కాంగ్రెస్ పార్టీలో తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రస్థానం
కాంగ్రెస్ పార్టీలో తాటిపర్తి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రస్థానం లోతుగా విశ్లేషిస్తే తాజా పరిస్థితికి ఆయన అవలంభించిన విధానాలే కారణమని అనుచరులు గుసగుసలు పెడుతున్నారు. 1980లో మల్యాల సమితి అధ్యక్షుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన జీవన్ రెడ్డి. 1983లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రి అయ్యారు. నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ అనంతరం జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించిన జీవన్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. 2014 నుంచి 2024 వరకు రాష్ట్రంలో కొనసాగిన కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేక పథకాలపై జీవన్ రెడ్డి చట్టసభలలో, బయట బలంగా గొంతుక వినిపించి కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుతూ, క్యాడర్ లో భరోసా కల్పించారు. జీవన్ రెడ్డి మంత్రిగా కొనసాగినా… ఎమ్మెల్యేగా ఓడినా, గెలిచినా ప్రజాక్షేత్రంలోనే ఉంటాడు అనే పేరుంది.
ఇదంతా నాణేనికి ఒకవైపు మరోవైపు పరిశీలిస్తే జీవన్ రెడ్డి సంకుచిత రాజకీయ నాయకుడని జగిత్యాల రాజకీయాలు తెలిసిన వారు పెదవి విరుస్తారు. నాలుగు దశాబ్దాల రాజకీయంలో ఆయన ఎంతమంది నాయకులను తీర్చి దిద్దారని ప్రశ్నిస్తే అనుచరుల నుంచి మౌనమే సమాధానం వస్తుంది. మున్సిపల్ చైర్మన్ పదవి బిసిలకు ఇచ్చినట్టే ఇచ్చి చైర్మన్ మెట్ట భట్టిని రాజకీయంగా ఎదగకుండా చేశారని ఆరోపణలు ఉన్నాయి.
బిసి కులాలు బలంగా ఉండే నియోజకవర్గంలో జీవన్ రెడ్డి ఏనాడు వారికి ప్రాధాన్యత ఇవ్వలేదనే విమర్శ ఉంది. మున్సిపల్ చైర్మన్ గా అవకాశం వస్తే ఆయన తమ్ముడి భార్య విజయలక్ష్మికే ఆ పదవి కట్టబెట్టారని. వారి ఏలుబడిలో పట్టణంలో నిలువు దోపిడీ జరిగిందని పట్టణంలో టాక్ ఉంది. 2024లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని తన మరదలు విజయలక్ష్మికే కట్టబెట్టారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవి వస్తుందని ఆశించిన మాజీ కౌన్సిలర్లు, పార్టీలోని బిసి మహిళా నేతలకు ఆశాభంగం తప్పలేదు.
చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒకానొక దశలో పార్టీ నేత బండ శంకర్ కు ఇప్పించే అవకాశం వచ్చినా జీవన్ రెడ్డి తనదైన శైలిలో అడ్డుపడ్డారని పార్టీ నేతలు ఇప్పటికీ చెప్పుకుంటారు. నలభై ఏళ్ళుగా పార్టీలో వెన్నంటి సాగుతున్న నేతల్లో ఒకరిద్దరు తప్పితే ఎవరు ఆర్థికంగా నిలదోక్కుకోలేదని సీనియర్ నేతలు వాపోతున్నారు. ఆ ఒకరిద్దరు కూడా వారి సొంత వ్యాపారాల పరంగానే ఎదిగారని చెప్పుకుంటారు.
జీవన్ ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో జగిత్యాల కాంగ్రెస్ నుంచి ఒక్క నేత కూడా పార్టీలో రాష్ట్ర స్థాయికి ఎదగలేదు. జీవన్ రెడ్డి తర్వాత ఎవరు అనేది ఎప్పుడు ప్రశ్నార్థకమే? రాష్ట్రస్థాయి కార్పోరేషన్ పదవుల ముఖం జగిత్యాల కాంగ్రెస్ నేతలు చూసి ఎరుగరు. జగిత్యాల నియోజకవర్గం నుంచి మరో నేత ఎదగకుండా చేశారని ఆరోపణ ఉంది.
కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయంలో మంత్రి పదవి ఖరారైంది. అనుచరవర్గం హంగామాగా హైదరాబాద్ వెళ్ళే సరికి సీన్ మారింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు అందరు ఏకతాటి మీదకు వచ్చి మాలో ఎవరికి ఇచ్చినా పర్వాలేదు. జీవన్ రెడ్డికి ఇవ్వొద్దు అనటంతో మంత్రి పదవి నేరెళ్ళ ఎమ్మెల్యే పాటి రాజంకు దక్కింది.
దివంగత నేత రత్నాకర్ రావుతో ఏనాడు సఖ్యత లేదు. ప్రస్తుత మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లతో కూడా సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో జిల్లాలో జీవన్ రెడ్డి తరపున మాట్లాడే నేత లేకుండా పోయారు.
గతంలో చొప్పదండి ఎమ్మెల్యే టికెట్ కోడూరి సత్యనారాయణ గౌడ్ కు ఇప్పించిందే జీవన్ రెడ్డి అంటారు. వరుస ఓటములపాలైన ప్రస్తుత ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఎమ్మెల్యే టికెట్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం టికెట్ కు సహకరించింది జీవన్ రెడ్డి అని పార్టీ నేతలు చెపుతున్నారు. జగిత్యాలలో నాయకత్వాన్ని ప్రోత్సహించని జీవన్… ఇతర నియోజకవర్గాల వారికి దన్నుగా నిలిచారు. క్లిష్ట సమయంలో జీవన్ రెడ్డికి వారు అండగా మాట్లాడకపోవటం ద్రోహమని విమర్శిస్తున్నారు.
జగిత్యాల అభివృద్దిలో జీవన్ రెడ్డి పాత్ర పరిమితమనే వాదన ఉంది. పట్టణంలోని యావర్ రోడ్డు విస్తరణ ప్రహాసనంగా మారింది. పట్టణ విస్తరణ జరుగుతున్నా ఒక ప్రణాళిక అంటూ లేదు. గ్రామీణ స్థాయి రోడ్లను తలపించే పట్టణ బైపాస్ రోడ్ల దుస్థితికి కారణం ఎవరు అని ప్రశ్నిస్తే జీవన్ రెడ్డి కూడా ఒకరని ఆరోపణలు ఉన్నాయి. అయితే కొండగట్టు JNTU కళాశాల, జగిత్యాల మామిడి మార్కెట్, న్యాక్ నైపుణ్య శిక్షణా కేంద్రం, పొలాస వ్యవసాయ కళాశాల ఏర్పాటు జీవన్ రెడ్డి పుణ్యమే అని ఆయన అనుచర వర్గం వాదిస్తున్నారు.
పౌర హక్కుల సంఘం న్యాయవాదిగా ప్రజా క్షేత్రంలోకి వచ్చిన జీవన్ రెడ్డి నాయకుడిగా ఎదిగినా ప్రజల మనసు దోచుకున్న నేతగా నిలబడలేకపోయారనే అపవాదు ఉంది. కాంగ్రెస్ హై కమాండ్ మూడు సంవత్సరాల క్రితం సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవికి ఎంపిక చేసిన సందర్భంలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డిని వ్యతిరేకించారు. బహిరంగంగా, ప్రచార సాధనాలలో విమర్శలు గుప్పించారు. జీవన్ రెడ్డి మాత్రమే రేవంత్ రెడ్డికి అండగా నిలిచారు.
No comments:
Post a Comment