Sunday, 27 April 2025

భూ భారతి చట్టాన్ని అధికారులు చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు:జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

     భూ భారతి చట్టంలో అధికారాలను వికేంద్రీకరించడం వల్ల పారదర్శకతతో చట్టాన్ని అమలు చేసే అవకాశం ఉందని నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు .ధరణిలో అధికారాలన్నీ ఒకేచోట కేంద్రీకృతం కావటం వల్ల అధికారాలు దుర్వినియోగం అవ్వడమే కాకుండా రైతుల సమస్యలను పరిష్కరించుకునేందుకు తహసిల్దార్, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్, సిసిఎల్ఏ కార్యాలయాలు, కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ రైతులు తిరగాల్సి వచ్చేది అన్నారు.


       భూ భారతి చట్టంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా ఆదివారం అయన నల్గొండ జిల్లా ,మాడుగుల పల్లి మండల కేంద్రంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.


        ధరణిలోని సమస్యలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు ఉండకూడదు అన్న ఉద్దేశంతో అనేకమంది మేధావులతో చర్చించి సమావేశాలు ఏర్పాటు చేసి చిత్తశుద్ధితో  భూ భారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. భవిష్యత్తులో భూ భారతి చట్టాన్ని  సైతం సవరించే వెసులుబాటును చట్టంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు .భూ భారతి చట్టం వల్ల రైతుల సమస్యలన్నీ తీరిపోతాయని ,ముఖ్యంగా తహసిల్దార్ వద్దనే 80% సమస్యలు పరిష్కరించుకోవచ్చని ,ఒకవేళ ఎవరికైనా భూ సమస్యలు ఉన్నట్లయితే తీర్చేందుకు తాము ఎల్లప్పుడూ ముందుంటామని వెల్లడించారు.


        శాసనమండలి సభ్యులు శంకర్ నాయక్ మాట్లాడుతూ మాడుగులపల్లి మండలంలో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, ముఖ్యంగా వైవాటా, మిస్సింగ్ సర్వే నంబర్ల సమస్యలు ఉన్నాయని, ధరణిలో ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారం రాలేదని, రైతులు పడుతున్న బాధలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో భూ భారతి చట్టాన్ని తెచ్చిందని తెలిపారు. గతంలో అసైన్మెంట్ భూములకు పరిష్కారం దొరకలేదని, భూ భారతి చట్టంలో  వికేంద్రీకరణ ద్వారా ప్రజల ముందుకే పరిపాలన వచ్చిందని, అలాగే అప్పీల్ అధికారం కూడా భూ భారతిలో ఉందని ,ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని, జూన్ 2 నుండి భూ భారతి పోర్టల్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. భూ భారతి తో పాటు, రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం, రైతుబంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ, కులగనన, వర్గీకరణ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని వెల్లడించారు.


          జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి




 మాట్లాడుతూ భూ భారతి చట్టాన్ని అధికారులు చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు .రైతు మోకా మీద ఉండడంతో పాటు, సరైన ఆధారాలు ఉంటే భూములకు ఎలాంటి డోకా లేదని అన్నారు. ప్రతి గ్రామపంచాయతీకి గ్రామ పాలనాధికారి తో పాటు, ప్రతి రెవిన్యూ విలేజ్ కు లైసెన్స్డ్ సర్వేయర్లను ప్రభుత్వం నియమించనున్నదని తెలిపారు. గతంలో పహాని పోతే సమస్య పరిష్కారం అయ్యేది కాదని, భూ భారతిలో ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ,అయితే రైతులు సరైన రికార్డులు ఇవ్వడంతో పాటు ,మోక మీద ఉండాలని తెలిపారు. అలాగే రుణాలు పొందేందుకు రైతులు సాగు చేసుకుంటున్న భూముల ఖాతాలో సంతకం చేసి ఉండాలని, రుణం పొందేందుకు ఎలాంటి భూమి పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఆన్లైన్ పోర్టల్ లో ఉన్న వివరాలు ఆధారంగా రుణాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మాడుగులపల్లి మండలానికి త్వరలోనే కేజీబీవీ భవనం, తహసిల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రానున్నాయని చెప్పారు.


       మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, భూ భారతి చట్టంపై అవగాహన కల్పించారు.


         తహసిల్దార్ అశోక్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి ,మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యం, మాజీ జడ్పిటిసి మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు .


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home