Friday, 26 January 2024

దమ్ముంటే లోకల్‌ ఎన్నికలు పెట్టండి.. ఇన్‌చార్జీలతో గ్రామాల పాలన నడపడమెందుకు?: కేటీఆర్‌

 దమ్ముంటే లోకల్‌ ఎన్నికలు పెట్టండి.. ఇన్‌చార్జీలతో గ్రామాల పాలన నడపడమెందుకు?: కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ధైర్యముంటే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు సవాల్‌ విసిరారు. ఇన్‌చార్జిలతో గ్రామాల్లో పాలన నడిపించకుండా వెంటనే ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రజాప్రతినిధుల చేతుల్లో పాలన పెట్టాలని సూచించారు. 

|


దమ్ముంటే లోకల్‌ ఎన్నికలు పెట్టండి.. ఇన్‌చార్జీలతో గ్రామాల పాలన నడపడమెందుకు?: కేటీఆర్‌

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలకు వెళ్లాలి

ప్రపంచ వేదికపై సీఎం రేవంత్‌ పచ్చి అబద్ధాలు: కేటీఆర్‌

నేను దావోస్‌ పర్యటనకు వెళ్తే డబ్బు దాచుకొనేందుకన్నారుగా!

రేవంత్‌ ఎందుకు వెళ్లారో చెప్పాలి

సీఎం పర్యటనపై భట్టే విమర్శలు

రైతుబంధు డబ్బులే ఇంకా వేయలే

రెండు నెలల్లోనే కాంగ్రెస్‌ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత

సీఎం క్యాంపు ఆఫీస్‌ ఉండగా కొత్త భవనం ఎందుకు?

నేడు మా పార్లమెంటరీ పార్టీ భేటీ

రేపు బీఆర్‌ఎస్‌ మైనార్టీ సెల్‌ భేటీ

త్వరలోనే సోషల్‌మీడియా వారియర్స్‌తో సమావేశమవుతాం

మీడియా చిట్‌చాట్‌లో కేటీఆర్‌

స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో పెట్టొద్దన్నది కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆలోచన. ఈ సర్కారుకు ధైర్యముంటే ఇన్‌చార్జీలతో గ్రామాల్లో పాలన నడిపించకుండా.. వెంటనే లోకల్‌బాడీ ఎన్నికలు జరపాలి.

– కేటీఆర్‌





KTR | హైదరాబాద్‌, జనవరి 25 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ధైర్యముంటే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు సవాల్‌ విసిరారు. ఇన్‌చార్జిలతో గ్రామాల్లో పాలన నడిపించకుండా వెంటనే ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రజాప్రతినిధుల చేతుల్లో పాలన పెట్టాలని సూచించారు. ప్రస్తుత సర్పంచుల హయాంలో నిర్మించిన భవనాలు, ఇతర మౌలిక వసతులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్‌చాట్‌ సందర్భంగా కేటీఆర్‌ పలు అంశాలపై మాట్లాడారు. ప్రారంభమే కాని రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకు డబ్బులు ఇస్తున్నట్టు ప్రభుత్వం చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు విమర్శించారు. రైతు భరోసా ప్రారంభించామని పచ్చి అబద్ధాలు చెప్పినందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. దావోస్‌లో ప్రపంచ వేదికపై సీఎం నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పారని మండిపడ్డారు. అంతర్జాతీయ వేదికలపై సీఎం అబద్ధాలు చెప్తుంటే.. రాష్ట్రంలో రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతామని మంత్రులు అంటున్నారని ధ్వజమెత్తారు.


నెలన్నరలో సాధించింది.. ఢిల్లీకి వెళ్లిరావటమే

ఇప్పటికే ఉన్న రైతుబంధు ఇవ్వని రేవంత్‌రెడ్డి.. లేని రైతు భరోసా గురించి మాట్లాడటం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని కేటీఆర్‌ విమర్శించారు. రేవంత్‌రెడ్డి 5ం రోజుల పరిపాలనలో సాధించింది ఢిల్లీ పర్యటనలు చేయడం మాత్రమేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తెలంగాణ పరిపాలన ఢిల్లీ నుంచి జరుగుతుందని తాము ముందుగానే తాము చెప్పామని.. ప్రస్తుతం అదే జరుగుతున్నదని అన్నారు.


రాష్ట్రం దివాలా తీసిందని చెప్తూనే ముఖ్యమంత్రికి కొత్త క్యాంపు కార్యాలయం ఎందుకు కడుతున్నారని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఇప్పటికే ఉన్న క్యాంపు కార్యాలయాన్ని పక్కనపెట్టి కొత్త కార్యాలయం కట్టడం ఎందుకో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. భేషజాల వల్లనే రేవంత్‌రెడ్డి ప్రగతిభవన్‌ను వాడలేదని, సీఎం మారినప్పుడల్లా కొత్తవి కట్టుకుంటూ పోతే ఎలా? అని ప్రశ్నించారు. అవసరం లేని భవనాలు కట్టడానికి రేవంత్‌రెడ్డికి డబ్బులు వస్తున్నాయి కానీ రైతుబంధు ఇవ్వటానికి రావట్లేదని విమర్శించారు.


త్వరలో సోషల్‌మీడియా బలగంతో భేటీ

పార్లమెంట్‌ స్థానాలవారీగా సన్నాహక సమావేశాలను విజయవంతంగా పూర్తి చేశామని కేటీఆర్‌ తెలిపారు. రోజూ 10 అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున పార్లమెంట్‌ ఎన్నికల సన్నాహక సమావేశాలను నిర్వహించామని చెప్పారు. త్వరలోనే 30 వేల మంది సోషల్‌ మీడియా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 14 స్థానాల్లో స్వల్ప ఓట్ల తేడాతో కోల్పోయినట్టు వివరించారు. పార్లమెంట్‌ సన్నాహక సమావేశాల్లో క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి మంచి ఫీడ్‌బ్యాక్‌ వచ్చిందని తెలిపారు. గతంలో జరిగిన కార్యక్రమాలపై కూడా విమర్శనాత్మక ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చారని, పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి కూడా క్షేత్రస్థాయి నుంచి ఫీడ్‌బ్యాక్‌ వచ్చిందని వెల్లడించారు.




వద్దన్న సలహాదారులే ముద్దా?

ఒకప్పుడు ప్రభుత్వ సలహాదారులు వద్దని చెప్పిన రేవంత్‌రెడ్డి, కోర్టులో కేసు కూడా వేశారని, ఇప్పుడు ఆయనే రాజకీయ నిరుద్యోగులను సలహాదారులుగా నియమించుకుంటున్నారని కేటీఆర్‌ విమర్శించారు. ప్రభుత్వాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని ఆరోపించారు. సీఎం దావోస్‌ పర్యటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారని తెలిపారు. అంతర్జాతీయ సంస్థలతో సామాజిక న్యాయం, సమానత్వం, ఉద్యోగ, ఉపాధి కల్పన వంటివి భూతద్దం పెట్టి వెతికినా కనిపించవని భట్టి ఒకవైపు మాట్లాడుతుంటే..


సీఎం మాత్రం అదే అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సీఎం గురించి కాకుంటే డిప్యూటీ సీఎం భట్టి ఎవరి గురించి మాట్లాడారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. భట్టి మాటలు వింటుంటే రేవంత్‌రెడ్డి దావోస్‌ ఎందుకు పోయిండో చెప్పాలని ప్రశ్నించినట్టుగా ఉన్నదని అన్నారు. గతంలో తాను దావోస్‌ వెళ్లినప్పుడు స్విస్‌ బ్యాంకులో డబ్బులు దాచుకున్నారని విమర్శించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లాంటివాళ్లు ఇప్పుడు మాట్లాడాలని డిమాండ్‌ చేశారు.


స్వల్ప కాలంలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత

కొత్త ప్రభుత్వంపై స్వల్పకాలంలోనే అన్ని వర్గాల నుంచి విపరీతమైన వ్యతిరేకత వచ్చిందని కేటీఆర్‌ తెలిపారు. కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని చెప్పేవాళ్లకు.. ప్రతిపక్షాలు చెప్పే మాటలు కూడా వినే సహనం ఉండాలని చురకలంటించారు. ఈ రోజుకు కూడా రెండు ఎకరాలకు మించి రైతుబంధు పడడం లేదని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న 9 మంది ఆటో డ్రైవర్లను బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ఆదుకుంటామని కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోని లక్షల మంది ఆటో డ్రైవర్ల సమస్యలపై పోరాటం చేస్తామని ప్రకటించారు.


వద్దన్న అదానీతో ఒప్పందాలు

పది సంవత్సరాలపాటు అదానీని తాము తెలంగాణకు రానీయలేదని, అదానీ పెట్టుబడులు మోదీకే లాభమని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ, నేడు అదే అదానీతో ఒప్పందం ఎలా చేసుకున్నదని కేటీఆర్‌ ప్రశ్నించారు. అదానీని ఒకవైపు రాహుల్‌గాంధీ తిడుతుంటే, ఇక్కడ రేవంత్‌రెడ్డి మాత్రం ఆయనతో ఒప్పందం చేసుకుంటున్నారని ఎద్దేవాచేశారు. ఒకే ముఖ్యమంత్రిని ఐదేండ్లపాటు కొనసాగించిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీకి లేదని కేటీఆర్‌ అన్నారు. ‘ఒకాయన నేనే నంబర్‌ 2 అంటాడు. డిప్యూటీ సీఎం భార్య మాత్రం మిగతా లీడర్లను పారాచూట్‌ లీడర్లు అని ఎగతాళి చేస్తుంటారు. ఇంకొకాయన నా మాటే చెల్లుతుందని చెప్తారు. ఇట్లా అనేక వైరుధ్యాల మధ్య ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగుతున్నది. కాంగ్రెస్‌ పార్టీ లీడర్లు ఎన్నిరకాలుగా దృష్టి మరల్చే ప్రయత్నాలు చేసినా.. ఆ పార్టీ ఇచ్చిన 420 హామీల అమలను చేసేలా మేము, మా పార్టీ శ్రేణులు వెంటాడుతూనే ఉంటాయి’ అని స్పష్టంచేశారు.


జట్టుకట్టిన జాతీయ పార్టీలు

రెండు జాతీయ పార్టీలు కేసీఆర్‌పై కుట్ర పన్నేందుకు జట్టుకట్టాయని కేటీఆర్‌ ఆరోపించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు కుమ్మక్కై బీఆర్‌ఎస్‌తో కొట్లాడుతాయని అన్నారు. బండి సంజయ్‌ వ్యాఖ్యలు, అదానీతో రేవంత్‌రెడ్డి ఒప్పందాలు అందులో భాగమేనని విమర్శించారు. హామీల అమలు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రేవంత్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలోని బెల్టు షాపులను ఎత్తేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ పార్టీ, ఇప్పుడు ఎలైట్‌ బార్లు పెడుతామంటున్నదని ఎద్దేవా చేశారు.


కాళేశ్వరంతో ఒక్క ఎకరానికి నీళ్లు రాలేదంటూనే.. లక్ష ఎకరాలకు నీళ్లిచ్చామని మంత్రి కొండా సురేఖ చెప్పారని అన్నారు. ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్‌ ఇస్తారో ఇవ్వరో చెప్పాలని నిలదీశారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి రాకముందే గ్యారెంటీల అమలుకు జీవోలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆరు గ్యారెంటీల్లోని 13 హామీల అమలుపై వెంటనే జీవోలు ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలో కోటి 57 లక్షల మంది మహిళలు రూ.2,500 ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు.


లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం

లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కొట్లాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేటీఆర్‌ తెలిపారు. పార్టీ అధ్యక్షుడు కేటీఆర్‌ అధ్యక్షతన శుక్రవారం పార్లమెంటరీ పార్టీ సమావేశమవుతున్నదని, శనివారం పార్టీ మైనార్టీ విభాగం సమావేశం ఉంటుందని చెప్పారు. శనివారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా పార్లమెంట్‌ ఎన్నికల సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. బండి సంజయ్‌ కరీంనగర్‌కు చేసిన పనులేంటో చెప్పాలని, ఆయన చెప్పిన అంశాలపై బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు వినోద్‌కుమార్‌తో కరీంనగర్‌లో ఎక్కడ చర్చకు వస్తారో చెప్పాలని సవాల్‌ విసిరారు.


కృష్ణా బేసిన్‌ ప్రయోజనాలు కేంద్రానికి తాకట్టు

తెలంగాణ ప్రయోజనాలను శాశ్వతంగా కేంద్రానికి తాకట్టు పెట్టేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరించిందని కేటీఆర్‌ దుయ్యబట్టారు. ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించే వ్యవహారంపై శాసనసభలో చర్చించాల్సిందని, అఖిలపక్షాన్ని వేయాల్సిందని అన్నారు. కొత్తగా వచ్చామని చెప్తున్న ప్రభుత్వం, ఇంతలోనే అడ్డగోలుగా ఎందుకు నిర్ణయాలు తీసుకుంటున్నదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఫార్మాసిటీ రద్దు, ఎయిర్‌పోర్ట్‌ మెట్రో రద్దుపై కనీసం క్యాబినెట్‌ సమావేశంలో కూడా చర్చించినట్టు లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఇంతటి కీలక అంశాలపై ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. తమకు ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని.. తెలంగాణ రాష్ర్టాన్ని బంగారు తునకలా మార్చి కాంగ్రెస్‌ పార్టీకి అప్పగించామని కేటీఆర్‌ తెలిపారు.

No comments:

Post a Comment