ACB అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిన గచ్చిబౌలి ఏడీఈ సతీష్
అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిన గచ్చిబౌలి ఏడీఈ సతీష్
శేరిలింగంపల్లి : ట్రాన్స్ఫార్మర్ల మంజూరు కోసం లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిన గచ్చిబౌలి ఏడీఈ సతీష్ అనేక అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారుల దృష్టికి వచ్చింది. శుక్రవారం తన కార్యాలయంలో ఓ కాంట్రాక్టర్ వద్ద నుండి రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకున్న ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలోని అధికారుల బృందం విచారణ చేపట్టింది. ఏడీఈ సతీష్ కార్యాలయంతో పాటు మాదాపూర్ అయ్యప్ప సోసైటీలోని ఆయన నివాసం, అతని సన్నిహితుల ఇళ్లల్లోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సతీష్ కు ఆదాయానికి మించి అక్రమాస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారుల దృష్టికి వచ్చింది.
సుమారు రూ.100 కోట్ల వరకు అక్రమాస్తులు ఉన్నాయని, నగరంలో పలుచోట్ల కమర్షియల్ కాంప్లెక్స్ లు ఉన్నాయని, వాటి ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం వస్తుందని తెలుస్తుంది. గతంలో చర్లపల్లిలో ఏడీఈగా పనిచేసిన సతీష్ పెద్ద ఎత్తున పైరవీలు చేసుకుని గత 6 నెలల క్రితమే గచ్చిబౌలి ఏడీఈగా వచ్చారని కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. వచ్చి రాగానే కార్యాలయంలో వాస్తు బాగాలేదని, ఇప్పటికే గచ్చిబౌలిలో ఇద్దరు అధికారులు ఏసీబీకి పట్టుబడిన నేపథ్యంలో తనకు అలాంటి పరిస్థితి రావద్దనే ఉద్దేశ్యంతో సుమారు రూ.3 లక్షల వరకు వెచ్చించి మార్పులు చేర్పులు చేసుకున్నట్లు తెలుస్తుంది. గచ్చిబౌలి ఏడీఈగా వచ్చేందుకు భారీగా డబ్బులు ఖర్చు చేసిన సతీష్ వాటిని ఏడాదిలోగా తిరిగి సంపాదించడమే టార్గెట్ గా పెట్టుకుని లంచావతారం ఎత్తినట్లువిశ్వసనీయ సమాచారం. సతీష్ అక్రమాస్తుల పై ఏసీబీ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home