మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొండా సురేఖ
: ఎక్స్‌గ్రేషియా పెంచే ఫైలుపై తొలి సంతకం
హైదరాబాద్: తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ ఆదివారం రాష్ట్ర సచివాలయంలో బాధత్యతలు స్వీకరించారు. అనంతరం కీలక ఫైలుపై సంతకం చేశారు. వన్యప్రాణుల దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పెంచే ఫైలుపై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) తొలి సంతకం చేశారు. దీనిపై త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి. ప్రస్తుతం రూ. 5 లక్షలుగా ఉన్న పరిహారం రూ. 10 లక్షలకు ప్రభుత్వం పెంచనుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడుతాయని మంత్రి సురేఖ తెలిపారు. మరోవైపు, వివిధ కార్యక్రమాలు, ఉత్సవాలకు ఏనుగులను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునేందుకు అనుమతిస్తూ మరో ఫైల్ పై ఆమె సంతకం చేశారు. నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము: ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అనంతరం అటవీ శాఖపై మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. హరితహారం ద్వారా ఇప్పటి వరకు జరిగిన పచ్చదనం పెంపు, వచ్చే ఏడాది లక్ష్యాలపై మంత్రి ఆరా తీశారు. కంపా పథకం ద్వారా చేపట్టిన పనులను, నిధుల వివరాలను మంత్రి కొండా సురేఖ అడిగి తెలుసుకున్నారు. అటవీ, దేవాదాయ శాఖలో ప్రస్తుత సిబ్బంది, కొత్తగా నియామకాలకు ఉన్న అవకాశాలను అధికారులు తెలిపారు. త్వరలోనే శాఖల వారీగా పూర్తి స్థాయి సమీక్షా సమావేశాలు చేపడతామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో తయారు చేసిన పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు. కొండా సురేఖ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు, అటవీ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది హాజరై అభినందనలు తెలియజేశారు.
By Rajashekhar
No comments:
Post a Comment