Saturday, 9 May 2026

అంగన్‌వాడీల్లో ‘ఫ్యాన్–ట్యూబ్’ పేరిట దోపిడీ!





 అంగన్‌వాడీల్లో ‘ఫ్యాన్–ట్యూబ్’ పేరిట దోపిడీ!

₹20 లక్షల టెండర్… ₹10 లక్షలు మింగేసినట్టు ఆరోపణలు

 ఒక మోడల్ కి బదులు తక్కువ ధర మోడల్ సరఫరా – సప్లయర్‌తో చేతులు కలిపిన అధికారులేనా?

నల్గొండ, శంఖారావం:

చిన్నారుల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమమే అవినీతి అడ్డాగా మారిందా? అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఎండాకాలం ఇబ్బందులు లేకుండా ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు ఏర్పాటు చేయాలన్న జిల్లా కలెక్టర్ సదుద్దేశాన్ని కొందరు తమ జేబులు నింపుకునేందుకు వాడుకున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

శాఖా బడ్జెట్ లేనప్పటికీ మినరల్ ఫండ్స్ నుంచి నిధులు మళ్లించి అంగన్‌వాడీ కేంద్రాలకు హై స్పీడ్ ఫ్యాన్లు, 3-ఇన్-వన్ LED ట్యూబ్‌లైట్లు సరఫరా చేయాలంటూ టెండర్ పిలిచారు. టెండర్ ప్రక్రియ, ఆర్డర్ జారీ వరకూ అన్నీ నిబంధనల ప్రకారమే జరిగినట్టు చూపించారు. కానీ అసలు దోపిడీ సప్లై దశలోనే మొదలైందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

పేరు ఒక్కటే… సరుకు వేరే!

టెండర్‌లో పేర్కొన్న క్రాంప్టన్ హై స్పీడ్ ఫ్యాన్లకు బదులుగా  క్రాంప్టన్ సివిడ్ మోడల్ నార్మల్ సీలింగ్ ఫ్యాన్లు,

అలాగే 3-ఇన్-వన్ LED ట్యూబ్‌లైట్ల స్థానంలో సాధారణ ట్యూబ్‌లైట్లు అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసినట్లు సమాచారం. కొన్ని చోట్ల అయితే టెండర్‌లో లేని ఇతర కంపెనీల ట్యూబ్‌లైట్లు పెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సగం సొమ్ము స్వాహా?

ఈ నాసిరకం సరఫరాతో ₹20 లక్షల టెండర్‌లో సుమారు ₹10 లక్షల మేర ప్రభుత్వ సొమ్ము గాలిలో కలిసిపోయిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇది కేవలం సప్లయర్ ఒక్కడి పని కాదని, కొంతమంది అధికారుల సహకారం లేకుండా ఇంత పెద్ద కుంభకోణం జరగదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పిల్లల సంక్షేమమా? లేక కొందరి కమీషన్లా?

పిల్లల కోసం తీసుకున్న నిర్ణయాన్ని కొంతమంది అధికారులు, సప్లయర్లు కలిసి కమీషన్ల పండుగగా మార్చేశారన్న విమర్శలు స్థానికంగా వెల్లువెత్తుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో నాణ్యమైన వసతులు కల్పించాల్సిన బదులు, చెత్త సరుకుతో ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారన్న ఆరోపణలు ప్రజలను ఆగ్రహానికి గురి చేస్తున్నాయి.

ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారంపై కళ్లెత్తి చూడాలని,

సప్లై చేసిన సామగ్రిపై తక్షణ ఫిజికల్ వెరిఫికేషన్,

టెండర్ నిబంధనలతో సరఫరా సరుకును పోల్చి విచారణ,

అవినీతికి పాల్పడిన సప్లయర్‌తో పాటు సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

లేకపోతే… పిల్లల పేరుతో జరిగిన ఈ దోపిడీకి న్యాయం జరగదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

— శంఖారావం ప్రతినిధి

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home