Monday, 2 December 2024

కొణిజేటి రోశయ్య తృతీయ వర్ధంతి సభ కు పెద్ద ఎత్తున తరలి రండి : మీడియా కోఆర్డినేటర్ కౌటికె విఠల్

 కొణిజేటి రోశయ్య తృతీయ వర్ధంతి సభ కు పెద్ద ఎత్తున తరలి రండి : మీడియా కోఆర్డినేటర్ కౌటికె విఠల్ 






హైదరాబాద్, : ఆర్యవైశ్యుల మార్గదర్శి, నిస్వార్థ రాజకీయనేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్య తృతీయ వర్ధంతి సభ డిసెంబర్ 4న హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ హాల్ నెం. 4లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, వైద్య నిపుణులు, ఆర్యవైశ్య సమాజ ప్రముఖులు హాజరుకానున్నారు.

డాక్టర్ కె.ఆర్.ఎం. ఫోరం మరియు ఫెడరేషన్ ఆఫ్ ఆవోపాస్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నలమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ మంత్రి టి.జి. భరత్, మాజీ ఎంపీ టి.జి. వెంకటేష్, ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంధి మల్లిఖార్జునరావు గౌరవ అతిధులుగా పాల్గొననున్నారు.

సభ ప్రారంభంలో స్వర్గీయ డాక్టర్ రోశయ్యకు ఘన నివాళులు అర్పిస్తారు. అనంతరం ఆయన సేవలను స్మరించుకుంటూ డాక్టర్ రోశయ్య స్పూర్తి అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఆర్యవైశ్య వైద్యుల జాతీయ వాసవీ డాక్టర్స్ డైరెక్టరీ ఆవిష్కరణ జరగనుంది. అనాథ ఆశ్రమాలకు ఆర్థిక సహాయం అందజేయడం ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

డాక్టర్ రోశయ్య గారు 1933 జూన్ 4న గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు. విద్యా జీవితంలోనే సమాజ సేవ పట్ల ఆసక్తిని పెంచుకున్న ఆయన, 1968లో శాసనమండలి సభ్యుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆర్థిక మంత్రిగా 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి తన నైపుణ్యాన్ని నిరూపించారు. బడ్జెట్ ప్రవేశపెట్టడంలో ఆయన చూపించిన స్పష్టత, నిష్పాక్షికతకు ఆర్థిక రంగంలో అపార గుర్తింపు లభించింది.

ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో ఆయన తుఫాన్లు, వరదల వంటి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ముఖ్యమంత్రిగా అందించిన శాంతి, సామరస్యపూర్ణ పాలన ప్రజల మన్ననలు పొందింది. గవర్నర్‌గా తమిళనాడులో ప్రజలతో కలిసిమెలిసి పనిచేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

“డాక్టర్ రోశయ్య జీవితమంతా ప్రజల సంక్షేమానికి అంకితమైంది. ఆయన నైతికత, నిబద్ధత, సున్నితమైన వ్యక్తిత్వం నేటి రాజకీయ నాయకులకు మార్గదర్శకంగా నిలుస్తాయి,” అని మీడియా కోఆర్డినేటర్ కౌటికె విఠల్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్యులు భారీ సంఖ్యలో హాజరై, డాక్టర్ రోశయ్య సేవలను స్మరించుకుని ఘన నివాళులు అర్పించాలని నిర్వాహకులు కోరారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home