Sunday, 26 November 2023

బీఆర్ఎస్ ఓటమి భయం...‼️*


ఎస్.ఎం.ఎం.అలీ✍️)
*

      *_తెలంగాణ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ప్రచారం గడువు కూడా మరో నాలుగురోజులలో ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.  అభ్యర్థుల మాటల పదును ఎప్పుడో పెరిగింది.. విమర్శల వేడీ పెరిగింది.  రంగంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఉన్నా ప్రధాన పోటీ మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే కనిపిస్తుంది._*

        *ఒకపక్క ఎవరు గెలుస్తారనే సర్వే సంస్థల* అంచనాలు ఉత్కంఠ పెంచుతుంటే.. మరో  ఏ పార్టీకి ఆ పార్టీ  విజయం మాదే అనే ధీమా వ్యక్తం చేస్తున్నది. బీఆర్ఎస్ హ్యాట్రిక్‌ విజయంపై ధీమాతో ఉండగా.. కేసీఆర్ ను గద్దె దించుతామన్న ధీమా కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. అయితే  ఇప్పటి వరకూ వచ్చిన సర్వేల ఫలితాలు, సభలకు జనసమీకరణ,  మౌత్ టాక్, ప్రచారంలో పద్దతులను చూస్తే కాంగ్రెస్ ఒకింత ముందంజలో ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.  సాక్షాత్తు బీఆర్ఎస్ ముఖ్యనేత కేటీఆర్ ఓ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ కు అనుకూలం అనే టాక్ నిజమే అని ఒప్పుకుంటూనే  అయితే అది కాంగ్రెస్ పార్టీ  స్ప్రెడ్ చేస్తున్న  టాక్ అంటూ కొట్టిపారేశారు.

         *మరి అసలు* కనీసం పోటీకి అభ్యర్థులు దొరకడం కూడా కష్టమే అనుకున్న పార్టీ ఇప్పుడు ఈ స్థాయిలో ఇలా పుంజుకోవడం ఎలా సాధ్యమైంది? ఆరు నెలల ముందు కూడా  పోటీ  బీఆర్ఎస్, బీజేపీల మధ్యే అంటూ పరిశీలకులు విశ్లేషణలు చేశారు. కానీ ఇంతలోనే పరిస్థితి ఎలా మారిపోయింది. ఇప్పుడు బీజేపీని పక్కకి నెట్టేసి అధికారం దక్కించుకునే స్థాయికి కాంగ్రెస్ ఎలా ఎదిగింది? ఇది బీఆర్ఎస్ తప్పిదమా.. కాంగ్రెస్ నేతల ఛరిస్మానా?  లేక వ్యూహకర్తల ప్రణాళికలా?. పనిగట్టుకొని దెబ్బతీసినా మళ్ళీ ఈ స్థాయికి కాంగ్రెస్ ఎలా చేరుకోగలిగింది? తొమ్మిదేళ్లు అధికారాన్ని అనుభవించి సకల వనరులను కూడగట్టుకున్న కేసీఆర్ ను.. చితికిపోయింది, ఇక పుంజుకోవడం కష్టం అనే పరిస్థితికి పడిపోయిన కాంగ్రెస్ పడి లేచిన కెరటంలో మారి ఇలా   ఎలా ఢీ కొడుతోంది?  గత ఎన్నికలలో 46 శాతం ఓటింగ్ దక్కించుకున్న బీఆర్ఎస్ ను, 28 శాతం ఓటింగ్ మాత్రమే దక్కించుకున్న కాంగ్రెస్ ఇప్పుడు ఎలా టెన్షన్ పెడుతోంది?  కనీసం సీఎం ఎవరో కూడా చెప్పలేని కాంగ్రెస్.. బీఆర్ఎస్ కు ఓటమి భయం ఎలా పరిచయం చేసింది?  ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఎక్కడ విన్నా ఇదే చర్చ జరుగుతోంది.

      *అయితే* కాంగ్రెస్ తెలంగాణలో ఈ స్థాయికి రావడం వెనక అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని కాంగ్రెస్ సద్వినియోగం చేసుకుంటూ దూసుకొచ్చింది. కర్ణాటక గెలుపు ఇచ్చిన జోష్ తో తెలంగాణలో రాజకీయం మొదలు పెట్టిన కాంగ్రెస్ ముందుగా బీఆర్ఎస్ పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టేసింది.  అధికారం కాంగ్రెస్‌దే అనే భావన ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సూపర్ సక్సెస్ అయింది. చెల్లాచెదురైన పాత నేతలను మళ్ళీ తిరిగి పార్టీలోకి తీసుకురావడంలో కాంగ్రెస్ నేతలు ఎలాంటి భేషజాలకు పోకుండా  మెట్టు ఎదిగారు. అలాగే ముందు నుండి వ్యూహాత్మకంగా కేసీఆర్‌కు గెలుపుపైన ధీమా ఉంటే సిట్టింగ్‌ ఎమ్మెల్యేందరికీ సీట్లు ఇవ్వాలని ఛాలెంజ్‌ చేసి.. బీఆర్ఎస్ లో ఎక్కువ శాతం సిట్టింగులకే సీట్లు దక్కలే చేశారు. ఆ తర్వాత సిట్టింగులపై ప్రజలలో అసంతృప్తిని రెచ్చగొట్టారు. అన్నిటికీ మించి ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. కాంగ్రెస్ మార్క్ పాత ముతక ప్రచారాన్ని పక్కనపెట్టి కొత్త కొత్త పద్దతులతో, ప్రజలను ఆకట్టుకొనేలా ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా వ్యూహకర్త సునీల్ కనుగోలు వ్యూహాలుగా కనిపిస్తున్నది.

       *ఇక కాంగ్రెస్ ఈ స్థాయికి రావడం వెనక...* కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ కృషి పట్టుదలా కూడా ఒక కారణం. అలాగే బీఆర్ఎస్ తప్పిదాలు కూడా కాంగ్రెస్ కు కలిసి వచ్చాయి. సరిగ్గా అభ్యర్థుల జాబితా విడుదల చేసే సమయానికి కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. కీలకమైన ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు వరకూ కూడా కేసీఆర్‌ అందబాటులో లేరు. దీంతో పార్టీలో చాలా వెలితి కనిపించింది. ఈ సమయంలోనే కాంగ్రెస్ రాష్ట్ర మూలమూలాలకి వెళ్లి ప్రణాళికలు అమలు చేసింది. తీరా కేసీఆర్ వచ్చేసరికి కాంగ్రెస్ పై పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఇక ఎన్నికలు వస్తున్నాయని తెలిసినా ఉద్యోగుల డీఏ, రైతుబంధు బ్యాలెన్స్ వంటివి బీఆర్ఎస్ విడుదల చేయలేదు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ నుండి సెప్టెంబర్ లో విద్యార్థిని ఆత్మహత్య వరకూ వివిధ సందర్భాలలో బీఆర్ ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయి. ఈ విషయం  ప్రజలలోకి  బలంగా వెళ్లింది. చివరిగా చెప్పుకుంటున్నా ప్రధాన కారణం మాత్రం తెలుగుదేశం అధినేత చంద్రబాబును జగన్ సర్కార్ అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ కేసీఆర్ మౌనం,   కేటీఆర్  వ్యాఖ్యలు కూడా సీమాంధ్ర ఓటర్లలో బీఆర్ఎస్ పై పూర్తి స్థాయిలో వ్యతిరేకతను పెంచాయి. ఒక్క సీమాంధ్రులలో అనే కాదు.. తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలూ కూడా  కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుప్టాయి. అటువంటి వారందరినీ కాంగ్రెస్ కు చేరువ చేశాయి. కాళేశ్వరం లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు గురించి కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎన్నికల ప్రచారం చేయాల్సిన దుస్థితి వచ్చిందంటే కాంగ్రెస్ ఏ స్థాయిలో బీఆర్ఎస్ ను  డిఫెన్స్ లోకి నెట్టేసిందో అర్ధం చేసుకోవచ్చని పరిశీలకులు అంటున్నారు.

No comments:

Post a Comment