Monday, 25 May 2026

నల్గొండ జిల్లాలో అత్యధికంగా 937 గ్రామ సమాఖ్య భవనాలకు స్థలాలను సేకరించి 48 భవనాల నిర్మాణం పూర్తి చేసినందుకుగాను రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి

 




నల్గొండ జిల్లాలో అత్యధికంగా 937 గ్రామ సమాఖ్య భవనాలకు స్థలాలను సేకరించి 48 భవనాల నిర్మాణం పూర్తి చేసినందుకుగాను రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా స్వయం సహాయక మహిళా సంఘాన్ని అభినందించారు
.

                ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళ వారోత్సవాన్ని పురస్కరించుకుని

సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుండి రాష్ట్రవ్యాప్తంగా 8 వేల మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. అంతేకాక మహిళలకు పంపిణీ చేసే ఇందిరమ్మ చీరల నూతన డిజైన్ (చిలకపచ్చ డిజైన్) ను వర్చువల్ గా ఆవిష్కరించారు.

         ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధికంగా 937 గ్రామ సమాఖ్య భవనాలకు స్థలాలను సేకరించడమే కాకుండా 48 భవనాల నిర్మాణాలు కూడా పూర్తి చేయడం పట్ల ఆయన జిల్లా మహిళా సమాఖ్య ను అభినందిస్తూ అధ్యక్షురాలు మాధవితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి మాట్లాడారు. 937  గ్రామ సమాఖ్య భవనాల స్థల సేకరణ  ఎలా చేశారో వివరాలు తెలియజేస్తే ఇతర జిల్లాలలో కూడా అదేవిధంగా స్థల సేకరణ చేస్తారని కోరగా, ఇందుకు నీలగిరి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మాధవి స్పందిస్తూ జిల్లాలో జిల్లా మహిళా సమాఖ్య కింద 38 మండల సమాఖ్యలు ఉన్నాయని, 1144 గ్రామ సమాఖ్యలు ఉండగా, మూడు లక్షల మంది సభ్యులు ఉన్నారని తెలిపారు .రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సమాఖ్య భవనాల నిర్మాణానికి ఆదేశం ఇవ్వగా, నెల రోజుల్లో 937 గ్రామ సమాఖ్య భవనాలకు స్థల సేకరణ చేయడం జరిగిందని చెప్పారు.

          ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాధవి తో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం పై అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరారు. ఇటీవల కొంతమంది ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేయాలని కోరుతున్నారని, అందువల్ల ఈ విషయంపై స్పష్టంగా అభిప్రాయం చెప్పమని కోరగా మాధవి మాట్లాడుతూ మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం చాలా బాగుందని, ముఖ్యంగా చిన్న చిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు, ఉపాధి చేసుకునే వారికి, విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతున్నదని ,ఉచిత బస్సు వల్లనే వారు చేసుకునే ఉద్యోగంలో సగం జీతం మిగులుతుందని తెలిపారు.

      అనంతరం  రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ  ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం ఉచిత బస్సు కారణంగా అమ్మాయిలు మధ్యలో బడిమానేసే వారి సంఖ్య తగ్గిపోయిందని, అలాగే తల్లితండ్రులకు ప్రయాణ భారం తగ్గిందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధి కోసం వెళ్లే  మహిళకు ఒక్కొక్కరికి ప్రతి నెల 8 నుండి పదివేల వరకు మిగులుతున్నదని, అందువల్ల ఈ అంశంపై గ్రామ సమాఖ్య సమావేశాలలో చర్చించాలని  చెప్పారు.అంతేకాక గ్రామ సమాఖ్య సమావేశాల్లో పంట మార్పిడి పై అవగాహన కల్పించాలని, సేంద్రియ ఎరువులు ,క్యాన్సర్ వంటి వాటిపై కూడా మాట్లాడాలని సీఎం చెప్పారు. తెలంగాణలో ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని, మహిళలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా నిలబడుతుందని అన్నారు. మహిళలు ఆడాని,అంబానితో పోటీ పడేలా వారికి పెట్రోల్ బంకులను అప్పగించడం జరిగిందని ,అలాగే మహిళలకు రుణాలు ఇవ్వడం ద్వారా ధాన్యం కొనుగోలుతో పాటు, గోదాముల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని ,ప్రతి మండలంలో పెద్ద గోడౌన్ కట్టించి భవిష్యత్తులో ధాన్యాన్ని భద్రపరిచి మిల్లర్లు అక్కడికె వచ్చి తీసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకుగాను ప్రతి మండలంలో రెండు నుండి నాలుగు ఎకరాల వరకు భూసేకరణ చేయాలని, అవసరమైన లాజిస్టిక్స్ ఏర్పాటు కల్పించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు  అలాగే మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయడమే కాకుండా, రుణం ఇస్తామని, రాష్ట్రం నలుమూలల మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేయడం ద్వారా మహిళలు ఆర్థికంగా మరింత ఎదిగేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.

            

        వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా మహిళా సమాఖ్య భవనాలు మంజూరు చేయడం సంతోషమని ,జిల్లాలో 937 భవనాలకు స్థల సేకరణ చేయడమే కాకుండా, 48 పూర్తి చేయడం అభినందనీయమని అన్నారు. ఇతర భవనాలను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అన్నారు. వీటితోపాటు ఫుడ్ ప్రాసెసింగ్, గోడౌన్లు నిర్మాణం , పాఠశాల విద్యార్థుల యూనిఫాం త్వరలోనే వస్తాయని, వాటిని కూడా అందించేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. మహిళలు ఎదిగేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని, వీటన్నిటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్ ఎల్బీసీలో ఏర్పాటు చేయనున్న పెట్రోల్ బంక్ ద్వారా మరింత అభివృద్ధి చెందవచ్చు అని, అక్కడే సూపర్ బజార్ కూడా నిర్మాణం చేస్తున్నందున నల్గొండ మహిళా సమాఖ్యలకు ఎంతో మేలుకు కలుగుతుందని అన్నారు. అదే సమయంలో మహిళలు తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించాలని , తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించని శాతాన్ని తగ్గించాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పంటల మార్పిడి, సేంద్రీయ వ్యవసాయం, తదిత అంశాలపై చర్చించాలని, మహిళలు వ్యాపారవేత్తలుగా ఆలోచించాలని చెప్పారు.

          రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ,రాష్ట్ర సీనియర్ అధికారులు మాట్లాడారు.

          జిల్లా నుండి డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి, మహిళా సమాఖ్య అధ్యక్ష ,కార్యదర్శులు, తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home