మేడారం మహాజాతరకు అంతా రెడీ- ముఖ్యమైన ఘట్టాలివే!
మమ్మల్ని ఫాలో అవ్వండి
``` : మేడారం మహా జాతరకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. భారీగా తరలివచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ప్రభుత్వం రూ.110 కోట్ల ఆలయ పరిసరాలు అభిృద్ధి చేసింది. దాదాపు కోటిన్నర మంది భక్తులు ఈ ఏడాది మేడారం రానున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు.
మేడారం మహాజాతరకు అంతా రెడీ-
మేడారం మహాజాతరకు అంతా రెడీ-
: తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర(Medaram Maha Jatara)ను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలకు చేరుకోనుండగా.. సమ్మక్క(Sammakka) తల్లి గురువారం గద్దెలపై కొలువుదీరనున్నారు. మొత్తం నాలుగురోజుల పాటు మేడారం జనసంద్రంగా మారునుండటంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. ఈ మేరకు దాదాపు రూ.110 కోట్లు మంజూరు చేయగా.. ఆయా నిధులతో ఆఫీసర్లు పనులు పూర్తి చేయడంపై ఫోకస్ పెట్టారు. మంత్రి సీతక్క(Seethakka) తరచూ మేడారం విజిట్ చేస్తూ ఆఫీసర్ల సమన్వయంతో పనులు చేయించారు. ఈ మహాజాతరకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలి రానుండగా.. ఈసారి దాదాపు కోటిన్నర మంది వరకు తల్లులను దర్శించుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల తాకిడికి అనుగుణంగా ఏర్పాట్లు చేయడంపై ప్రజాప్రతినిధులు, అధికారులు ఫోకస్ పెట్టారు.
శ్వత ప్రాతిపదికన షెడ్లు
మేడారంలో సమ్మక్క-సారలమ్మ(Sammakka Saralamma) తల్లులు గద్దెలకు చేరడానికి ముందురోజు నుంచి తిరిగి వన ప్రవేశ ఘట్టం పూర్తయ్యేంత వరకు భక్తులు నాలుగు రోజుల పాటు ఇక్కడే గుడారాలు వేసుకొని ఉండటం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. దీంతో గుడారాలతో భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ముందుచూపుతో పనులు చేపట్టింది. మేడారంలో భక్తులు ఉండేందుకు నివాసానికి ఏర్పాట్లు చేశారు. కొన్నిచోట్లా తాత్కాలిక ఏర్పాట్లతో పాటు మరికొన్ని చోట్లా శాశ్వత ఏర్పాట్ల పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే భక్తులకు వివిధ శాఖల ద్వారా నివాసానికి ఆల్రెడీ ఉన్న షెడ్లతో పాటు మరికొన్నింటిని అదనంగా నిర్మించింది. వరంగల్ నుంచి మేడారం మార్గంలో మూడు చోట్లా ఒక్కోటి 1.65 కోట్లతో మూడు షెడ్లు నిర్మించి, భక్తులకు అందుబాటులోకి తెచ్చింది.
తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం
ఆదివాసీ సంస్కృతి సంప్రదాయలను గౌరవిస్తూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. జాతర నిర్వహణతో పాటు భక్తులకు తాగు నీరు, మరుగుదొడ్లు, అదనపు స్నాన ఘట్టాలు, బ్యాటరీ ట్యాప్స్, అంతర్గత రోడ్లు, వైద్యం, వసతి, పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్తు సరఫరా, రహదారుల అభివృద్ధి , క్యూలైన్ ఏర్పాటు తదితర ఏర్పాట్లు పూర్తి చేసింది. మేడారం మహాజాతరకు సరిగ్గా రెండు నెలల ముందే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడగా.. జిల్లా అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో అనేకమార్లు పర్యటించింది. ఆఫీసర్ల గత జాతర అనుభవాలను పరిగణనలోకి తీసుకొని లోపాలను సరిదిద్దుకుంటూ ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు సజావుగా దర్శనం కల్పించడమే లక్ష్యంగా జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పక్కా ప్రణాళికతో జాతరకు ముందే అన్ని సిద్ధం చేశారు.
మంత్రి సీతక్క స్పెషల్ ఫోకస్
మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) ప్రత్యేక శ్రద్ధతో మేడారం పనులను పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిని పరిశీలిస్తూ అవసరమైన సూచనలు చేస్తూ పనులు చేయించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ప్రత్యేకంగా మేడారం పర్యటించి పనులను పరిశీలించారు. ఎప్పటికప్పుడు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో రివ్యూలు నిర్వహించి పనులను స్పీడప్ చేయించారు. మొత్తంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా జాతరను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు కూడా ఇచ్చారు. రవాణా వ్యవస్థలో లోపాలు తలెత్తకుండా అధికారులు వాహనాల పార్కింగ్ స్థలాలను(Medaram Parking) గద్దెల కు దూరంగా ఏర్పాటు చేశారు. రోడ్ల వెడల్పు, నూతన రోడ్లు, రిపేర్లు చేసి ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు చర్యలు తీసుకున్నారు. కాగా మేడారం మహాజాతర బుధవారం నుంచి ప్రారంభమై శనివారం వరకు జరగనుండగా.. ప్రజాప్రతినిధులు, అధికారులు భక్తులకు ఇబ్బందులు అన్ని విధాలుగా సిద్ధమైనట్లు చెబుతున్నారు.
జాతరలో ముఖ్య ఘట్టాలు ఇవే
ఫిబ్రవరి 21- సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలకు చేరుకుంటారు
ఫిబ్రవరి 22- సమ్మక్క గద్దెకు వస్తుంది
ఫిబ్రవరి 23- మహాజాతర కోసం వచ్చిన భక్తులు మొక్కులు సమర్పిస్తారు
ఫిబ్రవరి 24- అమ్మవార్లు వన ప్రవేశం చేస్తారు
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)
No comments:
Post a Comment