Wednesday, 4 December 2024

రోశయ్య గారితో నాది గురుశిష్యుల అనుబంధం..మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

 *కీ.శే. స్వర్గీయ కొనిజేటీ రోశయ్య గారి వర్ధంతి సభలో గౌరవ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి



గారి కామెంట్స్*

కొణిజేటి రోశయ్య గారు 1933 జూలై 4న ఆదెమ్మ, సుబ్బయ్య దంపతులకు (గుంటూర్ జిల్లా)జన్మించారు
విద్యార్ధి దశనుంచే రాజకీయాల్లో అడుగుపెట్టారు.
ఏ రాజకీయ అండలేకుండా.. స్వశక్తితో ఎదిగిన అరుదైన నాయకుడు రోశయ్య గారు
1968 లో ఎమ్మెల్సీగా ప్రస్థానం మొదలు పెట్టి 2016 లో గవర్నర్ గా ప్రస్థానం ముగిసే వరకు దాదాపు 48 యేండ్లు రాజకీయాల్లో ఉన్నారు. 
రోశయ్య గారితో నాది దాదాపు ముప్పై యేండ్ల అనుబంధం..

అక్కడ ఆంధ్రప్రదేశ్ లో గానీ, ఇక్కడ తెలంగాణలో గానీ రాజకీయ నాయకుల భాష దిగాజారిపోయిందని ప్రజలు, సీనియర్ లీడర్లుగా మేము మథనపడుతున్న ఈ సందర్భంలో.. రోశయ్య గారిని స్మరించుకునే సందర్భం రావడం... అరుదైన విషయం.
ఆయనకు కోపం వచ్చేది.. కానీ పగ ఉండేది కాదు.. విలువలతో కూడిన విమర్శలు చేయడం ఒక్క రోశయ్య గారికే చెల్లిందంటే అతిశయోక్తి కాదు.

రోశయ్య గారు ఎప్పుడు కలిసిన ఒక మాట చెప్తుండేవారు.. రాజకీయాలు వ్యక్తిగతం కావు.. ప్రజలు ఇచ్చిన నమ్మకాల్ని నిలబెట్టే బాధ్యత.. ఇందులో వ్యక్తిగత రాగద్వేషాలకు తావులేదు..

ప్రజలకు మంచి చేస్తే ఎవ్వరినైన అభినందించు.. ప్రజలకు చెడు చేస్తే ఎవ్వరినైనా వ్యతిరేఖించు.. అంతేకానీ.. పగ పెంచుకోకు అనేవారు.. అప్పుడే ప్రజలు నిన్ను గౌరవిస్తారని చెప్పేవారు.

బహుశా.. సమకాలిన రాజకీయాల్లో రోశయ్యగారు నిర్వహించినన్ని పదవులు, బాధ్యతలు ఏ రాజకీయ నాయకుడు నిర్వహించి ఉండకపోవచ్చు..

ఆయన్న అసెంబ్లీకి వెళ్లారు, మండలికి వెళ్లారు, పార్లమెంట్ కు వెళ్లారు. ముఖ్యమంత్రి అయ్యారు, గవర్నర్ అయ్యారు.. దాదాపు నాకు తెలిసి పదికి పైన మంత్రిత్వ శాఖలు నిర్వహించి ఉంటరు.
రోశయ్య గారు ఉమ్మడి అసెంబ్లీలో ఆర్ధిక మంత్రిగా 15 సార్లు, ముఖ్యమంత్రిగా ఒకసారి మొత్తం 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు.. అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నాయకుల్లో రోశయ్య అగ్రగణ్యుడు.

ఇవ్వాల కొందరు నాయకులు అప్పులు చేయడానికి పోటీ పడేస్థాయికి రాజకీయాల్ని దిగజార్చారు.. 


ఇన్ని సంవత్సరాలు ఆర్ధిక మంత్రిగా చేసినా.. ఏ రోజు ఓవర్ డ్రాఫ్ట్ కు పోలేదని ఆయన గొప్పగా చెప్తుండేవారు.. ఆర్ధిక శాఖపట్ల, రాష్ట్ర ఆర్ధికరంగాన్ని పరిపుష్టం చేయడం పట్ల వారికున్న చిత్తశుద్ధికి నిదర్శనం.

ఆ రోజుల్లో కాంగ్రెస్ కు అనుకూలంగా వార్తలు రాసే పత్రికలే గానీ, కాంగ్రెస్ కు వ్యతిరేఖంగా వార్తలు రాసే పత్రికలే గానీ.. రోశయ్య గారి గురించి ఏదైన పత్యేకంగా రాయల్సి వస్తే.. అజాత శత్రువు, రాజకీయ భీష్ముడు అంటూ గొప్పగా రాసేవి.

విలువలతో కూడిన రాజకీయాలు చేసిన నికార్సైన, నిక్కచ్చి నాయకుడు కొణిజేటీ రోశయ్య గారు.

రోశయ్య గారు శాంత స్వభావులు.. అయితే ప్రభుత్వాన్ని అకారణంగా ఇబ్బందులు పెట్టాలని చూస్తే మాత్రం తనదైన చాణక్యంతో ప్రతిపక్షాలను కంట్రోల్లో పెట్టేవారు.

ఒకసారి ఒక టీడీపీ ఎమ్మెల్యే.. సభను అదేపనిగా డిస్టర్బ్ చేస్తూ... అధ్యక్ష సభ ఆర్డర్ లో లేదు.. దయచేసి ఆర్డర్ లో పెట్టండని పదే పదే స్పీకర్ ను విజ్ఞప్తి చేస్తున్నాడు.. అందరికి ఆశ్చర్యం.. అరే ఆయనే సభను నడవనివ్వకుండా అడ్డుకుంటున్నాడు.. ఆయనే సభ ఆర్డర్ లో లేదు అంటున్నాడని...

వెంటనే రోశయ్య గారు లేచి.. ఒక చిన్న కథ చెప్పడం ప్రారంభించారు.. అధ్యక్ష తండ్రిని చంపిన కేసులో ముద్దాయిగా ఉన్న యువకున్ని జడ్జి శిక్షించి చివరగా ఏదైనా కోరిక ఉంటే కోరుకో అన్నడటా.. అందుకు ఆ యువకుడు అయ్యా.. నేను తండ్రి లేని పిల్లవాన్ని దయచేసి నన్ను కనికరించి శిక్ష నుంచి విముక్తున్ని చెయ్యండన్నడా.. సదరు సభ్యుని వాలకం కూడా అచ్చం అలాగే ఉంది అంటూ సదరు టీడీపీ సభ్యునికి జ్ఞానోదయం కలిగించారు రోశయ్య గారు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటి కాదు.. ఎన్నో.. శాసనసభలో ఒకసారి కాంగ్రెస్, టీడీపీ  మధ్య తీవ్రమైన వాగ్యుద్ధం నడుస్తుంది. మైక్ తీసుకున్న చంద్రబాబు.. రోషయ్య గారు మీకు రోజు రోజుకు వయసు, కోపంతో పాటు తెలివికూడా పెరుగుతుందని వెటకారంగా కామెంట్ చేశాడు.. అప్పుడు సభంతా.. పెద్ద యుద్ధం మాదిరిగా ఉంది...
వెంటనే లేచిన రోశయ్య.. అయ్యా బాబు గారు.. నాకే తెలివి ఉంటే, అంజయ్యనో, విజయభాస్కరరెడ్డినో, చెన్నారెడ్డినో, జనార్ధనరెడ్డినో నా పక్కన ఉన్న రాజశేఖరఖ్ రెడ్డినో వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యేవాడిని.. కానీ ఇంకా ఆర్ధిక మంత్రిగానే ఉన్నాను అంటూ చురకలంటించాడు.. 
అప్పటిదాక ఢీ అంటే ఢీ గా సాగిన సభ ఒక్కసారిగా నవ్వులతో హోరెత్తిపోయింది.. దటీజ్ రోశయ్య.
రోశయ్య గారితో నాది గురుశిష్యుల అనుబంధం.. ఎప్పుడూ కలిసినా.. బావున్నవా.. వెంకట్ రెడ్డి గారు అంటూ అప్యాయంగా పలకరించేవారు.

ఒకసారి నేను రోశయ్య గారిని అసెంబ్లీ లాబీల్లో కలిసి పిటీషన్లు ఇస్తుంటే.. మీరు ఇప్పుడు సీ.ఎం గారిని కలిసాక.. దయచేసి ఈ వినతిపత్రాలన్నీ ఇవ్వకండి.. మీరు అడగ్గానే అన్నా మనం వెంకట్ రెడ్డి కి ఖచ్చితంగా ఇవ్వాలి అంటాడు.. చూస్తే ఖజనా నిండుకున్నది... నా మాట విని ఒకటి రెండు మాత్రమే అడగండి.. అవి నేను చేసి పెడతా అన్నారు.. ఆ నిబద్ధత చూసి నాకే ఆశ్చర్యం వేసింది.

వాస్తవానికి ఏ ఆర్ధిక మంత్రి అంత జాగ్రత్తగా, అంత నిజాయితీగా ఆ శాఖ ను నడిపిన వ్యక్తి లేడంటే అతిశయోక్తి కాదు..
రోశయ్య గారి గురించి చెప్పాలంటే ఒకరోజు సరిపోదు.. 
ఆయన ఒక రాజకీయ పాఠం కాదు.. గ్రంధం.
ఆయన ప్రతీ నిర్ణయంలో ప్రజాసంక్షేమం, ప్రజల ఆకాంక్షలు కనిపించేవి.

పౌరుషానికి ప్రతీకైన పల్నాటి నుంచి శత్రువులే లేని అజాతశత్రువు రోశయ్య గారు.

రోశయ్యలాంటి మంచి నాయకుడు మన నుంచి దూరం కావడం కలిచివేసేది..
 
రోశయ్యగారి ఆశయాల్ని, విలువల్ని పాటించడమే వారికి మనమిచ్చే నివాళి

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home