Saturday, 14 October 2023

తుక్కు సామగ్రి పక్కదారి? విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ విభాగంలో మాయాజాలం విద్యుత్తు నియంత్రికల నుంచి తొలిగించిన తుక్కు రాగి తీగ

తుక్కు సామగ్రి పక్కదారి?

విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ విభాగంలో మాయాజాలం

విద్యుత్తు నియంత్రికల నుంచి తొలిగించిన తుక్కు రాగి తీగ



భువనగిరి : జిల్లా కేంద్రంలోని విద్యుత్తు నియంత్రికల ప్రత్యేక నిర్వహణ విభాగంలో తుక్కు సామగ్రి పక్కదారి పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.పట్టణంలోని విద్యుత్తు డీఈ కార్యాలయం ఆవరణలో కొనసాగుతున్న ఈ కార్యాలయం పరిధిలో గత కొన్నేళ్లుగా మరమ్మతుకు వీలుకాని వందలాది ట్రాన్స్‌ఫార్మర్లను నిల్వ చేశారు. కొత్తగా నిర్మించనున్న విద్యుత్తు ఎస్‌ఈ కార్యాలయం భవనం కోసం నిల్వ చేసిన నియంత్రికలను అధికారులు వదిలించుకుంటున్నారు. వీటిని తుక్కుగా మార్చి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సంస్థ స్టోర్స్‌కు ఎస్‌పీఎం అధికారులు అప్పగిస్తున్నారు. ఈ ప్రక్రియలోనే కొందరు అధికారులు విలువైన రాగి తీగతో పాటు ఇతర పరికరాలను తక్కువగా చూపి స్టోర్స్‌కు అప్పగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

చేతివాటం ఇలా..

జిల్లా పరిధిలో మోత్కూరు, ఆలేరు, రామన్నపేటతో పాటు భువనగిరి పట్టణంలో రెండు విద్యుత్తు నియంత్రికల మరమ్మతు కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఆయా కేంద్రాల్లో మరమ్మతులకు వీలుకాని ట్రాన్స్‌ఫార్మర్లతో పాటు విలువైన సామగ్రిని ఆయా కేంద్రాల వారు విడతల వారీగా ఎస్‌పీఎం విభాగానికి అందజేస్తుంటారు. అక్కడి అధికారులు సర్వే నివేదిక, అనుమతులతో తుక్కుగా మార్చుతుంటారు. 16, 25, 60, 100 కేవీఏల ట్రాన్స్‌ఫార్మర్లను సంస్థ వినియోగిస్తోంది. తాజాగా 130 ట్రాన్స్‌ఫార్మర్లకు సర్వే నివేదిక రాగా ఇప్పటికే వంద ట్రాన్స్‌ఫార్మర్లను తుక్కుగా మార్చారు. ఎల్‌వీ, హెచ్‌వీ కాయిల్స్‌కు ఉన్న రాగి తీగను కాల్చి తుక్కుగా మారుస్తారు. ప్రతి ట్రాన్స్‌ఫార్మర్‌లోని రాగి తీగ కాల్చడం ద్వార పది శాతం తరుగు చూపించుకునే వెసులుబాటును అధికారులు వినియోగించుకుంటూనే, ప్రతి ట్రాన్స్‌ఫార్మర్‌లో ఉండే రాగి తీగను ఐదు నుంచి ఎనిమిది కిలోలు తక్కువగా నమోదు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాయిల్స్‌, కోర్‌ బ్లేడులు తుక్కుగా మార్చిన నియంత్రికల స్థానంలో కొత్తవి సంస్థ అందజేస్తున్నప్పటికి రైతులకు, అత్యవసరాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు జారీ చేయకుండా, డబ్బులు ఇచ్చిన వారికి ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

సర్వే నివేదిక ప్రకారమే ప్రక్రియ: రవీందర్‌, ఏఈ

మరమ్మతులకు వీలుకాని ట్రాన్స్‌ఫార్మర్లను సర్వే నివేదిక ప్రకారమే తుక్కుగా మారుస్తున్నాం. ఈ ప్రక్రియలో అవకతవకలకు ఆస్కారం లేదు. ఇప్పటి వరకు వంద ట్రాన్స్‌ఫార్మర్ల ప్రక్రియను పూర్తి చేశాం. మరో 30 ట్రాన్స్‌ఫార్మర్లకు సర్వే నివేదిక ప్రకారం ప్రక్రియ పూర్తి చేసి స్టోర్స్‌కు అందజేయాల్సి ఉంది.

No comments:

Post a Comment