఈశ్వరుడూ, నగరేశ్వరుడు, అనే రెండు పేర్లతో ఒకే లింగం లో శివుడు ఉన్నాడు కనుకనే పెనుగొండ లోని నగరేశ్వర ఆలయంలో ఈరోజు కి మనం దర్శించవచ్చు.
వాసవికి వివాహమైన
ఈ సన్నివేశం
ఇదే దేవాలయంలోని ఏడంతస్తుల గాలిగోపురం పైకి మనం మెట్లు ఎక్కుతూ ఉండగా...
కొంత భాగం పైకి వెళ్ళగానే వాసవిని నగరేశ్వరుడు వివాహం చేసుకున్న చిత్రాలనూ...
శివుడు వాసవి ని తన తొడపైన కూర్చుండ బెట్టుకుని కైలాసం తీసుకువెళ్ళిన విశేషాలనూ... మనం దర్శించవచ్చును.
పెనుగొండ క్షేత్రం వారు
1958 లో రచించిన వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత చరిత్ర పురాతన ఆది గ్రంథంలో కూడా, వాసవికి వివాహమైన చరిత్ర శ్లోకాలు తో సహా ఉండటాన్ని మనం చదవొచ్చు.
ఇప్పుడు మీరు తెలుసుకున్న ఈ వాసవి కళ్యాణం చరిత్ర ను మనం విశ్వసించాలా? , వద్దా.!
అనే విషయాలను మన ఆర్యవైశ్య సంస్థల వారు పండితులతో ఆలోచించి, ఏకీభావం తో..
ఒక ప్రామాణికమైన విషయాన్ని ప్రస్తుత ఆర్యవైశ్య లోకానికి తెలియచేయాలన్నది మా సంకల్పమే తప్ప,
ఈ వాసవి కళ్యాణ
కథా విషయం
మా అభిప్రాయం
కాదని మనవి.
*జై వాసవాంబ జై జై వాసవాంబ
No comments:
Post a Comment