రాజకీయాలకతీతంగా జిల్లా అభివృద్ధి కోసం పాటుపడాలి
– పంద్రాగస్టు లోపే రుణమాఫీ
– రైతు భరోసా పై త్వరలోనే నిర్ణయం
– మిషన్ భగీరథ సమస్యలను తొలగించేందుకు అధికారులు గ్రామాలలో పర్యటించాలి
– మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
– మిషన్ భగీరథ, వ్యవసాయం, విద్య, విద్యుత్ పై సాగిన చర్చ
– భారీగా హాజరైన సభ్యులు
– సభ దృష్టికి పలు సమస్యలను తీసుకువచ్చిన ఎమ్మెల్యేలు, జడ్పిటిసిలు, ఎంపీపీలు
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
రాజకీయాలకతీతంగా నల్గొండ జిల్లా అభివృద్దే ధ్యేయంగా అందరూ కలిసి పనిచేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం నల్గొండ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ ఛైర్మెన్ బండా నరేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మిషన్ భగీరథ, వ్యవసాయం, విద్యుత్, విద్య తదిత అంశాలపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చర్చించింది. కాగా జూలై 4 తో ప్రస్తుత జిల్లా పరిషత్తు కాలపరిమితి ముగియనునందున శనివారం నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి సభ్యులందరూ పెద్ద ఎత్తున హాజరయ్యారు.ముందుగా సమావేశానికి జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి అధ్యక్షత వహించి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలు ఏలాంటి ఒడిదుడుకులు లేకుండా జిల్లా పరిషత్తు కార్యక్రమాలను, సమావేశాలను సజావుగా నిర్వహించడంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. మిషన్ భగీరథ పై జరిగిన చర్చ సందర్భంగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటికి మిషన్ భగీరథ తాగు నీరు వచ్చేలా చూడాలని, ఇందుకు మిషన్ ఇంజనీరింగ్ అధికారులు గ్రామాలలో తిరిగి సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలని, అవసరమైతే శాసనసభ్యుల నిధుల ద్వారా చిన్నచిన్న సమస్యలను అధిగమించాలని సూచించారు. వ్యవసాయంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ ఆగస్టు 15లోగా రాష్ట్రంలో సుమారు 31 వేల కోట్ల రూపాయలను రైతుల రుణమాఫీ చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించినట్లు వెల్లడించారు. అదేవిధంగా రైతు భరోసా పై సైతం త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసింది గతంలో ఏ ప్రభుత్వం లేదని అన్నారు.
విద్యుత్ పై జరిగిన చర్చ సందర్భంగా సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు తదితర వాటికోసం ఇదివరకే జిల్లాకు 11 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, ఇటీవల మరో 7 కోట్ల రూపాయలు రానున్నాయని, ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్లు, ఓవల్లోడు సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. అలాగే అడిషనల్ బడ్జెట్ ను ప్రతిపాదించాలని విద్యుత్తు ఎస్ఈని ఆదేశించగా, అదేవిధంగా విద్యుత్ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సభ్యులతో కోరారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన చోట సబ్ స్టేషన్ లను ఏర్పాటు చేసే విధంగా విద్యుత్ అధికారులు దృష్టి సారించాలని సూచించారు.ఇరిగేషన్ అంశంపై మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేయడమే తమ ధ్యేయమని, జిల్లాలో ఉన్న పంచాయతీ రోడ్లన్నింటిని ఆర్ అండ్ బి రోడ్లుగా మార్చడం జరిగిందని, అదేవిధంగా సబ్ స్టేషన్లు, ప్రాజెక్టులను పూర్తి చేస్తామని వెల్లడించారు. పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరు పని చేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ మిషన్ భగీరథకు సంబంధించిన పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లింపులపై అధికారులు స్పష్టత నివ్వాలని అన్నారు. జిల్లాలో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సాగునీటి ప్రాజెక్టుల మంత్రిగా ఉమ్మడి జిల్లాకు చెందిన ఉత్తంకుమార్ రెడ్డిలు ఉన్నందున జిల్లాలో పెండింగ్లో ఉన్న గొట్టిముక్కల, సింగరాజుపాలెం పెళ్లిపాకుల రిజర్వాయర్లు పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి రిజర్వాయర్లు, కెనాల్లాను పూర్తిచేయడానికి చొరవ చూపాలని మంత్రిని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సమిష్టిగా జిల్లా అభివృద్ధికి కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ జిల్లాలో సరిపోయినన్ని ఎరువులు, విత్తనాలు ఉన్నాయని, అయితే ఆయా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు సరైన విధంగా ముందే ప్రతిపాదనలు రూపొందించుకొని సమస్యలు లేకుండా చూసుకుంటే సరిపోతుందని తెలిపారు. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్తు ఇస్తున్నదని, అంతేకాక రైతు రుణమాఫీ, రైతు భరోసా తో సహా ఇతర హామీలన్నీటిని నెరవేర్చినందుకు ముందుకెళ్తున్నట్లు తెలిపారు.తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు మాట్లాడుతూ తన నియోజకవర్గం పరిధిలోకి వచ్చే శాలిగౌరారం తదితర మండలాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పనితీరును మెరుగుపరుచుకోవాలని, పంచాయతీరాజ్ రోడ్లు కొన్ని చోట్ల కంకర తేలి ఉన్నాయని వాటిని బాగు చేయాలని, జాతీయ రహదారి నుండి ఇరుకులపాడు రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని, శాలిగౌరారం చెరువు కట్టను పటిష్టం చేసే పనులు చేపట్టాలని కోరారు.
దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ మాట్లాడుతూ విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు ప్రతి నియోజకవర్గానికి రెండు కోట్ల రూపాయలు ఇప్పించే విధంగా మంత్రి చొరవ చూపాలని, అలాగే విద్యుత్ లైన్ల మార్పుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. శాసనమండలి సభ్యులు నర్సిరెడ్డి మాట్లాడుతూ లో వాల్టెజ్ సమస్యలు, విద్యుత్ సమస్యలు అన్నింటిని సరైన విధంగా అంచనా వేసి వెంటనే వాటిని తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని, పాఠశాలలకు సంబంధించి మన ఊరు- మనబడి లో చేపట్టి మధ్యలో ఆగిపోయిన పనులను పూర్తిచేయాలని, ప్రతి పాఠశాలకు పారిశుధ్యం, శుభ్రపరిచేందుకు సిబ్బందిని నియమించాలని, విద్యుత్ బిల్లులు, శానిటేషన్ కు స్కూల్ గ్రాంట్ మంజూరు చేయాలని, కేజీబీవీ సమర్థవంతంగా పనిచేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.ఈ సందర్భంగా పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు మాట్లాడుతూ గ్రామాలలో ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించాలని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. కాగా సమావేశానికి హాజరైన జడ్పిటిసిలు ఎంపీపీ లను రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు శాలువా, జ్ఞాపికలతో సన్మానించారు.
కలెక్టర్.. ఎస్పీలను అభినందించిన మంత్రి…
గత కలెక్టర్ హరిచంద్ర దాసరి, ఎస్పీ చందనా దీప్తిని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొనియాడారు. ఇద్దరు మహిళ అధికారులే అయినప్పటికీ ఎంపీ, ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎక్కడ ఎలాంటి అవాంతరాలకు తావివ్వకుండా వారి విధులను విజయవంతంగా నిర్వర్తించాలని అన్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో భువనగిర పార్లమెంట్ సభ్యులు ఛామల కిరణ్కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జెడ్పిసిఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, డిప్యూటీ సీఈవో శ్రీనివాసరావు, జెడ్పిటిసిలు, ఎంపీపీలు, జిల్లా స్థాయి అధికారులు, తదితరులు ఈ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment