Friday, 10 October 2025

ఏపీలో పోలీసు ఉద్యోగాల జాతర - ఒకేసారి 11,000+, ఏ కేటగిరీలో ఎన్ని..!!


 ఏపీలో పోలీసు ఉద్యోగాల జాతర - ఒకేసారి 11,000+, ఏ కేటగిరీలో ఎన్ని..!!

   

ఏపీలో కొత్త ఉద్యోగాల భర్తీ పైన కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే మెగా డీఎస్సీ పోస్టులు భర్తీ ప్రక్రియ పూర్తయింది. రానున్న జనవరిలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నవంబర్ లో టెట్ నిర్వహించనుంది. ఏపీపీఎస్సీ సైతం నోటిఫికేషన్ల జారీ పైన కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో పోలీసు శాఖలో ఖాళీల భర్తీ పైన కీలక అడుగు పడింది. దాదాపు 11 వేల పోస్టులు భర్తీ కానున్నాయి. ఖాళీల వివరాలపైనా స్పష్టత వచ్చింది.


ఏపీ పోలీసు శాఖలో ఖాళీల భర్తీ పైన కీలక అడుగు పడింది. పోలీసు శాఖలో ఖాళీల భర్తీ పైన డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా ప్రభుత్వానికి లేఖ రాసారు. పెరుగుతున్న నేరాల నియంత్రణలకు పోలీసు సిబ్బంది ఇంకా అవసరమని వివరించారు. దీంతో.. భర్తీకి అవకాశాలు పరిశీలించగలరని ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు పోలీసు శాఖలో భర్తీ చేయాల్సిన పోస్టుల వివరాలతో ఆయన లేఖ రాశారు. పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో సివిల్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వు, స్పెషల్‌ ఆర్మ్‌డ్‌ రిజర్వు, ఏపీఎస్పీ, సీపీఎల్‌, పీటీఓ, కమ్యూనికేషన్స్‌లో ఈ ఏడాది ఆగస్టు 31నాటికి 11,639 ఖాళీలు చూపించారు. సివిల్‌ పోలీస్‌ విభాగంలో 315 ఎస్‌ఐలు, 3,580 సివిల్‌ కానిస్టేబుల్‌, 96 ఆర్ఎస్ఐ పోస్టులు, 2,520 ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన రాగానే రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశముంది. కాగా, వైసీపీ ప్రభుత్వంలో 2022 నవంబరులో నోటిఫికేషన్‌ జారీ చేసినా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయాలేదు. దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చాక ఇటీవలే 6,100 కానిస్టేబుల్‌ పోస్టులు భర్తీ చేసింది. ఇప్పుడు ఏకంగా 11వేలకు పైగా పోస్టులతో మరో నోటిఫికేషన్‌ విడుదల చేస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలతో పాటుగా పోలీసు శాఖ పైన ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రభుత్వం ఆమోదం లభించిన వెంటనే నోటిఫికేషన్ విడుదల కానుంది. అర్హతలు, వయసు పరిమితి, పరీక్షా విధానం వంటి అంశాలు పూర్వ నియామకాల మాదిరిగానే ఉండే అవకాశముంది. జనవరి సంక్రాంతి వేళ ఈ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home