భోగి రోజు రేగు పండ్లను పిల్లల తల మీద ఎందుకు పోస్తారు..
:
సంక్రాంతి సందడి భోగితోనే మొదలవుతుంది. భోగి సందర్భంగా ఆనాడు సాయంత్రం చిన్నపిల్లలకు భోగిపండ్లు పోసే సంప్రదాయం ఉంది. రేగు పండ్లను తల మీద పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోయి నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే, పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని ఒక నమ్మకం. రేగుపండ్లు, చెరకుగడలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలను భోగి పండ్లుగా వాడతారు. రేగు పండ్లకు బదరీఫలాలని పేరు.
శివుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి నర, నారాయణులు బదరికావనంలో తపస్సు చేస్తుండగా, వారి తలల మీద దేవతలు బదరీ ఫలాలను కురిపించారట. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సంప్రదాయం ఏర్పడిందని చెబుతారు. ఎరుపు రంగులో ఉండే రేగు పండ్లను సూర్యుడికి ప్రతీకగా భావిస్తారు. అలా ఆదిత్యుడి ఆశీస్సులు పిల్లలకు లభిస్తాయని భోగిపండ్లు పోస్తారు. పెద్ద పండుగకు ముందురోజు వచ్చే భోగి వ్యవసాయదారులకు ప్రధానం. సంక్రాంతి వేళ పంటలు చేతికొచ్చి.. పల్లెలు ధనధాన్యరాశులతో తులతూగుతూ ఉంటాయి. గతంలో అనుభవించిన కష్టాలకు ముగింపు పలుకుతూ ‘భోగి’తో భోగభాగ్యాలు తమ జీవితంలో ప్రసరించాలని రైతులు భావిస్తారు.
దీనికి ప్రతీకగా ఇన్నాళ్లూ తమను పట్టి పీడించిన దారిద్య్రాన్ని తరిమికొడుతూ, కష్టాలన్నిటినీ అగ్నిలో ఆహుతి చేస్తూ భోగిమంటలను వేయడం ఆచారంగా మారింది. ఈ మంటల వెనుక ఆరోగ్యానికి సంబంధించిన శాస్త్రీయ కోణమూ దాగి ఉంది. దక్షిణాయనంలో అధిక భాగం అనారోగ్యం కలిగించే వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో శ్వాస సంబంధమైన రోగాలు వ్యాపిస్తుంటాయి. వాటి నివారణ కోసం ఆవుపేడతో చేసిన పిడకలు, మామిడి, మేడిచెట్ల కొమ్మలతో భోగిమంటలు వేస్తారు. అందులో ఆవునెయ్యి వేస్తారు. భోగిమంటలు వెచ్చదనాన్ని ఇవ్వడంతోపాటు అందులోంచి వెలువడే శక్తి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అందుకే భోగిమంటలకు అంత ప్రాధాన్యం ఏర్పడింది.
No comments:
Post a Comment