Saturday, 9 August 2025

హైదరాబాద్ వరదల గండం నుంచి గట్టెక్కడానికి అదొక్కటే చక్కటి పరిష్కారం: రేవంత్

 హైదరాబాద్ వరదల గండం నుంచి గట్టెక్కడానికి అదొక్కటే చక్కటి పరిష్కారం: రేవంత్


          : భారీ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలమౌతోన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయాలని అన్నారు.

                       హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిసినా తట్టుకునేందుకు వీలుగా వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేయాలని ఆయన ఆదేశించారు. వరద నీటి ప్రవాహనికి ఉన్న అడ్డంకులను అధిగమించటంతో పాటు భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే అభివృద్ధికి వీలుగా పనులు చేపట్టాలని అన్నారు.

                     వర్షాలతో నగరం అతలాకుతలం కాకుండా ఉండేందుకు, జనజీవనం అస్తవ్యస్తం కాకుండా చూడటానికి.. అత్యవసరంగా శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని వివరించారు. మంచినీరు, వరద నీరు, డ్రైనేజీలు, ట్రాఫిక్ వ్యవస్థలను మరో వందేళ్ల భవిష్యత్తు అవసరాలను అంచనా వేసుకొని కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.

                     హైదరాబాద్‌లో ఇప్పుడున్న రోడ్లు, డ్రైనేజీలు 5 సెంటీమీటర్ల వర్షం పడితే తట్టుకునే పరిస్థితి లేదని, ఒక్కోసారి 20 సెంటీమీటర్ల వర్షం నమోదవుతోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జూన్ నుంచి ఇప్పటివరకు జీహెచ్ఎంసీ పరిధిలో సాధారణంతో పోలిస్తే 16 శాతం వర్షపాతం ఎక్కువగా నమోదైందని ఈ సందర్భంగా అధికారులు ఆయనకు వివరించారు.

               వాతావరణ మార్పులు, భారీ వర్షాలతో తలెత్తే ఈ విపత్కర పరిస్థితులను అధిగమించేందుకు విపత్తుల నివారణ నిర్వహణ ప్రణాళిక సమర్థవంతంగా అనుసరించాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఎంత వర్షం పడినా గ్రేటర్ హైదరాబాద్ సిటీలో వర్షపు నీటి నిల్వ ఉండకుండా, వరద నీటితో ముంపు గురవకుండా, లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా సురక్షితంగా ఉండేలా అత్యంత కడ్బందీ విధానాన్ని అమలు చేయాలని చెప్పారు.

                            హైదరాబాద్ వరదలను తట్టుకోవడానికి మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు ఒక్కటే ఆధారమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వెంటనే దీన్ని చేపట్టాలని ఆయన ఆదేశించారు. హైదరాబాద్‌లో 55 కిలోమీటర్ల పొడవునా మూసీని పునరుద్ధరించటం ద్వారా పరివాహక ప్రాంతంతో పాటు నగరంలో ఉన్న అన్ని ప్రాంతాలు, కాలనీలన్నీ సురక్షితంగా ఉండటంతో పాటు లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురి కాకుండా ఉంటాయని రేవంత్ పేర్కొన్నారు.

                       ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్‌లోని వరదనీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా నగరంలోని అన్ని వైపుల నుంచి వరద నీరు మూసీకి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, నగరంలో ఉన్న హుస్సేన్‌సాగర్, దుర్గం చెరువు, మీర్ అలం చెరువులతో పాటు ప్రతీ చెరువు, కుంటలను నాలాల ద్వారా మూసీకి అనుసంధానం చేయాలని సూచించారు.

                      చెరువుల పునరుద్ధరణ, నాలాలను వెడల్పు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, కలుషిత నీటితో మూసీ పరివాహక ప్రాంతంలో రైతులు పంటలు పండిస్తున్నారని, ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని, ఇకపై అలాంటి పరిస్థితి తలెత్తకుండా మూసీలో నిరంతరం శుద్ధి చేసిన నీటి ప్రవాహం ఉండేలా శాశ్వత ప్రణాళికలు ఉండాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

                       భవిష్యత్‌లో వందేళ్ల పాటు హైదరాబాద్ లో వరద నీటి సమస్య పునరావృతం కాకుండా ఉండాలంటే మూసీ పునరుజ్జీవనం అవసరమని తేల్చి చెప్పారాయన. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును వరద నీటి నిర్వహణకు వీలుగా డిజైన్ చేసి ఆ దిశగా పనులు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

                                     నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. వర్షాలు, వరదల సమయంలో ట్రాఫిక్ సమస్య తీవ్రత మరింత పెరుగుతుండటంతో శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

                     ముఖ్యంగా ఓల్డ్ సిటీ ఈ సమస్యను పరిష్కరించేందుకు పెడిస్ట్రియల్ జోన్‌ను ఏర్పాటు చేసి పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టాలని చెప్పారు. చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం, హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి ప్రాంతాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ జోన్‌లను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home